ఎవరికైనా పుట్టినరోజు
అయితే శుభాకాంక్షలు..
అదే కోవిడ్ కి అయితే..!?
మనకి వదిలిపోని ఆంక్షలు..
మహమ్మారికేమో
తీరిపోని శవాకాంక్షలు..
కేసులేమో లక్షలు లక్షలు
మానవాళికి శిక్షలు..
చైనా కక్షలు..!
వూహాన్లో మూడేళ్ల క్రితం..
ఇదే రోజున..
ఓ విధ్వంసం..
కళ్ళు తెరిచిన చైనా కుళ్లు..
రాక్షసత్వపు ఆనవాళ్లు..
కరోనా కొట్టింది బోణీ..
ప్రపంచంలో తొలి కేసు…
మొదలైన తిరకాసు..
కోరలు చాచింది నాగు..
జడలు విప్పింది బర్రి
ప్రపంచ ప్ర”గతి”కే కొర్రి..
షురూ అయింది వర్రీ..
పరుగులు తీసింది
కరోనా వేయి కాళ్ళ జెర్రి..!
ప్రపంచాన్ని అతలాకుతలం చెయ్యాలన్న
చైనా కలలు మోస్తూ..
హూ కల్లలు కాస్తూ..
ఎల్లలు దాటి..
బ్రిటన్లో బీభత్సం…
స్పెయిన్లో సుడిగుండం..
అమెరికాలో అగ్నిగుండం..
వాయువేగంతో విస్తరించి..
అడ్డుకట్ట వేయగలమన్న ఆశలు అంతరించి..
కమ్మేసింది జగాన్ని..
కుమ్మేసింది జనాన్ని..!
మాస్కులు..సానిటైజర్లు..
సామాజిక దూరాలు..
లాక్డౌన్ గాభరాలు..
ఆర్థిక భారాలు..
బ్రతుకు దుర్భరాలు..
దేశాల మధ్య దూరాభారాలు…
టెడ్రస్ రాయబారాలు..
పాత మందులు..
కొత్త చికిత్సలు..
నాటు వైద్యాలు..
నాటి చిట్కాలు..
అన్నీ దాటి
వాక్సిన్ వాకిటికి..!
ఇప్పుడిప్పుడే
చిగురిస్తున్న ఆశలు..
నిలబడుతున్న శ్వాసలు..
తెగుతున్న గొలుసులు…
తగ్గిన కేసులు..
అయినా..ఇప్పటికీ కొన్ని దేశాల్లో సామాన్య జీవితం
ఎంతెంత దూరం..
చాల్చాల దూరం..!
చైనాలో అంపశయ్యపై మానవత్వం..
దాని గోడపై
అణువణువునా క్రూరత్వం..
గుట్టు విప్పలేకపోయిన
ఆరోగ్య సంస్థ
ఆరంభశూరత్వం..
లెక్కచేయని శత్రుత్వం..
ప్రయోగాల పేరిట
రోగాలు పంచడమే
చైనా భాషలో దాతృత్వం..!
మొత్తానికి కరోనాకి మూడేళ్లు..
ఈ ఘోరకలిలో ప్రపంచం మొత్తం ఒకటైతే
చైనా ఒక్కటే ప్రతివాది..
హూ మాత్రం మౌనసాక్షి..
ఇప్పుడైనా..ఎప్పుడైనా
జాగ్రత్తలే..నిరోధక శక్తే
మానవాళికి రక్ష..
ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286