* 14 నెలలుగా ఏమాత్రం ముందుకు సాగని పనులు
* కులగణనలో క్రిస్టియన్ల జనాభా చూపకుండా అన్యాయం చేశారు
* తెలంగాణ ఫుడ్స్ మాజీ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్
హైదరాబాద్: కాంగ్రెస్ సర్కార్ క్రిస్టియన్ ఆత్మ గౌరవ భవన నిర్మాణ పనులను అటకెక్కించిందని తెలంగాణ ఫుడ్స్ మాజీ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ మండిపడ్డారు. క్రిస్టియన్లను కాంగ్రెస్ పార్టీ కేవలం ఓట్లు వేసే యంత్రాలుగా చూస్తున్నారని దుయ్యబట్టారు. ఇవాళ ఉప్పల్ భగాయత్ లో నిర్మాణంలో ఉన్న క్రిస్టియన్ భవన్ ను క్ట్రిస్టియన్ నాయకులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా మేడే రాజీవ్ సాగర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు క్రిస్టియన్ల ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలని ఉప్పల్ భగాయత్ లో 2 ఎకరాల స్థలం కేటాయించి రూ. 10 కోట్లు క్రిస్టియన్ ఆత్మగౌరవ భవన నిర్మాణానికి మంజూరు చేసిందన్నారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లు భవన్ నిర్మాణ పనులు సాగడం లేదన్నారు. ఎక్కడ బీఆర్ఎస్ పార్టీకి పేరు వస్తుందనే అక్కసుతోనే నిర్మాణ పనులు ఆపివేశారని వివరించారు. వెంటనే నిధులు మంజూరు భవన నిర్మాణం త్వరతగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ సర్కార్ కావాలనే మైనార్టీలను చిన్నచూపు చూస్తుందన్నారు. ప్రజా ప్రభుత్వం అనే చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గంలో మైనార్టీలకు ప్రాతినిధ్యం ఇవ్వలేదని విమర్శించారు. ఎన్నికల సమయంలో మైనార్టీలను అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పి నేడు కాంగ్రెస్ దున్నపోతు మీద వర్షం పడ్డట్లు ప్రవర్తిస్తుందని దుయ్యబట్టారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీల సంక్షేమాన్ని విస్మరించి, మైనారిటీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందన్నారు. ఎన్నికల వేళ మైనారిటీల సంక్షేమ బడ్జెట్‌ను రూ. 4,000 కోట్లకు పెంచుతామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చినప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం 2024-25 సంవత్సరానికి రూ. 3,003 కోట్లు మాత్రమే కేటాయించిందని తెలిపారు. అందులోను ఇప్పటి వరకు కేవలం రూ. 750 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందన్నారు. ఈ ఏడాది బడ్జెట్ లో మైనార్టీలకు రూ. 4వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.
నిరుద్యోగ మైనార్టీ యువత, మహిళలకు సబ్సిడీ రుణాలను అందించడానికి సంవత్సరానికి 1,000 కోట్లు ఎందుకు ఇవ్వలేదన్నారు. అలాగే ఫాస్టర్లకు నెలకు రూ. 12 వేల గౌరవ వేతనం ఇస్తామని మత పెద్దలను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ సర్కార్ చేపట్టిన కులగణనలో కావాలనే క్రిస్టియన్ల జనాభా చూపించకుండా మోసం చేసిందన్నారు. క్రిస్టియన్ల జనాభా తెలంగాణలో లేనట్లు అసలు క్రిస్టియన్ శాతాన్నే చూపించలేదన్నారు. వెంటనే రీ సర్వే చేసి క్రిస్టియన్ల జనాభాను ప్రజల ముందు ఉంచాలన్నారు.