Suryaa.co.in

Andhra Pradesh

నేరం రుజువైతే కఠిన చర్యలు తీసుకోండి

– గుడ్లవల్లేరు ఘటనపై కలెక్టర్, ఎస్పీలకు సీఎం ఆదేశం

అమరావతి: కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో రహస్య కెమెరాలు పెట్టారనే అంశంపై జరుగుతున్న విచారణను సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఉదయం ఘటన విషయం తెలిసిన వెంటనే జిల్లా అధికారులను, మంత్రి కొల్లు రవీంద్రను, జిల్లా ఎమ్మెల్యేలను కళాశాలకు వెళ్ళాలని ఆదేశించారు. ఉదయం నుంచి అక్కడ జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు. కలెక్టర్, ఎస్పీలతో ఫోన్ లో మాట్లాడి విచారణ సాగుతున్న విధానంపై వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థినుల ఆందోళనను, ఆవేదనను పరిగణలోకి తీసుకుని పటిష్ఠ దర్యాప్తు జరపాలని ఆదేశించారు.

రహస్య కెమెరాల ద్వారా వీడియోల చిత్రీకరణ జరిగిందన్న విషయంలో నేరం రుజువైతే కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మన ఇంట్లో ఆడబిడ్డలకు కష్టం వస్తే ఎలా స్పందిస్తామో…అంతే సీరియస్ గా స్పందించి నిజాలు నిగ్గు తేల్చాలని ఆదేశించారు. ఆందోళనలో ఉన్న వారికి ఒక భరోసా కల్పించాలని సీఎం ఆదేశించారు. విద్యార్థుల ఫిర్యాదుపై యాజమాన్యం నిర్లక్ష్యం వహించిందన్న ఆరోపణపైనా విచారణ జరపాలన్నారు.

కాలేజీ యాజమాన్యం, అధికారుల అలసత్వం ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యార్థినుల వద్ద ఆధారాలు ఉంటే…నేరుగా తనకే పంపాలని ఆయన కోరారు. స్టూడెంట్స్ ఎవరూ అధైర్య పడవద్దని, తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఆడబిడ్డల పట్ల తప్పుగా ప్రవర్తించారని తేలితే కఠిన చర్యలు ఉంటాయని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రతి మూడు గంటలకు ఒకసారి తనకు ఘటనపై రిపోర్ట్ చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.

LEAVE A RESPONSE