-రాష్ట్ర బడ్జెట్ లో మైనార్టీలకు మొండి చెయ్యి
-మొదటి నుంచి మైనార్టీలపై కాంగ్రెస్ సవతి ప్రేమ
-100 రోజుల్లో హామీల అమలని వాటిని బొంద పెట్టారు
-క్రిస్టియన్ జనాభా కులగణనలో ఎందుకు చెప్పలేదు
-బడ్జెట్ పేరుతో అంకెల గారెడీ చేస్తున్న కాంగ్రెస్ సర్కార్
– తెలంగాణ ఫుడ్స్ మాజీ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన మైనార్టీ డిక్లరేషన్ కు గోరి కట్టిందని తెలంగాణ ఫుడ్స్ మాజీ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ మండిపడ్డారు. 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పి ఇప్పుడు వాటిని బొంద పెట్టారని దుయ్యబట్టారు.
కాంగ్రెస్ సర్కార్ అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన బడ్జెట్ కేవలం అంకెల గారడీల మాత్రమే ఉందన్నారు. మైనార్టీలను ఎన్నికల ఓట్ల కోసం వాడుకుని ఓడ ఎక్కే దాకా ఓడ మల్లన్న ఓడ దిగినాక బోడ మల్లన్న అన్నట్లు వ్యవహరిస్తుందని విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటా నుంచి మైనార్టీల మీద సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని విమర్శించారు. 15 నెలలుగా అధికారంలో ఉన్న ఇప్పటీ వరకు మంత్రివర్గంలో మైనార్టీలకు ప్రాతినిధ్యం లేదన్నారు. మొన్నటి మొన్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ విషయంలోను మొండి చెయ్యి చూపిందన్నారు. ఇప్పుడు బడ్జెట్ లో సైతం మైనార్టీలను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు.
మాటలు కోటలు దాటుతాయ్ కాళ్లు గడపలు దాటవన్నట్లు ఎన్నికల వేళ మైనార్టీలకు ఇచ్చిన హామీలకు అనుగుణంగా కాంగ్రెస్ బడ్జెట్ లలో కేటాయింపులు జరపలేదని విమర్శించారు. మైనార్టీ డిక్లరేషన్ లో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ మాదిరిగా మైనార్టీలకు రూ. 4 వేల కోట్లతో సబ్ ప్లాన్ చేస్తామని హామీ ఇచ్చి నేడు ఆ విషయాన్ని మర్చిపోయిందన్నారు.
కుల గణనను చేపట్టి.. ఉద్యోగాలు, విద్య, ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో క్రిస్టియన్ మైనార్టీలకు న్యాయమైన రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పిన సర్కార్.. కుల గణనలో క్రిస్టియన్ శాతం ఎంతో చెప్పలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు..
కాంగ్రెస్ ప్రభుత్వం 2024-25 సంవత్సరానికి రూ. 3,003 కోట్లు మాత్రమే కేటాయించిందని తెలిపారు. అందులోను ఇప్పటి వరకు కేవలం రూ. 750 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 500 రోజులు అవుతున్న అమలు చేయడంలో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందన్నారు.
అలాగే ఫాస్టర్లకు నెలకు రూ. 12 వేల గౌరవ వేతనం ఇస్తామని మత పెద్దలను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనార్టీ ఓవర్సీస్ విద్యార్ధులకు రూ. 20 లక్షల ఆర్ధిక సాయం చేయడంలో మీనమేషాలు లెక్కిస్తుందని దుయ్యబట్టారు. అంతేకాకుండా బీఆర్ఎస్ హయంలో ఉప్పల్ భగాయత్ లో నిర్మితమవుతున్న క్రిస్టియన్ ఆత్మగౌరవ భవనానికి నిధులు కేటాయించడంలో విఫలమయ్యారని తెలిపారు.
కాంగ్రెస్ సర్కార్ చేపట్టిన కులగణనలో కావాలనే క్రిస్టియన్ల జనాభా చూపించకుండా మోసం చేసిందన్నారు. క్రిస్టియన్ల జనాభా తెలంగాణలో లేనట్లు అసలు క్రిస్టియన్ శాతాన్నే చూపించలేదన్నారు. వెంటనే రీ సర్వే చేసి క్రిస్టియన్ల జనాభాను అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు.