– డీజీపీ రాజేంద్ర నాథ్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ సమర్థ వంతంగా పని చేయడం వల్లే 2022 లో నేరాలు గణనీయంగా తగ్గాయని , డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రాజేంద్రనాథ్ రెడ్డి మీడియా కు తెలియచేశారు. ప్రభుత్వం నుండి పూర్తి సహకారం లభించడం, పోలీసింగులో విన్నూత్న ఒరవడిని సృష్టించడం వల్లనే ఇది సాధ్యమైనదని, మరింత ద్విగుణీ కృత ఉత్సాహంతో 2023 లో మరింత మెరుగైన పోలీసింగ్ ను అందిస్తామని వారు తెలియచేశారు.
నేర గణాంకాలు
1) గణనీయంగా నేరాల తరుగుదల: విజబుల్ పోలీసింగ్, అవగాహన కార్యక్రమాలను చేపట్టడం, మహిళా పోలీసు సేవల సమర్థవంత నిర్వహణ, పీడి యాక్ట్ ప్రయోగం, నాటు సారా ఫై ఉక్కుపాదం మోపడం తదితర చర్యల వల్ల నేరాలు తగ్గుముఖం పట్టాయని డీ జీ పీ గారు తెలియజేసారు. 2020 లో నమోదైన కేసులు 2,92,565 కాగా, 2021 లో 2,84,753 నమోదు కాగా, 2022లో 2,31,359 కేసులు నమోదైనట్లు వారు తెలియ జేశారు.
2) హత్యలు, కొట్లాటలు: విజబుల్ పోలీసింగ్, అసాంఘిక శక్తులపై నిఘా, పీడి యాక్ట్ ప్రయోగం, తక్షణ అరెస్తులు, బైండ్ ఓవర్ తదితర చర్యల వల్ల హత్యలు, కొట్లాటలు, దొమ్మి లు (Riotings) తగ్గుముఖం పట్టాయని డీ జీ పీ గారు తెలియజేసారు. 2020 లో నమోదైన హత్యలు 846 కాగా, 2021 లో 945 హత్య కేసులు నమోదు కాగా, 2022లో 857 హత్య కేసులు నమోదైనట్లు వారు తెలియ జేశారు. అదే విధంగా 2020 లో నమోదైన దొమ్మి (Riotings) కేసులు 551 కాగా, 2021 లో 562 దొమ్మీ కేసులు నమోదు కాగా, 2022లో 442 దొమ్మీ కేసులు (Rioting cases) నమోదైనట్లు వారు తెలియజేశారు.
3) దొంగతనాలు: 2022 లో దొంగతనాల నమోదు 2021 తో పోలిస్తే రమారమి అదే విధంగా ఉన్నాయి. 2020 లో నమోదైన కేసులు 3384 కాగా, 2021 లో 4093 నమోదు కాగా, 2022లో 4242 కేసులు నమోదైనట్లు వారు తెలియ జేశారు. బీట్స్ ను రీ- ఆర్గనైజ్ చేయడం, నిరంతర పర్యవేక్షణ, టెక్నాలజీ వినియోగం, జైలు నుండి విడుదల అయిన నేరస్తులపై నిఘా, LHMS ఫై అవగాహన, పొరుగు రాష్ట్రాలతో సమన్వయం, అనుమానితుల వెళ్లి ముద్రల పోల్చడం ద్వారా దొంగతనాల తగ్గుదలకు కార్యాచరణ రూపొందిస్తామని వారు తెలియచేసారు. 2022 లో నేరస్తులను గుర్తించడం మరియ రికవరీ శాతం బాగా పెరిగాయి.
4) రోడ్డు ప్రమాదాలు: 2020 లో 17391 రోడ్డు ప్రమాదాలు జరుగగా, 2021 లో 19203 ప్రమాదాలు జరుగగా 2022 లో 18739 ప్రమాదాలు జరిగాయి. బ్లాక్ స్పాట్ ల ఐడెంటిఫికేషన్ మరియూ రెక్టిఫికేషన్, ప్రమాద రహిత దినాలు గా కొన్ని రోజులను ప్రకటించి పని చేయడం, ప్రమాద సమయాలను గుర్తించి ఆ సమయాల్లో పోలీసు నిఘా, ఎన్ఫోర్స్మెంట్ పెంచడం, ఏ రోడ్లలో ప్రమాదాలు జరుగుతున్నాయో గుర్తించి తగు చర్యలు తీసుకోవడం, SP ల నిరంతర స్వీయ నిఘా వల్ల ప్రమాదాలు గణనీయంగా తగ్గడం జరిగింది. రోడ్డు ప్రమాధాలలో సంభవించిన మరణాల సంఖ్య సైతం గణనీయంగా తగ్గాయి.
5) మహిళలపై తీవ్ర నేరాలు: విజబుల్ పోలీసింగ్, దిశ కార్యక్రమాల పటిష్ట అమలు, నేర ప్రభావిత ప్రదేశాల జియో మ్యాపింగ్, మహిళా పోలీసుల పర్యవేక్షణ తదితర చర్యల ద్వారా మహిళపై జరిగే తీవ్ర నేరాలు తగ్గుముఖం పట్టగా, కుటుంబ హింస కు సంభందించిన నేరాలు కొంత మేర పెరిగాయి. 2020 లో నమోదైన మానభంగాలు 1255 కాగా, 2021 లో 1456 మానభంగ కేసులు నమోదు కాగా, 2022లో 1419 మానభంగ కేసులు నమోదైనట్లు వారు తెలియ జేశారు. అదే విధంగా వర కట్న హత్యలు, ఆత్మహత్య ప్రేరిత నేరాలు, కిడ్నాపులు, వరకట్న చావులు కూడా తగ్గుముఖం పట్టాయి. అయితే మహిళలపై వేధింపులు కు సంభందించిన కేసులు 2020 లో 7039 నమోదు కాగా, 2021 లో 10373 కేసులు, 2022 లో 11895 కేసులు నమోదు అయ్యాయి. అవుట్ రీచ్ ప్రోగ్రాముల వల్ల ఎక్కువ కేసులు నమోదు అయినట్లు డీజీపీ గారు తెలియ చేశారు.
6) SC/ST లపై నేరాలు: గ్రామ సందర్శనలు, నేర ప్రభావిత ప్రదేశాలను గుర్తించి నిఘా ఉంచడం, ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు, జిల్లా రివ్యూ మీటింగులు, నేరస్తుల పట్ల కఠినమైన చర్యలు చేపట్టడం ద్వారా SC/ST లపై జరిగే నేరాలు తగ్గుముఖం పట్టాయి. 2020 లో నమోదైన మానభంగాలు 156 కాగా, 2021 లో 231 మానభంగ కేసులు నమోదు కాగా, 2022లో 205 మానభంగ కేసులు నమోదైనట్లు వారు తెలియ జేశారు. అదే విధంగా 2020 లో నమోదైన hurt కేసులు 505 కాగా, 2021 లో 606 hurt కేసులు నమోదు కాగా, 2022లో 585 hurt కేసులు నమోదైనట్లు వారు తెలియ జేశారు.
7) సైబర్ నేరాలు: 2022 లో కొంత మేర ఎక్కువగా సైబర్ నేరాలు నమోదు అయ్యాయి. 2020 లో నమోదైన కేసులు 2122 కాగా, 2021 లో 2039 నమోదు కాగా, 2022లో 2783 కేసులు నమోదైనట్లు వారు తెలియ జేశారు. లోన్ అప్ కేసుల నమోదు, 1930 టోల్ ఫ్రీ నెంబర్ వల్ల కేసుల నమోదు పెరిగినట్లు డీ జీ పీ గారు తెలియజేసారు. ఆంధ్రప్రదేశ్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (A4C), అవగాహనా కార్యక్రమాల నిర్వహణ, సైబర్ మరియు సోషల్ మీడియా సెల్స్ ఏర్పాటు ప్రక్రియ తో కార్యాచరణ రూపొందిస్తామని వారు తెలియచేసారు.
నిత్య పర్యవేక్షణ – మెరుగైన పోలీసింగు
1) కేసుల దర్యాప్తు వేగవంతం – తగ్గిన Pendency: 2021 చివరి నాటికి దర్యాప్తు లో వున్న కేసులు 1,88,810 కాగా, 2022 చివరి నాటికి ఆ సంఖ్య 1,11,190 కు తగ్గింది. దర్యాప్తు లో వున్న కేసులు (1,88,810) కు 1,88,774 కొత్త కేసులు తోడైననూ, దాదాపు 2,66,394 కేసులు దర్యాప్తు పూర్తి చేయడం వల్ల ఇది సాధ్యమైంది. మూడు మెగా లోక్ అధాలత్ లలో కేసులు పరిష్కరించగలగడం, చాలా రోజుల నుండి పరిష్కారం కావాల్సిన కేసులలో ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం, బాగా పని చేసిన అధికారులకు రివార్డ్ లు ప్రకటించడం, CCTNS ద్వారా నిరంతర పర్యవేక్షణ వల్ల UI కేసులను తగ్గించగలిగాం.
2) లోక్ అదాలత్ తో పెద్ద ఎత్తున కేసుల పరిష్కారం: వివిధ విడతలుగా రాష్ట్రంలో నిర్వహించిన లోక్ అదాలత్ తో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు అత్యంత శ్రమించి సుదీర్ఘ కాలంగా చిన్నపాటి వివాదాలు, మనస్పర్ధల కారణంగా వివాదాల్లో ఉన్న కేసులలో ఇరువర్గాలను పిలిపించి వారికి కేసు తీవ్రత, జరగబోయే పరిణామాలు, ఎదుర్కొంటున్న ఇబ్బందుల పైన ఇరు వర్గాలకు అర్థమయ్యే విధంగా కౌన్సిలింగ్ నిర్వహించి లోక్ అదాలత్ లో రాజీ పడేందుకు ఎంతగానో కృషి చేశారు. దాని ద్వారా 1,08,763 కేసులు పరిష్కారం చేయడం జరిగింది. అందులో 57373 కేసులు దర్యాప్తు కేసులు కాగా, 51390 పెండింగ్ ట్రైల్ కేసులు డిస్పోజల్ జరిగినాయి. ఎఫ్ఐఆర్ కేసులతోపాటు 300301 Petty కేసులను సైతం లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులందరినీ అభినందిస్తున్నాను. పోలీసులు న్యాయవ్యవస్థతో సమన్వయ పరుచుకోవడం ద్వారా ఇది సాధ్యమైంది. రాబోయే రోజుల్లో సైతం నిర్వహించే లోక్ అదాలత్ లో ఇదే రకమైనటువంటి విధానాన్ని అవలంభిచడం ద్వారా మరిన్ని పెండింగ్ కేసులను పరిష్కరిస్తామని తెలియజేస్తున్నాను.
3) Conviction Rate:
సాక్ష్యం ఆధారిత పోలీసింగ్ – నేరారోపణ ఆధారిత విధానం, రోజువారీగా వివాదాస్పద కేసుల గుర్తింపు-పర్యవేక్షణ, సాక్షులకు సరైన విధంగా అవగాహన కల్పించడం, NBWలను సకాలంలో అమలు చేయడం, రేప్ & పోక్సో కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టడం ద్వారా- 60 రోజుల్లో 96% ఛార్జిషీట్లు దాఖలు చేయడంతో Conviction rate ను (66.69%) పెంచడం జరిగింది.
4) కన్విక్షన్ బేస్డ్ పోలీసింగ్:
కన్విక్షన్ బేస్ పోలింగ్ విధానాన్ని ఈ సంవత్సరం జూన్ నుండి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నాము.ఈ విధానం ద్వారా ప్రతి ఒక్క యూనిట్ అధికారి సిపి/ఎస్పీ తమ పరిధిలోని అత్యంత ముఖ్యమైన ఐదు కేసులు(మహిళలకు సంభందించిన కేసులకు మొదటి ప్రాధాన్యత) పర్యవేక్షణలో ప్రతిరోజు షెడ్యూల్ మేరకు కోర్టులో జరుగుతున్న కేసు ట్రైల్ పురోగతిపై సమీక్ష నిర్వహించే విధంగా వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధానం ద్వారా కేసు యొక్క ట్రైల్ సమయాన్ని తగ్గించి స్వల్పకాల వ్యవధిలోనే నేరస్తులకు శిక్ష పడేవిధంగా చేయడం, అంతేకాకుండా ఏ ఒక్క నేరస్థుడు తప్పించుకోకుండా చూడటం ముఖ్య ఉద్దేశం.
ఉన్నత స్థాయి అధికారులు కేసుల పైన ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం వల్ల నేరస్తులు సాక్షులను బెదిరించడం వంటి వాటికి అవకాశం లేకుండా సాక్షులను సకాలంలో న్యాయస్థానానికి తీసుకురావడం ద్వారా నేరస్తులకు శిక్షలు పడుతున్నాయి. ఇదే ) కన్విక్షన్ బేస్ పోలీసింగ్ విధానాన్ని కేవలం జిల్లా ఎస్పీ స్థాయి లోనే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలోని సబ్-ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్, డిఎస్పీ తమ పరిధిలోని అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఐదు కేసులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోనే విధంగా చర్యలు తీసుకోవడం తోపాటు ప్రతిరోజూ కేసులకు సంబంధించిన ట్రైల్ వివరాలు, వాటి పురోగతిపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రాజేంద్రనాథ్ రెడ్డి జిల్లా ఎస్పీలతో టెలికాన్ఫరెన్స్ ద్వారా ఎప్పటికప్పుడు సమీక్షిచడంతో ఈ సంవత్సరం అత్యంత ఉత్తమమైన ఫలితాలను తీసుకురావడం జరిగింది.
2020లో POSCOకు సంభందించి కేవలం 21 కేసుల్లో శిక్ష పడితే నూతనంగా అమలు చేసుతున్న కన్విక్షన్ బేస్ పోలీసింగ్ విధానం ద్వారా ఆరు నెలల్లో 90 కేసుల్లో శిక్షలు పడ్డాయి. అత్యధికంగా 42 కేసుల్లో జీవితకాల శిక్ష పడింది. ఈ రకమైనటువంటి ఫలితాలు తీసుకురావడంలో కృషిచేసిన అధికారులను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈ విధానం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పోలీసు వ్యవస్థలో సమూలమైన మార్పులకు శ్రీకారం చుడుతున్నాము.
5) కోర్ట్ మానిటరింగ్ సెల్ ప్రక్షాళన:
కోర్టుల్లో పేరుకుపోయిన కేసులను పరిష్కరించేందుకు అమలు చేస్తున్న కోర్టు మానిటరింగ్ విధానం గత కొంతకాలంగా కేవలం కేసులకు సంభందిన నోటిస్లు జారీచేయడం వరకే పరిమితంగా మరిరింది. దీని ద్వారా కేసుల్లో శిక్షల శాతం పెరగడం లేదు అని గ్రహించిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రాజేంద్రనాథ్ రెడ్డి సిస్టంను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చర్యల్లో భాగంగా కోర్ట్ మానిటరింగ్ లో సైతం ఉన్నతాధికారులు ప్రతిరోజు పర్యవేక్షించడం, కేసుల్లోని నిందితులకు శిక్షలు పడేవిధంగా అన్ని చర్యలు చేపట్టే విధంగా మార్పులు చేయటంతో ప్రస్తుతం కేసుల్లో నిందితులకు పెద్ద మొత్తంలో శిక్షలు పడుతున్నాయి.
6) Charge Sheeting Rate:
వేగవంతమైన దర్యాప్తు, నిర్ణీత గడువు లోగా చార్జ్ షీట్ దాఖలు చేయడం, SC/ST కేసుల దర్యాప్తు పైన నిరంతర పర్యవేక్షణ, సాక్ష్యం ఆధారిత పోలీసింగ్ , ఎఫ్ఎస్ఎల్ నివేదికలు, సిసిటివి వీడియో ల ఆధారంగా దర్యాప్తు లో చార్జ్ షీట్ దాఖలు శాతం 88% చేరుకుంది.
పోలీసు శాఖ సాధించిన ఫలితాలు
1) దిశ అప్లికేషన్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి ఆవిష్కరించిన దిశ అప్లికేషన్ కు మహిళల నుండి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. దిశ యాప్ డౌన్ లోడ్లు మరియూ రిజిస్ట్రేషన్ల డేటా చూస్తే ఈ విషయం అవగతమౌతుంది. మహిళలు, విద్యార్థినిలకు అవగాహన కల్పించేందుకు రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారి ప్రత్యేక చొరవతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో యాప్ డౌన్లోడ్ కోసం ప్రణాళికా బద్దంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం వల్ల 1,37,54,267 మంది అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోగా, 1,11,08,227 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. యాప్ ను ప్రారంభించిన మొదటి రెండు సంవత్సరాలలో, 27,09,174 లక్షల మంది రిజిస్ట్రేషన్లు చేసుకోగా, 2022 లో రికార్డు స్థాయిలో 85 లక్షల మంది రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. గతంలో కేవలం యాప్ డౌన్లోడ్ చేసి వదిలేసేవారు. దీని వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండేది కాదు. కానీ ఇప్పుడు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వాటిని తప్పని సరిగా రిజిస్ట్రేషన్ చేయించుకుంటేనే యాప్ పని చేస్తుందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం తో ఇది సాధ్యమైంది. దిశ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే ప్రాంతాల్లో జరిగే సంఘటనలు వెంటనే పోలీసుల దృష్టికి వెళ్తాయి. ముఖ్యంగా కాలేజీలు, ప్రధాన కూడళ్లలో మహిళలను వేధించే వారిపై ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేసుకోవచ్చు.
దిశ మొబైల్ యాప్ ప్రభావం:
2020 లో మొత్తం 11,79,985 మంది డౌన్లోడ్లు చేసుకోగా 4,97,432 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. SOS ద్వారా అందిన వినతులు 97,525 కాగా చర్యలు తీసుకోదగ్గ 671 వినతులపైన తక్షణ చర్యలు తీసుకొని 135 ఎఫ్ఐఆర్ లు నమోదు చేయడం జరిగింది.
2021 లో మొత్తం 85,61,958 మంది డౌన్లోడ్లు చేసుకోగా 21,11,306 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.
SOS ద్వారా అందిన వినతులు 3,54,380 కాగా 6,950 చర్యలు తీసుకోదగ్గ వినతులపైన తక్షణ చర్యలు తీసుకొని 804 ఎఫ్ఐఆర్ లు నమోదు చేయడం జరిగింది.
2022 లో మొత్తం 40,12,324 మంది డౌన్లోడ్లు చేసుకోగా 85 లక్షల మంది (పాత గా డౌన్ లోడ్స్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఇప్పుడు డౌన్ లోడ్స్ చేసుకొన్న వారితో కలిపి) రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. SOS ద్వారా అందిన వినతులు 5,36,555 కాగా చర్యలు తీసుకోదగ్గ 17,933 వినతులపైన తక్షణ చర్యలు తీసుకొని 1,585 ఎఫ్ఐఆర్ లు నమోదు చేయడం జరిగింది.
ఇప్పటి వరకు మొత్తం: 1,37,54,267 మంది డౌన్లోడ్లు చేసుకోగా 1,11,08,227 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. SOS ద్వారా అందిన వినతులు 9,88,460 కాగా చర్యలు తీసుకోదగ్గ 25,554 వినతులపైన తక్షణ చర్యలు తీసుకొని 2,524 ఎఫ్ఐఆర్ లు నమోదు చేయడం జరిగింది.
2) సబ్ డివిజన్లు & సర్కిల్ల పునర్వ్యవస్థీకరణ: లా & ఆర్డర్ మరియు నేరాల నియంత్రణ ను సమర్థవంతంగా నిర్వహించడానికి, 14 కొత్త సబ్ డివిజన్లు, 19 కొత్త సర్కిల్లు మరియు 2 పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయడంతో పాటు 21 పోలీస్ స్టేషన్లు అప్గ్రేడ్ చేయడం జరిగింది.
3) అక్రమ మద్యం రవాణా, నాటుసారా పై ఉక్కు పాదం:
రాష్ట్రంలో అక్రమ మద్యం రవాణా, నాటుసారా పై ఉక్కు పాదం మోపేందుకు ప్రత్యేకంగా ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ ను నిర్వహించడం జరిగింది. దీని ద్వారా మంచి ఫలితాలను సాధించాంగలిగాం.. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 37,189 కేసులు నమోదు చేసి 28,803 మందిని అరెస్టు చేసి 169 మందిపైన PD ACTను అమలు చేయడం జరిగింది. నమోదైన కేసులకు సంభందించి 2,616 వాహనాలను స్వాధీనం చేయడం జరిగింది.
ఈ కేసులలో 3,90,821 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకోవడం తో పాటు 1,06,02,989 లీటర్ల నాటుసారాను ద్వంసం చేసి 5,17,992 కిలోల నల్లబెల్లం, 4,344 లీటర్ల బీర్, 233 లీటర్ల కల్లు ను స్వాధీనం చేయడం జరిగింది. జిల్లా ఎస్పీల పరిధిలో SEB function చేస్తూ, 2093 గ్రామాలను నాటు సారా లేని గ్రామాలుగా డిక్లేర్ చేసాము. ఇక కేవలం 103 గ్రామాలు మాత్రమే నాటు సారా లేని గ్రామాలుగా డిక్లేర్ చేయాల్సి వుంది. ఈ సంవత్సరంలో అన్ని గ్రామాలను నాటు సారా లేని గ్రామాలుగా తీర్చి దిద్దుతాం.
నాటు సారా ఫై అన్ని శాఖలా సమన్వయం తో పెద్ద ఎత్తున ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్స్ చేపట్టడం, మహిళా పోలీసు సేవలను సమర్థ వంతంగా వినియోగించడం, భారీ ఎత్తున అవగాహనా కార్యక్రమాలను చేపట్టడం, పీడీ యాక్ట్ ను ప్రయోగించడం, నల్ల బెల్లం రవాణా ఫై నిఘా ఉంచడం మొదలగు కార్యక్రమాల వల్ల ఇది సాధ్యమైంది. అంతేకాకుండా, 1363 కుటుంబాలకు ప్రత్యామ్నాయ్య జీవనోపాధి కలిపించడం జరిగింది. మిగతా కుటుంబాలకు ఈ సంవత్సరం ప్రత్యామ్నాయ్య జీవనోపాధి చూపించడానికి చర్యలు తీసుకొంటాం.
4) గంజాయి సాగు కట్టడి కి పటిష్ట చర్యలు:
ఆంధ్ర ప్రదేశ్ లోని విశాఖపట్నం రూరల్ ఏజెన్సీ ప్రాంతంలోని కోన్ని మండలాలు, తూర్పు గోదావరి జిల్లాలలో ఏజెన్సీ ప్రాంతాలలో గంజాయి సాగు, రవాణాను పూర్తి స్థాయిలో నిర్మూలనే లక్ష్యంగా ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ మొదటి విడతలో ప్రత్యేక కార్యక్రమాన్ని 30.10.2021న ప్రారంభించింది. ఈ ఆపరేషన్ కార్యక్రమంలో ఏజెన్సీ ప్రాంతంలోని 7119.85 ఎకరాల్లో గంజాయి సాగు పంట, 3,52,88,750 గంజాయి మొక్కలను ద్వంసం చేయడం జరిగింది. రెండో విడతలో ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు చేపట్టిన అనేక కార్యక్రమాల ద్వారా గంజాయి సాగుకు అత్యంత అనువైన జి.మాడుగుల, జి.కె.వీధి, చింతపల్లి, పెద్దబయలు, ముచంగ్గిపుట్ట, దంబ్రిగుడ, పాడేరు మండలాలలో ఈ సంవత్సరం గంజాయి సాగుని గణనీయంగా నిర్మూలించడంలో ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ సఫలీకృతమైంది.
పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు
ఈ సంవత్సరం చేపట్టిన మొదటి, రెండో విడత ప్రత్యేక కార్యక్రమలలో భాగంగా ఏజెన్సీ ప్రాంతంలోని ప్రజలకు గంజాయి సాగు, రవాణా పట్ల జరిగే నష్టాన్ని వివరిస్తూ వారిలో అవగాహన కల్పించడంతో పాటు గంజాయి సాగు మరియు రవాణా కు పాల్పడుతున్న వారిపైన కేసులు నమోదు చేయడం, పాత నేరస్తులను గుర్తించి వారిపైన PD ACT ప్రయోగించడం జరుగుతుంది.
గంజాయి సాగును గుర్తించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం
నవంబర్-2022 మొదటి విడత 600 ఎకరాలు, డిసెంబర్-2022 రెండో విడతలో 120 ఎకరాలలో గంజాయి సాగుచేస్తున్నట్లు స్థానికంగా అందుబాటులో ఉన్న సమాచారం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి గంజాయి సాగు చేస్తున్న ఆయా ప్రాంతాల ఉపగ్రహ చాయా చిత్రాలు ద్వారా గుర్తించి వాటిని నిర్మూలించేందుకు స్థానిక పోలీసులతోపాటు అదనంగా గ్రేహౌండ్స్, స్పెషల్ పార్టీ, ఎస్ఐబి సిబ్బందితో నవంబర్, డిసెంబర్ లో గంజాయి సాగు చేస్తున్న ప్రాంతాలలో ఐదు రోజుల పాటు అక్కడే క్యాంప్ ను ఏర్పాటు చేసుకొని మొత్తం 720 ఎకరాల్లోని గంజాయి సాగును నిర్మూలించడం జరిగింది.
నిరంతర తనిఖీలు
ఏజెన్సీలోని ప్రాంతాల నుండి గంజాయి రవాణా ను పూర్తి స్థాయిలో నియంత్రించేందుకు ప్రత్యేకంగా చెక్ పోస్టులను ఏర్పాటు చేయడంతో పాటు నిరంతరం వాహనాల తనిఖీలు, ఏజెన్సీలోకి వచ్చే కొత్త వ్యక్తుల కదలికలపైన నిఘా కొనసాగించడం ద్వారా స్వాధీనం చేసుకున్న గంజాయి ఒరిస్సా లోని మల్కాంగిరి జిల్లా నుండి రవాణా అవుతున్నట్టుగా గుర్తించడం జరిగింది. దీనిని పూర్తిస్థాయిలో అడ్డుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఒరిస్సా రాష్ట్ర అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నాము దీని ద్వారా గంజాయి రవాణా ను పూర్తి స్థాయిలో నియంత్రించడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం, వ్యవసాయశాఖ, ఉద్యానవన శాఖలు అధికారుల సంపూర్ణ సహకారం తో గంజాయి సాగుకు ప్రత్యామ్నాయ పంటలుగా సిల్వర్ ట్రీ, పెప్పర్, కాఫి, పసుపు, మామిడి, కొబ్బరి మొక్కలు, జీడి మామిడి, రాగి, రాజ్మ, కంది పంట, అల్లం, వరిపంట, రబ్బర్ మొక్కలు, నిమ్మ, జాఫ్రా, పత్తి, నువ్వులు, పచ్చిమిర్చి,రాగులు, పల్లి, కూరగాయల విత్తనాలను అందిస్తుంది.ఈ సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ శాఖ వివిధ కేసుల్లో మొత్తం 2,45,000 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుంది.
23-12-2022 నుండి రాష్ట్ర వ్యాప్తంగా విశాఖపట్నం, ఏలూరు, గుంటూరు, కర్నూలు, అనంతపురం రేంజ్ పరిధిలో స్వాధీనం చేసుకున్న గంజాయిని దహనం చేసేందుకు ప్రణాళిక వివరాలు:
(23-12-2022) ఏలూరు రేంజ్ పరిధిలోని తూర్పు గోదావరి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, పచ్చిమ గోదావరి, క్రిష్ణ జిల్లాలో 465 కేసులలో స్వాధీనం చేసుకున్న 64,832. కిలోల గంజాయిని కాల్చివేయడం జరిగింది.
(24-12-2022) విశాఖపట్నం రేంజ్ పరిధిలోని శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, పార్వతిపురం మన్యం, అనకాపల్లి జిల్లాలలో స్వాధీనం చేసుకున్న 1,80,000 కిలోలకు పైగా గంజాయిని అనకాపల్లి జిల్లా, కోడూరు గ్రామ శివారులోని నిర్మానుష ప్రాంతంలో కాల్చివేయడం జరుగుతుంది.