ముంబైలోని తలోజ. పరిశ్రమలకు పెట్టింది పేరు. తయారీ కంపెనీల నుంచి వచ్చే వేల టన్నుల వ్యర్థాల నిర్వహణకు ప్రాజెక్టు ఏర్పాటు చేసేందుకు అంతర్జాతీయ బిడ్డింగ్ ద్వారా ఓ సంస్థ ముందుకు వచ్చింది. స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఎదురు తిరిగారు. పనులకు అడ్డంకులు సృష్టించారు.
స్థానికులు బెదిరించినా ఆ కంపెనీ యజమాని వెనక్కి తగ్గలేదు. ప్రాజెక్టును పూర్తి చేయాలన్న కృతనిశ్చయంతో అక్కడే ఓ షెడ్డు వేసుకుని మూడు నెలలకుపైగా ఉన్నారు. తానే స్వయంగా రంగంలోకి దిగారు. ప్రాజెక్టు వస్తే ఒనగూరే ప్రయోజనాలను తెలియజేసి అందరినీ ఒప్పించారు. పారిశ్రామికంగా మహారాష్ట్ర అభివృద్ధిలో ఈ ప్రాజెక్టు వెన్నెముకగా నిలిచింది.
విజయవాడలో ఓ పెద్ద అపార్ట్‌మెంట్ నిర్మాణానికి ఓ యువకుడు పూనుకున్నాడు. పెట్టుబడి పెడతానన్న భాగస్వామి చేతులెత్తేయడంతో కష్టపడి సంపాదించిందంతా చేజారింది. లెక్కలు చూస్తే రూ.35 లక్షల నష్టం. ఒకవైపు డబ్బుల కోసం అప్పులవాళ్ల ఒత్తిడి. మరోవైపు పరువుపోతే బతకలేం అంటూ మనసు పడుతున్న ఆవేదన. ఏదైతేనేం తన సామర్థ్యాన్ని గుర్తు చేసుకున్నాడు ఆ ఇరవై అయిదేళ్ల కుర్రోడు. అప్పు కట్టితీరతాను అని వారికి మాటిచ్చాడు. మాట ప్రకారం ఏడాదిలోనే మొత్తం అప్పు తీర్చాడు.
ఆయన కెరీర్‌లో ఇలాంటి అచీవ్‌మెంట్స్ ఎన్నో. సమస్యలొస్తే వెనక్కి తగ్గని ఆయన నైజం నిజంగా ఎందరికో స్ఫూర్తి. అసలైన ఎంట్రప్రెన్యూర్‌కు చక్కని ఉదాహరణ. తానొక్కడే కాదు తన చుట్టు పక్కల వారూ ఎదగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. ఒక వ్యక్తిలో ఉన్న టాలెంట్‌ను ఇట్టే గుర్తిస్తారు.
ఆ నైపుణ్యానికి ఎలా మెరుగు పెట్టాలో తెలిసిన వ్యక్తి. ఇవాళ ఇన్‌ఫ్రా రంగంలో ఆయన స్థాపించిన సంస్థకు సుస్థిర స్థానాన్ని అందించింది. ఔత్సాహిక వ్యాపారవేత్తలకు నేనున్నానంటూ చేయి పట్టుకుని నడిపిస్తారు. ఏ ప్రాజెక్టునైనా సుస్థిర విధానంలో విజయవంతం చేయడంలో అందెవేసిన చేయి. అచీవర్స్ స్టోరీస్ సగర్వంగా అందిస్తున్న రామ్‌కీ గ్రూప్ వ్యవస్థాపకులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి సక్సెస్ స్టోరీ..
రామ్‌కీ గ్రూప్ ఇన్‌ఫ్రా రంగంతోపాటు రియల్టీ, ఫార్మా, వేస్ట్ మేనేజ్‌మెంట్ విభాగాల్లో అంచెలంచెలుగా ఎదుగుతూ భారత్‌తోపాటు 25 దేశాలకు విస్తరించింది. భారత్‌లో వ్యర్థాల నిర్వహణలోకి ప్రవేశించిన తొలి కంపెనీ కూడా ఇదే. వైజాగ్‌లో 2,400 ఎకరాల్లో జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మా సిటీ పేరుతో ఇండస్ట్రియల్ పార్క్‌ను విజయవంతంగా ఏర్పాటు చేసింది.
ఒక సెక్టార్ కోసం భారత్‌లో ఏర్పాటైన తొలి పారిశ్రామిక పార్కు ఇదే. 100 కంపెనీల దాకా ఈ పార్కులో కొలువుదీరాయి. రూ.20,000 కోట్లకుపైగా పెట్టుబడులు రాగా, 40,000 పైచిలుకు మంది ఉపాధి పొందుతున్నారు. ఆఫ్రికాలోని గెబాన్లో మొదటి ఇండస్ట్రియల్ పార్క్‌ను స్థాపించింది రామ్‌కీ ఇన్‌ఫ్రా.
రామ్‌కీ ఎన్విరో ఇంజనీర్స్ దేశంలో అతిపెద్ద హజార్డస్ వేస్ట్ ఇన్సినరేటర్ కాంప్లెక్స్‌ను ముంబైలో నిర్వహిస్తోంది. వివిధ నగరాల్లో స్థాపించిన బయో మెడికల్ వేస్ట్ ఫెసిలిటీ, ఇంటిగ్రేటెడ్ మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ఫెసిలిటీ, ఇంటిగ్రేటెడ్ రీసైక్లింగ్ ఫెసిలిటీలు భారత్‌లో అతిపెద్దవి. 14 హజార్డస్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్రాజెక్టులను నిర్వహిస్తూ సంచలనం సృష్టిస్తోంది. వీటిలో అతిపెద్దది ముంబైలో ఉంది.
వీటి నిర్మాణంలో ఎన్నో కష్టాలు పడ్డామని అంటారు అయోధ్య రామిరెడ్డి. ‘ఏదో ఒక రోజు మా కష్టాన్ని ఈ సమాజం గుర్తిస్తుంది అని ముందుకు కదిలాం. ఎన్నో స్వార్థ శక్తులు అడ్డంకులు సృష్టించేవి. అయినా నిలదొక్కుకున్నాం. సొసైటీకి మా వంతుగా తోడ్పాటు అందించామన్న ఆనందం ఉంది’ అని గర్వంగా చెప్పారు. విలువైన లోహాల రీసైక్లింగ్‌పైన రానున్న రోజుల్లో కంపెనీ ఫోకస్ చేయనుంది. మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్‌లో హైదరాబాద్‌ను రానున్న రెండేళ్లలో ప్రపంచపటంలో నిలబెట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది.
రామ్‌కీ ఎస్టేట్స్ అండ్ ఫామ్స్ కమర్షియల్, రెసిడెన్షియల్ విభాగంలో 60 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో పలు ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేసింది. వేలాది కుటుంబాల్లో చిరునవ్వు నింపింది. 3.5 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో పలు ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. రియల్టీ రంగంలో నమ్మకమైన కంపెనీగా వినుతికెక్కింది.
ఇక రామ్‌కీ ఇన్‌ఫ్రా దేశవ్యాప్తంగా సుమారు 4,000 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణం పూర్తి చేసింది. హైదరాబాద్‌కు అంతర్జాతీయంగా పేరు తెచ్చిన ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్టులోనూ పాలు పంచుకుంది. నీటిపారుదల, విద్యుత్ ప్రాజెక్టులనూ చేపట్టింది. వివిధ విభాగాల్లో నైపుణ్యం ఉన్న 1,000కి పైగా మెరికల్లాంటి ఇంజనీర్లతో విజ్ఞాన నిధిని ఏర్పాటు చేసుకుని ఏ ప్రాజెక్టునైనా అంతర్జాతీయ స్థాయిలో పూర్తి చేస్తోంది రామ్‌కీ గ్రూప్.
గుంటూరు జిల్లా పెదకాకాని అయోధ్య స్వస్థలం. వ్యవసాయ కుటుంబంలో పుట్టారు. ఆయన తండ్రి దశరథ రామిరెడ్డి దానధర్మాలతో ఉన్న ఆస్తి అంతా కరిగిపోయింది. అయోధ్య రామిరెడ్డి చదువు పూర్తి అయ్యేసరికి ఆస్తి ఏమీ మిగలలేదు. చదువులో మొదటి నుంచి ఆయన టాపర్‌గా ఉండేవారు. జాతీయ స్థాయిలో స్కాలర్‌షిప్ సైతం అందుకున్నారు.
ఉస్మానియా యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన అయోధ్య 1984లో గ్యానన్‌లో చేరారు. తొలి నెల వేతనంగా రూ.300 అందుకున్నారు. తక్కువ జీతం అంటూ కుటుంబ సభ్యులు, బంధువులు అన్నప్పటికీ ఉద్యోగంలో కొనసాగారు. కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉంటుందన్నది ఆయన నమ్మకం.
పనినే దైవంగా భావిస్తారు అయోధ్య. గ్రూప్ ప్రాజెక్టులను స్వయంగా పరిశీలిస్తారు. కార్మికుల్లో ఇట్టే కలిసిపోతారు. ప్రతి ఒక్కరి నుంచీ నేర్చుకుంటారు. భువనేశ్వర్‌లో ఓ ప్రాజెక్టు పనుల కోసం రాత్రిపూట లారీలో వెళ్లిన సందర్భమూ ఉంది. సామాన్యుల కష్టాలెరిగిన వ్యక్తి. మనసు వెన్న. ఆడంబరాలకు పోరు. సాయం చేయడంలో ఆ కుటుంబం ఎప్పుడూ ముందుంటుంది. ఆ ఒరవడిని ఆయన కొనసాగిస్తున్నారు.
35 ఏళ్ల తన కెరీర్‌లో విజయాలే కాదు వైఫల్యమూ చూశారు. ఆయన అనుభవాలే ఇవాళ ఎందరికో స్ఫూర్తి. సమాజం కోసం పరితపిస్తుంటారు. రామ్‌కీ ఫౌండేషన్ కార్యకలాపాల్లోనూ నేరుగా పాలుపంచుకుంటారు. అయోధ్య జీవిత భాగస్వామి దాక్షాయణి రామ్‌కీ ఫౌండేషన్ బాధ్యతలను భుజాన వేసుకున్నారు. ఫౌండేషన్ ద్వారా ఎన్నో సామాజిక కార్యక్రమాలను దేశవ్యాప్తంగా సక్సెస్‌ఫుల్‌గా నిర్వహిస్తున్నారు. వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఇక కుటుంబ వ్యవహారాలన్నీ దాక్షాయణి చూస్తారు. చిరుద్యోగి ఇంట ఏ కార్యమైనా శ్రీమతితో కలిసి అయోధ్య హాజరవుతారు. ఆయన వెళ్లలేకపోతే దాక్షాయణి ఆ పని పూర్తి చేస్తారు.
ఎప్పుడూ విజేతగా ఉండాలన్నదే అయోధ్య తాపత్రయం. మరొకరి కంపెనీలో పని చేసినప్పటికీ ఉద్యోగిగా కాకుండా తనను తాను యజమానిగా భావించేవారు. ఆఫీసుకు అందరికంటే ముందు వెళ్లేవారు. పని గంటలు పూర్తి అయ్యాక అందరి కంటే చివరగా వచ్చేది కూడా ఆయనే. 1987లో సొంత కన్సల్టెన్సీని ఏర్పాటు చేశారు. డిజైన్, ఇంజనీరింగ్, కన్‌స్ట్రక్షన్.. ఇలా ప్రణాళిక మొదలు నిర్మాణం పూర్తి అయ్యేదాకా వివిధ ప్రాజెక్టులకు సివిల్ ఇంజనీరింగ్ సొల్యూషన్స్ అందించారు. వన్‌స్టాప్ సొల్యూషన్స్ అందించే కన్సల్టెన్సీగా నిలబెట్టారు.
తొలి ఏడాది రూ.1.5 కోట్లు సంపాదించారు. అదే సమయంలో నిర్మాణ రంగంలో ప్రవేశించారు. విజయవాడలో అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌కు రూపకల్పన చేశారు. తన దగ్గరున్న డబ్బులన్నీ ఖర్చు చేశారు. భాగస్వామి మొహం చాటేయడంతో ఆ బాధ్యత అయోధ్యపైన పడింది. రూ.35 లక్షల అప్పు భారమైంది. పరిస్థితి చేయిదాటింది. అయినా కుంగిపోలేదు. తన మేధస్సుకు తిరిగి పదునుపెట్టారు. ఏడాదిలో అప్పులన్నీ తీర్చారు. అలవికానిచోట అధికులమనరాదన్న విషయాన్ని ఆ సంఘటన నేర్పిందని అంటారు అయోధ్య.
‘విజయవాడ అభివృద్ధి చెందని సమయంలో ప్రాజెక్టుకు నడుం బిగించడం పెద్ద తప్పిదం. దీనికితోడు అప్పు చేయడమూ సమస్యను జఠిలం చేసింది. అప్పు చేయొద్దు. సమస్యలొస్తే కుంగిపోకూడదు. వ్యాపారంలోకి ఎవరు ప్రవేశించినా పెట్టుబడిగా తెలివితేటలు, శ్రమను మాత్రమే పెట్టాలి అని అర్థం అయింది. అదే సమయంలో ధైర్యమూ సడలొద్దు’ అని అన్నారు.
15 మందితో ప్రారంభమైన రామ్‌కీ గ్రూప్‌లో ఇప్పుడు 23,000 పైచిలుకు ఉద్యోగులు ఉన్నారు. టర్నోవరు ఒకానొక స్థాయిలో రూ.6,000 కోట్ల స్థాయికి చేరింది. వేతనాలకే రూ.700 కోట్లకుపైగా ఖర్చు చేస్తున్నారంటే ఆశ్చర్యమేయక మానదు. ‘తెలుగు రాష్ట్రాల్లో మా వ్యాపారం కేవలం 5 శాతం మాత్రమే.
మిగిలినది ఇతర రాష్ట్రాలు, అంతర్జాతీయంగా వస్తున్నదే. ఇన్‌ఫ్రా రంగం దూసుకెళ్తున్న తరుణంలో తప్పుడు కేసులు చుట్టుముట్టాయి. మీడియా నెగటివ్‌గా చూపించింది. దీంతో రుణాలిచ్చేందుకు ముందుకొచ్చిన బ్యాంకులూ మొహం చాటేశాయి. చాలా ఇబ్బందులు పడ్డాం. ఏనాడూ అప్పులు ఎగ్గొట్టలేదని బ్యాంకులకు స్పష్టం చేశాం. 35 ఏళ్లుగా మా వెంట ఉన్నారు. ఇప్పుడు కూడా అదే భాగస్వామ్యం కొనసాగించాలని కోరాం.
ఒకానొక సమయంలో రామ్‌కీలో రూ.1,900 కోట్ల రుణ భారం పేరుకుపోయింది. అప్పులుంటే ఎదగలేం అన్న భావన నాది. అందుకే రుణ భారాన్ని ముందుగా తగ్గించుకోవాలని బలమైన నిర్ణయం తీసుకున్నాం. కంపెనీని కాపాడుకోవడానికి ప్రమోటర్‌గా నేను ముందుకు వచ్చాను. మూడేళ్లలో వీటిని రూ.600 కోట్ల స్థాయికి తీసుకొచ్చాం. మిగిలిన ఈ అప్పునూ కొద్ది రోజుల్లో తీర్చివేస్తాం’ అని ధీమాగా చెప్పారు.
‘1999–2001 నా లైఫ్‌లో టఫ్ టైమ్. ఇన్వెస్టర్లు ముందుకు రాక, బ్యాంకుల నుంచి రుణం సమయానికి అందక చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. నిలబడతామా లేదా అన్న పరిస్థితులు అవి. ఆరోగ్యం పాడైంది. నిద్రలేని రాత్రులు గడిపాం. కింది స్థాయి నుంచి వచ్చిన అనుభవంతో వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా వ్యూహాత్మకంగా పనిచేశాం. విలువలకు కట్టుబడ్డాం కాబట్టే తిరిగి కంపెనీని గాడిలో పెట్టాం. నా దృష్టిలో మరణం ఒక్కటే పెద్ద లాస్. అంతకు మించిన నష్టం లేదు.
ఇక్కడ ఒక విషయం సుస్పష్టం. నేను తప్పు చేయను. ధర్మం వీడే ప్రసక్తే లేదు. విలువలతో ఈ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాం. 35 ఏళ్లుగా దీనిని పాటిస్తున్నాం కూడా. అందుకే ఎవరికీ భయపడను. నాన్న దగ్గర నుంచి నాయకత్వం, నిబద్ధత నేర్చుకున్నాను. అమ్మ వీరరాఘవమ్మ నుంచి సహనం, కష్టపడేతత్వం, త్యాగం, నానమ్మ పేరమ్మ నుంచి క్రమశిక్షణ అలవర్చుకున్నాను’ అని తన మనసులో మాట చెప్పారు.
‘సమాజసేవ తాతల కాలం నుంచి మా బ్లడ్‌లోనే ఉంది. 2014లో రాజకీయాల్లోకి వచ్చే అవకాశం వచ్చింది. నరసరావుపేట నుంచి ఎంపీగా పోటీ చేశాను. అయితే ఓటమి చవిచూడాల్సి వచ్చింది. రాష్ట్రం విడిపోయాక పారిశ్రామిక విధానాలు, ప్రమాణాల పరంగా చాలా గ్యాప్స్ ఉన్నాయి. ఎన్నికల్లో గెలిచి ఉంటే పారిశ్రామికవేత్తలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం దిశగా సూచనలు చేసేందుకు అవకాశం ఉండేది. ఒక పారిశ్రామికవేత్తగా మా సలహాలు దేశానికి ఉపయోగపడేవి’ అని వివరించారు.
‘క్లిష్ట పరిస్థితుల్లో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సాయపడేవారు లేరు. దీంతో వ్యాపారవేత్తలు ఒంటరివారు అవుతున్నారు. సంపదను సృష్టించేవారు కష్టాలపాలవుతున్నారు. సమస్యల నుంచి ఎలా బయట పడాలో వీరికి అర్థం కావడం లేదు. ఇటువంటి వారికి అండగా నిలవాలని నిర్ణయించాను.
నాలాంటి వాళ్లు ముందుకొచ్చి మద్ధతు ఇస్తే నిలదొక్కుకుంటారు. నాకున్న అనుభవంతో వీరికి సాయపడతాను. ఇప్పటికే 23 మంది ఔత్సాహిక వ్యాపారవేత్తలకు సాయమందించాను. ఈ విధానాన్ని రాబోయే రోజుల్లోనూ కొనసాగిస్తాను’ అని గర్వంగా చెబుతారు అయోధ్య.
– పులగం సురేష్
జర్నలిస్ట్