దాదాపు 1370 కాంతి సంవత్సరాల దూరంలో లక్ష నుంచి రెండు లక్షల సంవత్సరాల వయసున్న బేబీ స్టార్ హెచ్ఓపిఎస్ 315 చుట్టూ ఉన్న వేడి గాలుల వాతావరణంలో గ్రహవ్యవస్థ ఆవిర్భావ పరిణామాలు సంభవిస్తున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు.నక్షత్రం చుట్టూ సిలికాన్ మోనాక్సైడ్
వాయువుతో పాటు స్పటికాకృతి కలిగిన సిలికేట్ ఖనిజాలు ఘనీభవిస్తున్నట్టు తెలిపారు. చిలీ దేశంలోని అటకామా ఏడారిలో యూరోపియన్ సౌత్ అబ్సర్వేటరీ [ఈఎస్ఓ] కి చెందిన అల్మా టెలిస్కోపు నెట్వర్క్ ఈ దృశ్యాన్ని చిత్రీకరించింది. హెచ్ఓపిఎస్ 315 నక్షత్రం చుట్టూ గ్రహ వ్యవస్థ పూర్తిగా ఏర్పడటానికి 10 లక్షలు లేదా అంతకన్నా ఎక్కువ సంవత్సరాలు పట్టవచ్చన్నది శాస్త్రవేత్తల అంచనా. భవిష్యత్తులో ఈ నక్షత్రం చుట్టూ కూడా 8 గ్రహాలు ఏర్పడే అవకాశం ఉందనీ, దీనిలో సూర్యుడికి సమానంగా గ్యాస్ డిస్క్ ఉందని సైంటిస్టులు భావిస్తున్నారు. ఇలాంటి కొత్త గ్రహ వ్యవస్థలను ఎక్కువగా గమనించడం ద్వారా భూమి లాంటి గ్రహాల ఏర్పాటులో ఎలాంటి ప్రక్రియలు కీలకంగా ఉంటాయో తెలుసుకోవచ్చు.
– సూరజ్