– తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ మోసం అర్థమైంది
– ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా కాంగ్రెస్ పార్టీ ఏ మొఖం పెట్టుకొని ఓట్లు అడుగుతుందని ప్రశ్న
– భార్యకు ఫ్రీ బస్సు ఇచ్చి, భర్తకు డబల్ రేటు, పిల్లల బస్ పాస్‌ల చార్జీలు పెంచడం కాంగ్రెస్ మోసం
– ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయడమే రేవంత్ రెడ్డి ‘ఇన్నోవేటివ్ థింకింగ్’*
– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ధ్వజం
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 22 నెలలైనా ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిందని, ఆ పార్టీ ఏ మొఖం పెట్టుకొని ఓట్లు అడుగుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ప్రశ్నించారు.
పోయినసారి జరిగిన శాసనసభ ఎన్నికల్లో రాష్ట్రమంతటా ఒకలా ఫలితాలు వస్తే, హైదరాబాద్‌లో మాత్రం ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వకుండా, అన్నీ సీట్లు బీఆర్ఎస్ పార్టీకే ఇచ్చారని ఆయన గుర్తుచేశారు. ఇప్పుడు ఆనాటికీ ఈనాటికీ మీరు పోలిస్తే, వాతావరణం ఇంకా మెరుగైందని, 22 నెలల్లో కాంగ్రెస్ పార్టీ చేసిన మోసం రాష్ట్ర ప్రజలందరికీ, ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలకు ఇంకా బాగా అర్థమైందని కేటీఆర్ స్పష్టం చేశారు.
22 నెలల్లో కొత్త రోడ్లు వేయడం, కొత్త బ్రిడ్జిలు కట్టడం కాదు కదా, ఉన్న రోడ్లను కూడా కనీసం మెయింటైన్ చేసే పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదని ఆయన విమర్శించారు. ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చలేదు కాబట్టి ప్రజలు చాలా కోపంగా ఉన్నారని, ఇది వీళ్ళు వాళ్ళు అని కాకుండా అన్ని వర్గాల ప్రజల్లోనూ ఈ కోపం కనిపిస్తోందని చెప్పారు.
ఆటో డ్రైవర్లు, నిరుద్యోగులు, మహిళలను వంచించిన కాంగ్రెస్
కేటీఆర్ మాట్లాడుతూ, హైదరాబాద్ మహానగరంలో ఉన్న లక్షా 20 వేల మంది ఆటో డ్రైవర్లను అడిగితే కాంగ్రెస్ ఏ రకంగా వాళ్ళ కడుపు మీద కొట్టిందో చెప్తారన్నారు. అట్లాగే, మొదటి సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇక్కడ హైదరాబాద్‌లో ఉండే పిల్లల్ని మోసం చేశారని మండిపడ్డారు. మహిళలకు నెలకు రూ. 2,500, వృద్ధులకు నెలకు రూ. 4,000 పెన్షన్ అన్నారు.
ఏ ఒక్క వాగ్దానం కూడా అమలు చేయకుండా ఏం మొఖం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఓట్లు అడుగుతుందని నేను అడుగుతాను అని నిలదీశారు. తప్పకుండా కాంగ్రెస్ చేసే అన్ని ప్రయత్నాలు విఫలం అవుతాయని, మళ్ళీ తిరిగి తమ అభ్యర్థి మంచి మెజారిటీతో గెలుస్తారని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
జూబ్లీహిల్స్‌లో శ్మశాన వాటిక విషయంలో వాళ్ళు మేం తెచ్చాము, బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం అని చెప్పారు. కానీ, 125 ఎకరాలు, 125 ఎకరాలు ముస్లింలకి, క్రిస్టియన్లకి శ్మశాన వాటికల కోసం 2022 లోనే కేటాయించింది బీఆర్ఎస్ ప్రభుత్వం అని ఆయన స్పష్టం చేశారు. ఇవాళ 2,500 గజాలు ఇచ్చి మేమేదో చేసినాము అని చెప్పుకుంటే అది సిగ్గుచేటన్నారు.
హైదరాబాద్‌లో స్థలాలు లేవు, స్థలం ఉన్నా వివాదాలు ఉన్నాయి. అందుకే కేసీఆర్ ప్రభుత్వం ఆనాడు 125 ఎకరాలు కేటాయిస్తూ జీవో కూడా 2022వ సంవత్సరంలో ఇచ్చిందని వివరించారు. నిన్ననే చూడొచ్చు కాంగ్రెస్ కొత్త మోసం. 2,500 గజాల స్థలం ఇచ్చాము, పండుగ చేసుకోమన్నారు. అక్కడ పోతే ఆర్మీ వాళ్ళు వచ్చి “ఇది మా స్థలం, మీరు వెళ్ళిపోండి” అని వాళ్ళు వెళ్ళగొడతా ఉన్నారు. కాబట్టి ఈ రకమైన మోసాలు కాంగ్రెస్ చేస్తూనే ఉంటుందని, ప్రజలు తిప్పి కొడుతూనే ఉంటారని ఆయన హెచ్చరించారు.
ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయడమే రేవంత్ రెడ్డి ‘ఇన్నోవేటివ్ థింకింగ్’
బస్ ఫేర్ హైక్ పెంచడం అనేది మహాలక్ష్మి స్కీమ్‌ని ఆఫ్సెట్ చేసుకోవడం కోసమేనని కేటీఆర్ ఆరోపించారు. రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు చెప్పే “ఇన్నోవేటివ్ థింకింగ్” అంటే ఏంటి అంటే… భార్యకి ఫ్రీ బస్సు ఇచ్చి, భర్తకి డబల్ రేటు, పిల్లల బస్ పాస్‌ల చార్జీలు పెంచడం. అంటే అల్టిమేట్‌గా ఒక్కొక్క కుటుంబం మీద గతం కంటే 20% ఎక్కువ భారం పడడం. ఇది ఇన్నోవేటివ్ థింకింగ్ అంటే అని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
“ప్లస్ పనిలో పని ఆర్టీసీని ప్రైవేటైజ్ చేయడానికి, ప్రైవేట్ పరం చేయడానికి మార్గం సుగమం చేసుకుంటున్నారని కాంగ్రెస్ పైన కెటిఅర్ మండిపడ్డారు. ఇవాళ ఈవీ బస్సుల పేరిట మొత్తం ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్తున్నారు. ఈవీ బస్సులు కార్పొరేషన్ నేరుగా ఎందుకు కొనకూడదు? ఎందుకు కార్పొరేషన్ నడపకూడదు?” అని ప్రశ్నించారు.
ఈ రకంగా ప్రైవేట్ పరం చేయడానికి ఆర్టీసీని ఒకవైపు, ఇంకోటి మధ్య తరగతి కుటుంబాల జేబులు గుల్ల చేయడానికి ఆర్టీసీ ఇంకా ముఖ్యంగా హైదరాబాద్‌లోనే చార్జీలు పెంచారు, బయట పెంచలేదు అని ఆరోపించారు. ఎందుకంటే వారికి తెలుసు హైదరాబాద్‌లో ఒక్క సీటు కూడా రాలేదు, మళ్ళీ భవిష్యత్తులో కూడా రాదు. కాబట్టి ఆ కోపం కూడా ప్రజల మీద తీయడానికి ఒక్కొక్క టికెట్ మీద 10 రూపాయలు పెంచారు. చాలా దుర్మార్గం అని కేటీఆర్ మండిపడ్డారు.
పండుగకు ఊరికి పోదామంటే ఒక్కొక్క బస్సు టికెట్ మీద 50 శాతానికి పైగా చార్జీలు పెంచారని ఆయన విమర్శించారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు పండగకు బతుకమ్మ చీర వచ్చేది, రంజాన్ తోఫా వచ్చేది, క్రిస్మస్ గిఫ్ట్ వచ్చేది. కానీ ఇయ్యాల పరిస్థితి ఏంది? రేవంత్ రెడ్డి గారు బస్ చార్జీలు 50 శాతం పెంచి గిఫ్ట్‌లు ఇస్తున్నారు ప్రజలకి” అని ఎద్దేవా చేశారు.
ముమ్మాటికీ సామాన్య మధ్యతరగతి ప్రజల కోపం ఈ రాబోయే ఎన్నికల్లో ప్రతిబింబిస్తుందని, దాన్ని తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అనుభవిస్తుందని కేటీఆర్ గారు హెచ్చరించారు.