కుంభకర్ణుని మరణం

అవమాన భారంతో కృంగిన రావణుడు తన సోదరుడైన కుంభకర్ణుని నిదురలేపమని మంత్రులను పంపాడు. భేరీ భాంకారాలు చేసి, శూలాలతో పొడిచి, ముసలాలతో మోది, ఏనుగులతో త్రొక్కించి, ఏనుగులతో త్రొక్కించి వారు కుంభకర్ణుని నిదురనుండి లేపారు. లేవగానే కుంభకర్ణుడు మాంసరాసులను సుష్ఠుగా తిని, కుండలతో రక్తం త్రాగి, త్రేవ్చాడు. విషయం తెలుసుకొని, స్నానం చేసి, సర్వాభరణాలు ధరించి, బలకరమైన మద్యం భాండాలతో త్రాగి రావణుని చెంతకు వెళ్ళాడు. అతను నగరంలో నడుస్తుంటేనే భయంతో వానరసేనలు కకావికలమయ్యాయి. అంత వీరుడు రాక్షసులలో మరొకరు లేరని విభీషణుడు చెప్పాడు. అది ఒక యంత్రమని, రాక్షసుడు కాదని, వారు చెప్పి వానర సేనను స్థిమిత పరచారు.
రావణుడు కుంభకర్ణుడికి జరిగిన విషయం వివరించాడు. అనాలోచితంగా రావణుడు చేసిన చెడ్డపనులను సోదర ప్రేమతో నిందించాడు కుంభకర్ణుడు. కపటంతో సీతను మోసపుచ్చాలన్న మహోదరుని సూచన కూడా కుంభకర్ణునికి రుచించలేదు. తాను రామలక్ష్మణులను, సకల వానర సేనను భక్షించి పరిస్థితిని చక్కదిదద్దుతానని, రావణుడికి మాట యిచ్చి, అగ్నిలా వెలిగిపోతూ, కాలపాశ సదృశమైన పరిఘను పట్టుకొని, కోట గోడను ఒక్క అడుగులో దాటి యుద్ధానికి బయలుదేరాడు. ఆరు వందల ధనువుల యెత్తూ, వంద అడుగుల కైవారం ఉన్న ఆ మహాకాయుని చూస్తూనే వానర సేనలు పారిపోసాగాయి. ధైర్యం చెప్పి వారిని అతికష్టంమీద అంగదుడు నిలువరించాడు.
కుంభకర్ణుడు వానరులను కరకర నమలి మ్రింగుతూ, ఎండు అడవిని అగ్ని కాల్చినట్లుగా వానరసేనను నాశనం చేయసాగాడు. అంగదుడు, ఋషభుడు, శరభుడు, మైందుడు, నీలుడు వంటివారు విసిరిన కొండలు కుంభకర్ణుని వంటికి తగిలి పొడి అయిపోయాయి. వందలాది వానరులను వాడు కరకర నమిలి మ్రింగ సాగాడు. హనుమంతుని దెబ్బకు కుంభకర్ణుడు రక్తం కక్కాడు. కుంభకర్ణుడి శూలం పోటుకు హనుమంతుడు రక్తం కక్కాడు. ఆ రాక్షసునికి ఎదురు పడిన అంగదాది వీరులు వాడి విదిలింపులకే సృహ తప్పి పడిపోయారు. సుగ్రీవుడు కుంభకర్ణుడి శూలాన్ని తన మోకాటికి అడ్డంగా పెట్టుకొని విరిచేశాడు. అప్పుడు కుంభకర్ణుడు విసిరిన పర్వత శిఖరం తగిలి సుగ్రీవుడు తెలివి తప్పాడు. మూర్ఛపోయిన సుగ్రీవుడిని పట్టుకొని లంకవైపు వెళ్ళాడు కుంభకర్ణుడు. తెలివి తెచ్చుకొన్న సుగ్రీవుడు ఒక్కసారి విదిలించుకొని, రాక్షసుని ముక్కు, చెవులు కొరికివేసి ఒక్కగెంతులో వానర సైన్యం మధ్యకు వచ్చిపడ్డాడు.
తిరిగి వచ్చిన కుంభకర్ణుడు మత్తిల్లినవాడై అందరినీ ఎడా పెడా మట్టుపెట్ట సాగాడు. వాలిని చంపిన రాముని బాణం కుంభకర్ణుని పట్ల నిష్ప్రయోజనమైంది. కడకు రామ లక్ష్మణుల బాణాలు కుంభకర్ణుని ఆయుధ విహీనుని చేశాయి. . రాముడు వాయువ్యాస్త్రంతోను, ఐంద్రాస్త్రంతోను వాడి చేతులు నరికేశాడు. రెండు మహిమాన్విత బాణాలతో తొడలు కూడా నరికేశాడు. ఐనా నోరు తెరుచుకొని రాహువులా వస్తున్న ఆ వీరుని ఐంద్రాస్త్రంతో చంపేశాడు. వాడు పర్వతంలా క్రిందపడ్డాడు. వాడి క్రింద పడి ఎందరో వానరులు, రాక్షసులు కూడా నశించారు.
శోకిస్తున్న రావణుడిని ఊరడించి మరునాడు దేవాంతక, నరాంతక, అతికాయ, త్రిశిరులనే రావణ నందనులు, మత్తుడు ఉన్మత్తుడు అనే రావణ సోదరులు – అందరూ మహా శూరులు- యుద్ధానికి పయనమయ్యారు. వారికి తోడుగా మహోదరుడు, మహాపార్శ్వుడు కూడా వెళ్ళారు. వానర రాక్షస వీరుల మధ్య యుద్ధం మళ్ళీ భీకరంగా సాగింది. నరాంతకుని వీరవిహారానికి రణరంగం వానర కళేబరాలతో నిండిపోయింది. సుగ్రీవుని ఆజ్ఞపై అంగదుడు నరాంతకునిపైకురికాడు. అంగదుని పిడకిలిపోటుకు నరాంతకుడు నెత్తురు కక్కి విలవిల తన్నుకొని మరణించాడు.
నరాంతకుడి మరణంతో దేవాంతకుడు, త్రిశిరుడు, మహోదరుడు దుఃఖంతో అంగదుని మీదికి ఉరికారు. తగ్గకుండా అంగదుడూ ముగ్గురిపైనా పోరు సాగించాడు. అది చూసి హనుమంతుడు, నీలుడు అంగదునికి తోడు వచ్చారు. హనుమంతుడి పిడికిలి దెబ్బకు దేవాంతకుడి శిరస్సు వ్రక్కలై మరణించాడు. నీలుడు ఒక మహాపర్వతంతో కొట్టి మహోదరుని చంపేశాడు. త్రిశిరుడు వేసిన మహాశక్తిని హనుమంతుడు పెళ్ళున విరిచి వేశాడు. త్రిశిరుని మూడు తలలను వాడి కత్తితోనే ఒక్క వేటుతో నరికేశాడు. మహా పార్శ్వుడి గదను లాగుకొని వృషభుడు దానితోనే వాడి తలను పగులగొట్టాడు.
పినతండ్రులు, సోదరుల మరణం చూసి మహా తేశ్శాలి అయిన అతికాయుడు మరొక కుంభకర్ణుడిలా యుద్ధంలోకి దూకాడు. వానర నాయకులు విసిరిన చెట్లు, పర్వతాలు, బండరాళ్ళూ పిండి చేసేశాడు. లక్ష్మణుడు, అతికాయుడు ఒకరికి తీసిపోకుండా ఒకరు మెరుపులలాంటి శస్త్రాస్త్రాలతో యుద్ధం చేశారు. చివరకు వాయుదేవుని సలహాపై సౌమిత్రి బ్రహ్మాస్త్రాన్ని సంధించి అతికాయుని తల తెగనరికాడు. భయభ్రాంతులై రాక్షస సేన అంతా లంకలోకి పరుగులు తీశారు.

Leave a Reply