Suryaa.co.in

Andhra Pradesh

రాష్ట్ర సచివాలయం నుంచి గురుకులాలపై నిరంతర పర్యవేక్షణ

* బీసీ బిడ్డలకు నాణ్యమైన విద్య, భద్రత కల్పనే సీఎంచంద్రబాబు లక్ష్యం
* మరుగుదొడ్లు, బాత్ రూమ్ లు, మెనూపై రోజూ ఫొటోలు పంపాల్సిందే
* స్టడీ అవర్ల నిర్వహణపైనా క్లిక్ మనిపించాల్సిందే
* మంత్రి సవిత ఆధ్వర్యంలో ఫొటోల పరిశీలన
* ప్రభుత్వ అప్రమత్తతతో ఎంజేపీ స్కూళ్లో అత్యుత్తమ ఫలితాలు
* ఏటా గురుకులాల సీట్లకు పెరుగుతున్న డిమాండ్

అమరావతి : బీసీ బిడ్డల చదువుపై సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. మహత్మా బాపూజీ గురుకుల విద్యాలయాలపై ప్రత్యేక పర్యవేక్షణ చేస్తోంది. నాణ్యమైన విద్య అందిచడమే కాకుండా ఆహార, వసతి భద్రత కల్పించేలా పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. వెనుకబడిన తరగతులను అన్ని రంగాలతో పాటు విద్యలోనూ ముందుకు తీసుకురావాలన్న లక్ష్యంతో అన్న ఎన్టీఆర్ బీసీ హాస్టళ్లకు, గురుకులాలకు శ్రీకారం చుట్టారు.

పేదరికంతో బీసీ బిడ్డలు విద్యకు దూరం కాకుడదన్న సదుద్దేశంతో ఎన్టీఆర్ హాస్టళ్లను, గురుకులాలను ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో పాలన సాగిస్తున్న సీఎం చంద్రబాబునాయుడు సైతం బీసీ విద్యార్థుల చదువులపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 108 ఎంజేపీ స్కూళ్లు ఉండగా, వాటిలో 106 టీడీపీ ప్రభుత్వాలే మంజూరు చేశాయి. బీసీ విద్యార్థుల విద్యోన్నతికి టీడీపీ ప్రభుత్వాలు ఎంతటి ప్రాధాన్యమిస్తున్నాయో ఇట్టే అర్థమవుతుంది. కేవలం గురుకులాల స్థాపనతోనే సరిపెట్టకుండా నాణ్యమైన విద్య, భోజన, వసతితో పాటు నిరంతరం విద్యుత్ సదుపాయం ఉండేలా చర్యలు తీసుకుంది.

విద్యార్థులకు భద్రతకు భరోసా కల్పించేలా సీఎం చంద్రబాబునాయుడు ప్రభుత్వం గురుకులాల్లో సీసీ కెమెరాలు సైతం ఏర్పాటు చేయిస్తోంది. పరిశుభ్రమైన తాగునీటిని అందించడానికి ఆర్వో ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటోంది. దీంట్లో భాగంగా ఇప్పటికే పలు గురుకుల పాఠశాలలో ఆర్వో ప్లాంట్లను ఏర్పాటు చేశారు. నిష్ణాతులైన ఉపాధ్యాయులతో స్టడీ అవర్లు నిర్వహిస్తోంది. రాష్ట్రంలో వ్యాప్తంగా ఉన్న అన్ని గురుకుల పాఠశాలల్లోనూ కంప్యూటర్ ల్యాబ్ లు ఏర్పాటు చేస్తోంది.

తొలి విడతగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 25 గురుకులాల్లో కంప్యూటర్ ల్యాబ్ లు ఏర్పాటు చేశారు. త్వరలో మిగిలిన పాఠశాలల్లోనూ ల్యాబ్ లు ఏర్పాటు చేయబోతున్నారు. ఇందుకోసం కోట్లాది రూపాయలను ప్రభుత్వం వెచ్చిస్తోంది. బీసీ విద్యార్థులకు వెచ్చించే ప్రతి రూపాయీ సద్వినియోగం కావాలన్న లక్ష్యంతో ప్రభుత్వం గురుకులాలపై నిరంతర పర్యవేక్షణ చేయిస్తోంది.

రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఆధ్వర్యంలో గురుకుల కార్యదర్శి నేతృత్వంలో రాష్ట్ర సచివాలయం నుంచి పర్యవేక్షణ చేస్తున్నారు. గురుకులా నిర్వహణపై ప్రతి ఎంజేపీ స్కూల్ నుంచి ఏ రోజుకారోజు వాట్సాప్ ద్వారా ఫొటోలు తెప్పించుకుంటున్నారు. ఫొటోలు పరిశీలిస్తూ.. నిబంధనలు అతిక్రమిస్తే వెంటనే సరిదిద్దేలా సూచనలు చేస్తున్నారు. నిరంతరం పకడ్బందీ పర్యవేక్షణతో ఎంజేపీ స్కూళ్ల నిర్వహణపై ప్రశంసలు వెల్లువెత్తున్నాయి.

రోజూ ఫొటోలు పంపాల్సిందే…

బీసీ విద్యార్థుల భద్రతకు చంద్రబాబు అధిక ప్రాధాన్యమిస్తోంది. దీనిలో భాగంగా గురుకులా నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించింది. ఒకవైపు జిల్లా అధికారులు తరుచూ విజిట్ చేస్తున్నా… స్వయంగా గురుకుల సిబ్బందే బాధ్యత వహించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మరుగుదొడ్లు, బాత్రూమ్ లు, పరిసరాల శుభ్రత, మెనూ అమలు, ఆహార్యం నాణ్యత, స్టడీ అవర్ల నిర్వహణ ఇలా అన్నింటిపైనా వాట్సాప్ ద్వారా ఫొటోలను నేరుగా గురుకుల కార్యదర్శికి పంపేలా ఆదేశాలు జారీచేసింది.

ప్రతి రోజూ శుభ్రపరిచిన మరుగుదొడ్లు, బాత్ రూమ్ ల ఫొటోలను గురుకులాల వార్డెన్లు అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. మెనూ ప్రకారం ఆహారం తయారు చేసి, సిబ్బంది వాటిని రుచి చూసిన తరవాత విద్యార్థులకు అందిస్తారు. ఈ ఫొటో కూడా పంపాల్సి ఉంటుంది. స్టడీ అవర్ల నిర్వహణతో విశ్రాంతి గదుల శుభ్రతపైనా కూడా ఫొటోలు అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫొటోలను మంత్రి సవిత, గురుకుల కార్యదర్శి మాధవీలత ఎప్పకప్పుడు పరిశీలిస్తూ, తగిన సలహాలు సూచనలు అందజేస్తుంటారు.

గురుకుల సీట్లకు విపరీతమైన డిమాండ్

కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా బీసీ బిడ్డలకు ఎంజేపీ స్కూళ్ల ద్వారా సీఎం చంద్రబాబునాయుడు ప్రభుత్వం నాణ్యమైన విద్యనందిస్తోంది. నిష్ణాతులైన ఉపాధ్యాయుల బోధనతో ప్రతి ఏటా టెన్త్, ఇంటర్, డిగ్రీలో ఎంజేపీ స్కూళ్లు అత్యుత్తమ ఫలితాలు రాబడుతున్నాయి. ముఖ్యంగా టెన్త్ లో ఏటా వంద శాతం మేర ఫలితాలు వస్తున్నాయి. ఎంజేపీ విద్యార్థులు విద్యలో రాణిస్తూనే క్రీడల్లోనూ నైపుణ్యం ప్రదర్శిస్తున్నారు. ఎందరో విద్యార్థులు జిల్లా, రాష్ట్ర స్థాయి క్రీడల్లో సత్తా చాటుతున్నారు.

దీంతో ఎంజేపీ స్కూళ్లలో తమ పిల్లలను చేర్చడానికి విద్యార్థుల తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. ప్రతి ఏటా ఎంజేపీ స్కూళ్లలో ప్రవేశాలకు నిర్వహించే ఎంట్రన్స్ టెస్ట్ ల్లో వేలాది మంది విద్యార్థులు పాల్గొంటున్నారు. రాబోయే విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న గురుకులాల ప్రవేశ పరీక్షలకు అత్యధిక మంది విద్యార్థులు హాజరవుతున్నారు.

విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వస్తున్న డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నూతన ఎంజేపీ స్కూళ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటోంది. గడిచిన ఎనిమిది నెలల కాలంలో పెనుకొండలోని రాంపురంలోనూ, నెల్లూరు జిల్లా ఆత్మకూరులోనూ నూతన గురుకులాల స్కూళ్లను చంద్రబాబు ప్రభుత్వం ప్రారంభించింది.

LEAVE A RESPONSE