Home » కుల సంఘాలను చీల్చే కుట్ర

కుల సంఘాలను చీల్చే కుట్ర

-అలాంటి పార్టీలను చీల్చి చెండాడండి
-ఏ కులంలోనైనా పేదల పక్షాన పోరాడే వారికే మనుగడ సాధ్యం
-అధికార పార్టీకి అడ్డాగా కుల సంఘాల భవనాలు
-భావి తరాలకు హిందుత్వ గొప్పతనాన్ని వివరించండి
-రాష్ట్ర మున్నూరుకాపు సంఘం నేతల ‘అలయ్ భలయ్’ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యలు
రాష్ట్రంలో కుల సంఘాలను చీల్చే కుట్ర జరుగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. కుల సంఘాలను చీల్చే పార్టీలను చీల్చి చెండాడాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. నేడు కుల సంఘాల భవనాలు అధికార పార్టీకి అడ్డాలుగా మారిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ కుల సంఘమైనా సరే…అందులోని పేదల పక్షాన పోరాడితే ఆయా సంఘాలకు మనుగడ సాధ్యమనే విషయాన్ని అన్ని కుల సంఘాల నాయకులు గుర్తించాలని కోరారు. రాష్ట్ర మున్నూరుకాపు సంఘం నేత మీసాల చంద్రయ్య ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్ లోని సిఖ్ విలేజ్ రాజరాజేశ్వరి గార్డెన్స్ లో ‘అలయ్ భలయ్’ కార్యక్రమం పేరిట రాష్ట్ర కాపు, మున్నూరుకాపు నాయకుల ఆత్మీయ సమావేశం జరిగింది.
రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి మున్నూరు కాపు సంఘం నాయకులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు ఈ సమావేశానికి పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన బండి సంజయ్ కుమార్ దాదాపు నాలుగు గంటలపాటు వారితో గడిపారు. ప్రతి ఒక్కరిని పేరు పేరునా పలకరించారు. అందరితో కలిసి ఫొటోలు దిగారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి ప్రసంగించిన మాటల్లోని ముఖ్యాంశాలు….
కుల సంఘాలు పార్టీలకు అతీతంగా తమ కులంలోని పేదలు, సమస్యల తరపున పోరాడాలి. అలాంటి కుల సంఘాల వద్దకే పదవులు, అధికారం వస్తాయి. దురద్రుష్టవశాత్తు కొందరు కుల సంఘాల నేతలు తమ ఆస్తులను, పదవులను కాపాడుకోవడానికే అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారు. కుల సంఘాలను చీల్చడానికి ఉప యోగపడుతున్నారు. నేడు అధికార పార్టీకి కుల సంఘాల భవనాలు అడ్డాగా మారుతున్నాయి. కొమ్ముకాసే పార్టీలకే కుల సంఘాల భవనాలను నిర్మిస్తామని ఆశ చూపుతున్నారు. అందుకే ఈ రోజు కుల సంఘాలు పుట్టగొడుగుల్లా విస్తరిస్తున్నాయి. కుల సంఘాలను చీల్చి మనుగడ సాధిస్తున్న పార్టీలున్నయ్. అలాంటి పార్టీలను చీల్చి చెండాడాలి.
ఏ కులంలోనైనా పేదలకు అన్యాయం జరుగుతున్నప్పుడు, వారి తరపున పోరాడే కుల సంఘాలకే మనుగడ ఉంటుంది. తమ జాతిని పక్కన పెట్టి వ్యక్తిగత మనుగడ కోసం పాకులాడే కుల సంఘాలేవీ ధీర్ఘకాలం కొనసాగలేవు. దయచేసి కుల సంఘాల నేతలు ఏ రాజకీయ పార్టీకి కొమ్ముకాయకండి. మీ కులంలోని పేదల కష్టాలు తీర్చాలనే ఉద్దేశంతోనే మిమ్ముల్ని కుల సంఘం నాయకులుగా ఎన్నుకున్నారనే విషయాన్ని విస్మరించకండి. వారి కోసం పనిచేయండి. అణగారిన వర్గాల కోసం పనిచేసే నాయకులు చెబితేనే జనం ఓట్లేస్తారు.
కుల సంఘ సభ్యులారా…వ్యాపారం లేని, పైసల్లేని నాయకులను మాత్రమే కుల సంఘం పెద్దలుగా ఎన్నుకోండి. అప్పుడే వారు ఆ కులంలోని పేదల పక్షాన కొట్లాడగలరు. అలాంటి వారి వద్దకే పదవులు, అధికారం వస్తాయి. కుల సంఘాల భవనాలు వస్తాయి. ప్రశ్నించే వాడే నిజమైన మున్నురు కాపు. పేదల తరపున కొట్లాడి సమస్యను పరిష్కరించే దిశగా క్రుషి చేసేవాడే నా ద్రుష్టిలో నిజమైన మున్నూరుకాపు.
మున్నూరు కాపులకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చే పార్టీ బీజేపీ. నాతోసహా చాలామందికి పార్టీలో అనేక పదవులు లభించడమే ఇందుకు నిదర్శనం. భారత ప్రధాని నరేంద్ర మోదీ బీసీ వ్యక్తి. సబ్బండ వర్గాల అభివ్రుద్ధి కోసం పని చేసే నాయకుడు. పేదలకు ప్రభుత్వ ఫలాలు అందాలని నిరంతరం పరితపిస్తున్న నేత.
చరిత్రలు ఎన్నడూ లేని విధంగా కేబినెట్ లో 27 మంది బీసీలకు, 12 మంది ఎస్సీలకు, ఎస్టీలకు అవకాశం కల్పించిన ఘనత నరేంద్రమోదీకే దక్కుతుంది. అగ్రవర్ణ కులాల్లోని పేదలకు రిజర్వేషన్ కల్పించిన మహానేత. పేదరికం లేని దేశాన్ని నిర్మించాలనే మహోన్నత ఆశయంతోనే పనిచేస్తూ అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తున్న నాయకుడు నరేంద్ర మోదీ. నేను, నా కుటుంబం అనే భావనకు తావులేకుండా దేశంలోని హిందూవులంతా సుఖ: సంతోషాలతో ఉండేలా సేవలందిస్తున్న నాయకుడు నరేంద్ర మోదీ.
ఓట్లు, సీట్లు, అధికారం కోసం కాకుండా భారత దేశాన్ని విశ్వగురు స్థానంలో ఉంచాలని నిరంతరం పనిచేస్తున్న మహానేత నరేంద్రమోదీ. ఒక వ్యక్తికి, వ్యక్తికి మధ్య రోజురోజూ శత్రుత్వం పెరుగుతోంది. ఈ అంతరాన్ని తొలగించేందుకు తోడ్పడే కార్యక్రమమే ‘అలయ్ భలయ్’. మున్నూరు కాపుసహా కుల సంఘాల నాయకులంతా దేశం, హిందూ ధర్మం కోసం పనిచేయాలి. హిందుత్వం లేనిదే ఏ కులం ఉండదనే విషయాన్ని విస్మరించవద్దు. బంధాలు, బంధుత్వాలుండే గొప్ప దేశం భారత్ మాత్రమే. అమెరికాలాంటి పాశ్చాత్య దేశాల్లో అంకుల్, ఆంటీ పేర్లు మాత్రమే మనుగడలో ఉన్నాయి.
భారత సంస్క్రుతిని దెబ్బతీసే కుట్ర జరుగుతోంది. దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. హిందూ సంస్ర్కుతి, సాంప్రదాయాల గురించి దేశమంతటా ప్రచారం చేయాల్సిన బాధ్యత మున్నూరు కాపులపై ఉంది. హిందూ సమాజమంతా ఐక్యంగా ఉంటేనే రామరాజ్య స్థాపన సాధ్యమవుతుంది. ఈ విషయాలు వివరిస్తూ భావి తరాలకు తగిన మార్గదర్శకత్వం చేయాల్సిన అవసరం ఉంది. లేనిపక్షంలో చరిత్ర తెరమరుగయ్యే ప్రమాదం ఉంది.
తెలంగాణలో పేదరికం లేని సమాజ నిర్మాణమే లక్ష్యంగా, ప్రజాస్వామ్య తెలంగాణను ఏర్పాటు కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలి. ఈ సమావేశానికి బీజేపీ రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్, కార్యదర్శులు జయశ్రీ, రాష్ట్ర మెజీషియన్ల సంఘం అధ్యక్షులు సామల వేణు, రిటైర్డ్ ఐజీ బాలకిషన్, ఏపీ కాపు సంఘం నేత దాసరి రాము, కర్నాటక మాజీ ఎమ్మెల్యే పాపినీడు, బుక్కా వేణుగోపాల్, ఎర్రం మహేశ్, వెంకటరమణ, అవినాష్, ప్రవీణ్, రమేశ్ తదితరులు హాజరయ్యారు.

Leave a Reply