-
గ్రీవెన్స్ లో న్యాయం కోసం వేడుకోలు
-
బాధితులకు నేతల హామీ
మంగళగిరి: గత అరాచక పాలన వల్ల అంధకారంలో ఉన్న రాష్ట్రంలో వెలుగులు నింపడమే లక్ష్యంగా… ప్రజాసేవే పరామావధిగా.. ప్రజల సమస్యలు తీర్చడమే ధ్యేయంగా.. ప్రజా బంధువు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టిన వెంటనే అడుగులు వేయగా.. అధినేత సంకల్పానికి తోడై మంత్రులు నేతలంతా ముందుకు సాగుతున్నామని మంత్రి టీజీ భరత్, ఎమ్మెల్సీ అశోక్ బాబు, ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్, టీడీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ముస్తాక్ అహ్మద్ అన్నారు.
మంగళగిరి తెలుగుదేశం పార్టీ(టీడీపీ) జాతీయ ప్రధాన కార్యాలయంలో వారు అర్జీలు స్వీకరించారు. సంబంధిత అర్జీలపై అధికారులకు ఫోన్లు చేసి సమస్యలను వివరించి పరిష్కరించేందుకు కృషి చేశామన్నారు. పరిశీలించి పరిష్కరించాల్సిన అర్జీలను ఆయాశాఖలకు పంపి పరిష్కారానికి ఆదేశించామన్నారు.
గత ప్రభుత్వం ప్రజల సమస్యలను ఏనాడు పట్టించుకోలేదని.. నాటి పాలకులు ప్రజలపై దెయ్యాల్లా పడి పీడించారని.. ప్రజల రక్తం తాగి ప్రశ్నిస్తే వారి ప్రాణాలు తీశారని నేతలు విమర్శించారు. నేడు ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఏ చిన్న సమస్య ఉన్నా తమ సమస్యకు పరిష్కారం దొరకుతుందన్న నమ్మకంతో ప్రజలు కూటమి నేతల వద్దకు క్యూ కడుతున్నారన్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించి వారి ముఖాల్లో ఆనందం చిరునువ్వులు చూడటమే తమ ధ్యేయమన్నారు. టీడీపీ ఆధ్వర్యంలో పలువురికి ఆర్థిక సాయం నిమిత్తం చెక్కులు అందించారు.
2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 1986 లో ప్రభుత్వం ఇచ్చిన భూములు దాదాపు 430 ఎకరాలను ఆ పార్టీ నేతలు కబ్జా చేశారని శ్రీ సత్యసాయి జిల్లా పెనుంగొండ నియోజకవర్గం సోమందేపల్లి మండలం పోలే పల్లి గ్రామానికి చెందిన బాధితులు అంజినప్ప, మారెప్ప, సాదరి గొవిందప్ప, యలవ నారాయణప్ప ఆదేమ్మ, బుడ్డయ్యలు గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశారు. కబ్జాదారుల నుండి తమ భూములను విడిపించాలని నేతలను వేడుకున్నారు.
హిందూపురం మండలం జంగాలపల్లికి చెందిన అలివేలమ్మ, చిన్నతిమ్మరాయప్ప, అశ్వర్థప్పలు నేడు గ్రీవెన్స్ లో నేతలకు అర్జీని ఇస్తూ.. వైసీపీ నేత నరసింహులు తమ భూములను కాజేయాలని తమకు మంజూరైన 1బిలను రద్దుచేయించి పొలంలోకి వెళితే తమను కొడుతున్నారని.. అతనికి పోలీసులు సహకరిస్తున్నారని తమకు న్యాయం చేయాలని బాధితులు గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశారు.
తిరుపతి జిల్లా రేణిగుంట మండలం కరకంబాడి పంచాయతీకి చెందిన బి.గీత, పి. జయమ్మ, చెంచులక్ష్మి, జయలక్ష్మి లు విజ్ఞప్తి చేస్తూ.. తమ ఇళ్లు నేషనల్ హైవే రోడ్డు నిర్మాణంలో పోతున్నాయని.. దానికి సంబంధించిన పరిహారం ఇవ్వడానికి వైసీపీ నేతలతో రేణిగుంట రెవెన్యూ అధికారి కోటేశ్వరరావు కుమ్మక్కై లంచం డిమాండ్ చేశారని.. తాము ఇవ్వలేమని చెప్పడంతో.. తమకు రావాల్సిన పరిహారాన్ని తగ్గించేశారని.. తమ పక్కన ఉన్న వైసీపీ నేతలకు చెందిన రేకుల షెడ్ కు మాత్రం రూ. 18,00,000 లక్షలు కొంత మందికి 40 లక్షల నుండి 60 లక్షల వరకు ఇంటికి మంజూరు చేయించారని.. తమకు న్యాయం చేయాలని వారు గ్రీవెన్స్ లో వేడుకున్నారు.
అనంతపురం జిల్లా పుట్లూరు మండలం నారాయణపల్లె గ్రామానికి చెందిన పొత్తూరి రవికుమార్ విజ్ఞప్తి చేస్తూ.. తమ గ్రామం గత ప్రభుత్వంలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని.. తమ గ్రామంలో కనీస మౌలిక సదుపాయాలు కూడా లేవని.. గ్రామానికి ఇంత వరకు రోడ్డు లేదని.. దయచేసి తమ గ్రామానికి రోడ్డు వేయాలని రవికుమార్ నేతలకు వినతి పత్రం ఇచ్చారు.
తాను తన మద్దతుదారులు టీడీపీలో చేరడంతో టాంజానియాకు వెళ్ళిన తనకొడుకుపై అక్కడకు పంపిన ఏజెంట్ వైసీపీ సానుకూలపరుడు కావడంతో అక్కడ అక్రమ కేసులు పెట్టించారని.. తన కుమారుడిని తిరిగి ఇండియాకు రప్పించాలని సత్యసాయి జిల్లా ఓబులదేవర చెరువు మండలం తంగేడు కుంట గ్రామాని చెందిన సోమశేకర్ రెడ్డి గ్రీవెన్స్ లో వేడుకున్నారు.
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం తాడేపల్లికి చెందిన జూటూరు మంగమ్మ విజ్ఞప్తి చేస్తూ.. తాను పేదరాలునని తనకు యాక్సిడెంట్ లో కాలు చేయి విరిగాయని ఎటువంటి పనులు చేసుకోలేనని, తనకు పింఛన్ పెట్టించవలసిందిగా ఆమె అర్థించారు.
కడప జిల్లా పోరుమామిళ్ల మండలం సిద్దనకిచామపల్లెలో ఎంపీపీ స్కూల్ లో పనిచేస్తున్న హెడ్ మాస్టర్ వైసీపీ నేతలకు అనుకూలంగా పనిచేస్తూ.. బడిపిల్లలను ఇబ్బంది పెడుతున్నారని దాన్ని ఎంఈవో దృష్టికి తీసుకెళ్లామని.. అతనిపై చర్యలు తీసుకోవాలని ఆగ్రామానికి చెందిన నారాయణ, రోశయ్యలు గ్రీవెన్స్ లో విజ్ఞప్తి చేశారు.