– ఐజి సత్యనారాయణ, ఎస్పీ నారాయణ రెడ్డి
– జిల్లా కలెక్టర్ పై దాడి సర్కార్ సీరియస్
హైదరాబాద్: ఫార్మా కంపెనీ ఏర్పాటుకు అభిప్రాయ సేకరణ కోసం వెళ్లిన వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్, అధికారులపై లగచర్ల గ్రామస్థులు దాడికి పాల్పడిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
ఈ మేరకు సోమవారం అర్థరాత్రి పోలీసులు మొత్తం 28 మంది గ్రామస్థులను అదుపు లోకి తీసుకుని పరిగి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అరెస్ట్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా లగచర్ల లో భారీగా పోలీసులను మోహరించారు.
తాజాగా, ఈ ఘటనపై ఐజి సత్యనారాయణ, ఎస్పీ నారాయణ రెడ్డి లు మీడియా సమావేశం నిర్వహించారు. కలెక్టర్, అధికారులపై దాడి వెనుక కుట్ర కోణం ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
బోగమోని సురేష్ అనే వ్యక్తి కలెక్టర్‌ను తప్పుదోవ పట్టించారని తెలిపారు. అధికారులు, కలెక్టర్‌ను పక్కకు తీసుకెళ్లి ఉద్దేశపూర్వకం గానే గ్రామస్తులతో దాడి చేయించారని పేర్కొన్నారు. సురేష్‌ను బీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్యకర్తగా గుర్తించామని, అతడి స్వస్థలం హైదరాబాద్ లోని మణికొండ అని తెలిపారు.
ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా గ్రామానికి వెళ్లి అక్కడ సురేష్ గ్రామస్థులను రెచ్చ గొట్టినట్లుగా ప్రాథమిక విచారణలో వెల్లడైందని అన్నారు. ప్రస్తుతం ఆరు గ్రామాల్లో పరిస్థితి అదుపులో ఉందని, గ్రామస్తులు ఎవరూ వదంతులను నమ్మొద్దని ఆయన పిలుపునిచ్చారు.
సమగ్ర దర్యాప్తు తరువాత దాడి వెనుక ఎవరున్నా.. కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రస్తుతం సురేష్ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని ఐజీ నారాయణ రెడ్డి తెలిపారు.