– వైసీపీ ఎమ్మెల్యేలు జీరోనా?
– వాలంటీర్లకు ఉన్న విలువ కూడా వారికి లేదా?
– ఏ ఎంపికలోనూ స్థానం లేని ఎమ్మెల్యేలు
– కొన్ని చోట్ల మాత్రం బరితెగిస్తున్న ఎమ్మెల్యేలు
– ప్రాంతీయ సమన్వయకర్తలదే పెత్తనం
– జగనన్నతో భేటీకి నోచుకోలేని దుస్థితి
– మంత్రులు, ఎమ్మెల్యే, ఎంపీలకు ఇంటర్వ్యూలు ఇవ్వని అవమానం
– అంతా ఐ-ప్యాక్ సిఫార్సులే
– అధికారం లేని మంత్రులు
– సీఎంఓ పాలనలతోనే సమస్య
– మరి ఎమ్మెల్యేలు ఎలా బాధ్యులవుతార న్న ప్రశ్నలు
– నేరం నాయకత్వానిదయితే శిక్ష మాకా?
– సొంత పార్టీ సర్పంచులే కన్నెర్ర
– గ్రామల్లో నిధులు లేని దయనీయం
– దూరమవుతున్న రెడ్డి సామాజికవర్గం
– వాలంటీర్ల రాకతో గ్రామాల్లో రెడ్లకు పోయిన గౌరవం
– ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫలించని బీసీ కార్డు
– ఉత్తరాంధ్రలో బెడిసికొట్టిన బీసీకార్డు నినాదం
– సంక్షేమ పాలన చెప్పుకోలేని వైఫల్యం
– విపక్షంపై ఎదురుదాడితోనే నాలుగేళ్లు పూర్తి
– దాడులు, సీఐడీ కేసులపై తటస్థుల అసహనం
– పార్టీ ఇమేజీని భ్రష్టుపట్టించిన సీఐడీ కేసుల వ్యవహారం
– పార్టీకి అన్ని వర్గాలూ దూరం
– మహిళల దన్నుపైనే ఆశ
– టీడీపీ ఆశలకు రెక్కలు తెచ్చిన వైసీపీ వైఖరి
( మార్తి సుబ్రహ్మణ్యం)
సహజంగా ప్రభుత్వంలో ఉండే పాలకులు, తమ పార్టీ హింసను ప్రోత్సహించకుండా చూసుకుంటాయి. ఏదైనా ఘటన జరిగితే అది అవమానంగా భావిస్తాయి. అలా జరిగితే విపక్షం కంటే ముందే తానే స్పందించి, అందుకు కారకులైన తమ పార్టీ వారిపై చర్యలు తీసుకుంటాయి. అవసరమైతే ఒకరిద్దరు పార్టీ నేతలపై చర్యల కొరడా ఝళిపిస్తాయి. వెంటవెంటనే దిద్దుబాటుకు దిగుతుంటాయి.
కానీ వైసీపీ పాలన అందుకు పూర్తి రివర్సు. నాయకత్వమే విపక్షంపై హింసకు ప్రోత్సహిస్తున్న వింత వైఖరి. విపక్ష నేతపై రాళ్లు, రాడ్లతో దాడి యత్నం చేసినా.. అదే పార్టీ ఆఫీసును తన పార్టీ శ్రేణులు ధ్వంసం చేసినా..జాతీయ పార్టీ కార్యదర్శి కారును ధ్వంసం చేసినా నియంత్రించరు. పైగా తమ శ్రేణుల స్పందనలో తప్పులేదని కితాబు ఇస్తారు. విపక్ష నేతలను మంత్రులు, ఎమ్మెల్యేలతో బూతులు తిట్టించే కొత్త సంస్కృతి. అదేమంటే.. గతంలో మీరు చేయలేదా? అన్న ఎదురుదాడి.
అయితే.. గతంలో ఫలానా పార్టీ అలా చేసింది కాబట్టే తాము, ఈ స్థానంలోకి వచ్చామన్న విషయాన్ని విస్మరిస్తున్న వైచిత్రి. ఇవన్నీ ఏ పార్టీలకూ సంబంధం లేని తటస్థ, విద్యావంతులపై ప్రభావం చూపే అంశాలని తమ నాయకత్వానికి తెలియకపోవడమే విచారకరమన్నది పార్టీ సీనియర్ల వ్యాఖ్య.
అన్నింటికీ మించి.. ఎమ్మెల్యేలను ఉత్సవ విగ్రహాలను చేసిన నాయకత్వం.. ఇప్పుడు అన్నింటికీ వారినే బాధ్యులను చేసే వ్యూహం. అంటే నేరం నాయకత్వానిది-శిక్షలేమో ఎమ్మెల్యేలదీ అన్నమాట. సర్పంచుల నుంచి, మంత్రుల వరకూ ఎవరికీ అధికారాలు లేవు. ఏ ఎంపికలోనూ ఎమ్మెల్యే, మంత్రుల అభిప్రాయాలకు విలువ లేదు. కానీ శిక్ష మాత్రం ఎమ్మెల్యేలకు. అన్నీ సమన్వయకర్తలు, ఐ-ప్యాక్ సలహాలే. సర్పంచుల సొంత ఖర్చులతో చేసిన పనులకూ బిల్లులకు గతి లేదు. ఇదీ.. వైసీపీ పాలన వాస్తవ పరిస్థితి.
అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న వైసీపీ అధినేత-ఏపీ సీఎం జగనన్న తన పార్టీ ఎమ్మెల్యేలకు మరోసారి శీలపరీక్ష నిర్వహిస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో టికెట్లు ఇచ్చేదీ, లేనిదీ కుండబద్దలు కొట్టనున్నారు. మంచిదే. ప్రజాక్షేత్రంలో లేని వారికి, ‘ప్రజాభిమానం లేని నిరర్ధక ఆస్తులను’ వదిలించుకోవలసిందే. కానీ.. అసలు ఈ శీలపరీక్షలో ఎమ్మెల్యేలు శిక్షలకు ఎలా అర్హులు? నేరం ఎవరిది? శిక్ష ఎవరికి అన్నదే కీలకమైన ప్రశ్న.
151 స్థానాల్లో విజయదుందుభి మోగించి, దేశ రాజకీయాలలో కొత్త చరిత్ర సృష్టించిన జగనన్నది రాష్ట్ర రాజకీయాల్లో ఒక విశిష్ట స్థానం. తానే పెట్టుబడి పెట్టి ఎమ్మెల్యేలను గెలిపించుకున్న చరిత్ర ఆయనది. కాబట్టి ఏ ఎమ్మెల్యేకూ పార్టీపై పేటెంటీ లేనట్లే లెక్క. కాబట్టే వారంతా నామమాత్రా వశిష్టులుగా మారారు. ఎమ్మెల్సీ ఎన్నికలొచ్చినా, జడ్పీ చైర్మన్ ఎన్నికలొచ్చినా, రాజ్యసభ ఎన్నిక లొచ్చినా వారి అభిప్రాయాలతో పనిలేదు. ఎవరిని ఎంపిక చేయాలన్నది జగనన్న ఇష్టం. అందుకు ప్రాంతీయ సమన్వయకర్తలు, ప్రశాంత్ కిశోర్ ఐ -ప్యాక్, తన సొంత మీడియా వేగుల సిఫార్సులే ప్రధానం.
ఏ నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే అవినీతికి పాల్పడుతున్నాడు? ఎంత మేరకు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు? అని తెలుసుకునేందుకు సర్కారీ నిఘా దళాలతో పాటు, ఐ-ప్యాక్, సొంత మీడియా బృందాలు నిరంతరం నిఘా పెడుతుంటాయి. ఏ ఎమ్మెల్యేల మాట వినాలని సీఎంఓనే, జిల్లా కలెక్టర్లు-ఎస్పీలకు దిశానిర్దేశం చేస్తుంటుంది. ఏ ఎమ్మెల్యే ఏం చేయాలో కూడా సీఎంఓనే ఆదేశిస్తుంది. జగనన్న పాలనలో సీఎంఓ-ఇంటెలిజన్స్ జమిలిగా కీలకపాత్ర పోషిస్తున్నాయన్నది మనం మనుషులం అన్నంత నిజం. ఈ క్రమంలో ఎమ్మెల్యేలు ఆరోవేలుగా మారడమనేది సహజమైన ప్రక్రియ. ఏపీలో ఇప్పుడు అదే జరుగుతోంది.
అయితే కొంతమంది నోరున్న ఎమ్మెల్యేలు, జగన్ కోటరీతో సాన్నిహిత్యం ఉన్న ఎమ్మెల్యేలు, సీఎంఓ గుడ్‌లుక్స్‌లో ఉన్న ఎమ్మెల్యేలు మాత్రం విచ్చలవిడిగా దోచుకుంటున్నారన్నది పార్టీ వర్గాల్లో ఒక టాక్. చిత్తూరు, బాపట్ల, కృష్ణా, నెల్లూరు, కడప, కర్నూలు జిల్లాల్లోని ఎమ్మెల్యేలకు కప్పం కట్టనిదే ఏ పనీ జరగదన్నది బహిరంగ రహస్యం. బాపట్ల జిల్లాలో అసైన్డ్ భూములపై వాలిన పెద్ద గద్దల ధాటికి, సొంత పార్టీ ఎమ్మెల్సీలే తాళలేక పోతున్నారు.
బాపట్ల, ఒంగోలు, గుంటూరు జిల్లాలకు చెందిన ఓ ఐదారుగురు ఎమ్మెల్యేలకు.. గ్రానైట్ లారీలకు సంబంధించిన దందాలో నెలకు 9 కోట్ల రూపాయలు గిట్టుబాటవుతోందన్నది పార్టీలో అంతర్గత చర్చ. వేబిల్లులు లేకుండా ఏపీ సరిహద్దులు దాటుతున్న ఈ దందా పార్టీలో అందరికీ తెలిసిందేనట. ఇక బాపట్ల జిల్లాలో జరుగుతున్న మెడికల్ కాలేజీ, నేషనల్ హైవే నిర్మాణానికి ఇసుక సరఫరా పేరుతో.. ఓ మాజీ ఎమ్మెల్యే ఇసుక లారీలను బెంగళూరు, తమిళనాడుకు తోలేస్తున్నారట. దీనికి ‘సాధుజీవి’గా పేరున్న ఓ ఎమ్మెల్యే వాటా కూడా ఉందన్నది వైసీపీ వర్గాల అంతర్గత చర్చ. ఆయన ఆధ్వర్యంలోనే 250 ఎకరాల అసైన్డ్ భూములకు స్కెచ్ వేశారట.
దీనికి సంబంధించి బాపట్ల జిల్లాకు చెందిన ఓ సీనియర్ ఎమ్మెల్సీ, స్వయంగా సీఎం జగన్‌కే ఫిర్యాదు చేశారట. తన పొలం మధ్యలో , పార్టీ మారిన ఓ మాజీ ఎమ్మెల్యేకు చెందిన ఇసుక లారీలు వెళ్లడంతో, తాను నష్టపోతున్నానన్నది ఆ సీనియర్ ఎమ్మెల్సీ ఫిర్యాదట. సాధుజీవి ఎమ్మెల్యే, పార్టీ మారిన ఈ మాజీ ఎమ్మెల్యే కలసి, అసైన్డ్ భూములను ఏవిధంగా చప్పరించేందుకు స్కెచ్ వేశారో అన్ని విషయాలు.. సదరు సీనియర్ ఎమ్మెల్సీ, పూసగుచ్చినట్లు సీఎంకు వివరించినట్లు సమాచారం.
బాపట్ల జిల్లాలో వందల ఎకరాల అసైన్డ్ భూములను ఓ ఎమ్మెల్యే, మరో మాజీ ఎమ్మెల్యే కలసి స్వాధీనం చేసుకునేందుకు స్కెచ్ వేస్తే, జిల్లా కలెక్టర్ అడ్డుపడి.. సదరు అసైన్డ్‌భూముల్లో పాగా వేసిన మాజీ ఎమ్మెల్యే బినామీలకు నోటీసులిచ్చి, ఆ భూములను స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు ప్రారంభించారట. ఆ భూముల్లో ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించాలని నిర్ణయించారట.
జగనన్న కోటరీతో సాన్నిహిత్యం ఉన్న కొందరు ఎమ్మెల్యేలు, ఈవిధంగా రెచ్చిపోతున్నారన్నది వైసీపీ వర్గాల టాక్. అనంతపురం, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో కూడా కొందరు ఎమ్మెల్యేలది ఇదే పరిస్థితి. సీఐ, ఎస్‌ఐ, డీఎస్పీ, మున్సిపల్ కమిషనర్లు వంటి బదిలీలు తప్ప, ‘మెజారిటీ ఎమ్మెల్యేలకు’ ఎలాంటి విషయాల్లో విలువ లేదన్నది ఒక ఆవేదన.
ఇక ఏ ఎంపికలోనూ తాము నామమాత్రా వశిష్టులమైనప్పుడు, గెలుపు-ఓటములకు తామెలా బాధ్యులమవుతాం? తమనెలా బాధ్యులను చేస్తారన్నది మెజారిటీ ఎమ్మెల్యేల ప్రశ్న. ఇటీవలి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరూ తమ అభిప్రాయాలను అడగలేదని ఎమ్మెల్యేలు చెబుతుంటే, మంత్రులు కూడా అదే చెబుతున్న వైచిత్రి. విశాఖ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో మాజీ మంత్రి దాడి వీరభద్రరావును ఎంపిక చేయాలని తాము సూచిస్తే, ఎవరికీ తెలియని వ్యక్తికి టికెట్ ఇచ్చి ఓడిపోతే అందుకు తామెలా బాధ్యులమవుతామని నిలదీస్తున్నారు. తమ ప్రమేయం లేకుండా.. వాలంటీర్లను అనుసంధానకర్తలుగా చేసి.. ‘నేరుగా ఓటర్లతోనే సంబంధాలు పెట్టుకునే కొత్త తరహా రాజకీయ ప్రక్రియ’లో తమ పాత్ర ఏమిటన్నది వారి ప్రశ్న.
నిజానికి వాలంటీర్లకు ఉన్న విలువ కూడా తమకు లేదన్నది వారి వాదన, ఆవేదన. తమపై ప్రాంతీయ సమన్వయకర్తలను రుద్దిన నాయకత్వం.. జయాపజయాలకు వారినే బాధ్యులను చేయాలి తప్ప, దానితో తమకేం సంబంధమన్నది మరో ప్రశ్న. నియోజకర్గంలో అభివృద్ధి పనులకు నిధులివ్వకపోతే, ప్రజలు నిలదీయడం సహజమని, గడప గడపకు ప్రభుత్వంలో అదే జరుగుతోందని వారు స్పష్టం చేస్తున్నారు.
చిన్న చిన్న పనులకూ నిధులు లేకపోతే, ప్రజల్లో ప్రభుత్వంపై అసంతృప్తి సహజమంటున్నారు. ఎన్ని బటన్లు నొక్కినా కళ్లముందున్న సమస్యలు పరిష్కరించకపోతే, ప్రజల్లో సంతృప్తి ఉండదని స్పష్టం చేస్తున్నారు. చివరకు కాంట్రాక్టర్లు కూడా తమ మాట వినే పరిస్థితి లేకుండా పోతయిందంటున్నారు. ప్రభుత్వం నుంచి డబ్బులు రానందున, తాము పనులు చేయలేమని నిర్మొహమాటంగా చెబుతున్న పరిస్ధితి సీఎంఓకు గానీ, ప్రాంతీయ సమన్వయకర్తలకు గానీ తెలుసా అని ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు.
చివరకు పార్టీ కోసం సర్వం త్యాగం చేసిన సర్పంచులు కూడా, పార్టీకి దూరమయ్యే పరిస్థితి ఉందని ఎమ్మెల్యేలు వాపోతున్నారు. సర్పంచులు సొంత సొమ్ము పెట్టి చేసిన పనులకు.. ఇంతవరకూ బిల్లులివ్వకపోతే, అందుకు తామెలా బాధ్యులమవుతారమన్నది ఎమ్మెల్యేల ప్రశ్న. గత ఎన్నికల ముందు తమకు విరాళాలు ఇచ్చిన కాంట్రాక్టర్ల బిల్లులను ఇప్పించలేని, ప్రాంతీయ సమన్వయకర్తలు-జిల్లా మంత్రులు- సీఎంఓ వైఫల్యానికి తామెలా బాధ్యులమవుతామన్నది వారి వాదన. ఈ విషయంలో జిల్లా కలెక్టర్లు, జిల్లా ఇన్చార్జి మంత్రులు, చివరకు సీఎంఓ అధికారులకు సిఫార్సు చేసినా ఫలితం లేదంటున్నారు.
ఈ పరిస్థితిలో పార్టీ కోసం పనిచేసిన… రెడ్డి సామాజికవర్గం కూడా దూరమయ్యే ప్రమాదం ఏర్పండిదన్నది ఎమ్మెల్యేల ఆందోళన. పార్టీపై అభిమానంతో సొంత వనరులు ఖర్చు చేసుకున్న రెడ్డివర్గం నేతలు, పార్టీ వ ల్ల తాము అప్పులపాలయ్యామన్న ఆగ్రహంతో ఉన్నారు. వాలంటీర్ల రాకతో, దశాబ్దాల నుంచి గ్రామ రాజకీయాల్లో పెత్తనం చేసే తమకు గౌరవం తగ్గి, వాలంటీర్లకు ఆ గౌరవం పెరిగిందని చెబుతున్నారు.
వాలంటీరు వ్యవస్థ వచ్చిన తర్వాత, ఇప్పుడు గ్రామంలో తమను పట్టించుకునే వారేలేరంటున్నారు. పైగా వాలంటీర్లు పార్టీ పక్షాన తమపై నిఘా వేస్తున్నారని మండిపడుతున్నారు. పేరుకు రెడ్డి పార్టీ అయినప్పటికీ, దళితులకే ఎక్కువ లబ్థి జరుగుతోందని వారు స్పష్టం చేస్తున్నారు. ‘మా ప్రభుత్వంలో రెడ్లు అస్థిత్వం కోల్పోయారు. కనీస గౌరవం లేని దయనీయం. టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా, నాలుగేళ్ల ముందు వరకూ గ్రామాల్లో అంతా మా దగ్గరికే వచ్చేవాళ్లు. ఇప్పుడు వాలంటీర్లు, సచివాలయాలకు వెళుతున్నారు. ఏమీ చేయకపోయినా సరే రేపటి ఎన్నికల్లో రెడ్లు మా పార్టీకి వేస్తారన్న భ్రమల్లో మా నాయకత్వం ఉంది. మహా అయితే మా ఓటు మేం వేసుకుని ఇంట్లో కూర్చుంటాం. గతంలో మాదిరిగా ఓట్లు వేయించే పరిస్థితి ఇప్పుడు లేదు. ఇదంతా పార్టీ స్వయంకృతమే’నని ప్రకాశం జిల్లాకు చెందిన ఓ రెడ్డి సర్పంచ్ విశ్లేషించారు.
ఇలాంటి పరిణామాలతో సర్పంచులను కలిసేందుకు కూడా ముఖం చెల్లడం లేదని ఎమ్మెల్యేలు చెబుతున్నారు. పోనీ తమ దుస్థితి చెప్పుకునేందుకు జగనన్న అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నిస్తే, మంత్రులకే ఆయన ఇంటర్వ్యూలు దొరకని దుస్థితి ఉందని, ఎమ్మెల్యేలు ప్రస్తుత పరిస్థితిపై కుండబద్దలు కొడుతున్నారు. తాము ఎంత సేపటికి ప్రాంతీయ సమన్వయకర్తలు, ప్రభుత్వ సలహాదారు సజ్జలకు చెప్పుకోవడం తప్ప, సీఎంను కలిసే పరిస్థితి లేకపోవడం అవమానకరంగానే ఉందంటున్నారు. ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులను కలవని ముఖ్యమంత్రులను తమ రాజకీయ చరిత్రలో ఇప్పుడే చూస్తున్నామని సీనియర్ ఎమ్మెల్యేలు వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి.
‘‘మేం ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులం. సీఎంను కలసి సమస్యను వివరించాలని కోరుకుంటాం. కానీ దానికి బదులు ప్రాంతీయ సమన్వయకర్తలు, సలహాదారులను కలవమనడం ఏమిటో అర్ధం కావడం లేదు. అసలు వారంతా ఎవరు? మా పరిస్థితి ఇంత అవమానకరంగా ఉంది. మేం టీడీపీలో ఉన్నప్పుడు ఇలాంటి పరిస్ధితి ఎప్పుడూ చూడలేదు. ఏదో ఒక సమయంలో సీఎం కలిసేవారు. ఎవరైనా రాజకీయాల్లో గౌరవం కోరుకుంటాం. కానీ ఇక్కడ అదే కనిపించడం లేదు. ఇవన్నీ సారుకు చెబుతామంటే ఆయన ఇంటర్వ్యూ దొరకదు’’ అని ఓ సీనియర్ ఎమ్మెల్యే వాపోయారు.
151 సీట్లు సాధించిన తమ పార్టీ ఇప్పుడు కష్టాల్లో పడటం స్వయంకృతమేనని పలువురు ఎమ్మెల్యేలు విశ్లేషిస్తున్నారు. టీడీపీ ఆఫీసుపై దాడికి ముందు.. మనుగడ ప్రశ్నార్ధకమయి, ఇన్చార్జిలు కూడా తమకు వద్దని చెప్పిన పరిస్థితి నుంచి, ఇప్పుడు నాలుగు ఎమ్మెల్సీ సీట్లు సాధించి, తమ పార్టీని సవాల్ చేసే స్థాయికి తామే తీసుకువచ్చామని పలువురు ఎమ్మెల్యేలు విశ్లేషిస్తున్నారు. టీడీపీ నేతలపై కేసులు, సీఐడీ వేధింపులు, కక్ష సాధింపులతో ఆ పార్టీలో కసికి తామే కారణమయ్యామంటున్నారు.
నిజానికి టీడీపీని.. దాని మానానికి దానిని వదిలేస్తే, ఇప్పటికీ కోలుకునేది కాదని చెబుతున్నారు. తనను కాంగ్రెస్ వేధించిందన్న కసి.. జగనన్నను అధికారంలోకి తీసుకువస్తే, అదే సూత్రం టీడీపీకి సైతం వర్తిస్తుందని తెలుసుకోకపోవడమే అమాయకత్వమని విశ్లేషిస్తున్నారు. వైనాట్ 715 అని ధీమాతో ఉన్న నాయకత్వానికి, టీడీపీ-జనసేన ఎవరితో కలసి పోటీ చేస్తే ఎందుకంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలకు మాక్ పోలింగ్ నిర్వహణ, రోజూ విపక్షాలపై ఎదురుదాడి చూస్తుంటే.. తమ నాయకత్వం ప్రస్తుత పరిణామాలకు అంతర్గతంగా భయపడుతూ, మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నట్లు స్పష్టమవుతోందని ఓ ఎమ్మెల్సీ విశ్లేషించారు. నిజంగా అంత ధీమా ఉంటే, ఇవన్నీ అవసరం లేదంటున్నారు.