ప్రమాదంలో ప్రజాస్వామ్యం

-కేంద్రంలో ఉన్మాద ప్రభుత్వం నడుస్తోంది
-భారత ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది
-మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యులు కేవీపీ రామచంద్రరావు

విజయవాడ, ఏప్రిల్1: బీజేపీ పాలనలో దేశ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని రాజ్యసభ మాజీ సభ్యులు కేవీపీ రామచంద్రరావు అన్నారు. శనివారం విజయవాడ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొని ఉద్వేగభరితంగా ప్రసంగించారు. ఉన్మాద మనస్తత్వం కలిగిన ఒక ప్రభుత్వాన్ని మనం ఎదుర్కొంటున్నామని చెప్పారు. మన దేశ అప్పులు లక్షల కోట్లు పెరుగుతుంటే అదానీ ఆస్తులు మాత్రం భారీగా పెరుగుతున్నాయని అన్నారు. అదానీని ప్రశ్నిస్తే దేశద్రోహం కింద పరిగణిస్తున్నారని, ఒక పెద్ద అవినీతిపరుడిని ప్రశ్నిస్తే దేశ ద్రోహం అవుతుందా అని అడిగారు. అదానీ నుంచి ప్రధాని నరేంద్ర మోడీకి వాటా వెళ్తోందని ఆరోపించారు. కేంద్రంలో ఉన్మాద ప్రభుత్వం నడుస్తోందని తద్వారా భారత ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కేంద్రంలో కేవలం పెట్టుబడిదారులు రక్షించేందుకు చూస్తున్నారని, అలానే అవినీతిపరుదుని రక్షించేందుకు చూస్తున్నారన్నారు.

అదాని, మోడి అవిభక్త కవలలు కావడంతో ఆదాని సంపద ఎన్నో రెట్లు పెరుగుతోందన్నారు. భారతదేశం మాత్రం అప్పుల్లో కురుకుపోతుంటే అదానీ ఆదాయం మాత్రం నాలుగింతలు పెరుగుతుందన్నారు. అక్రమార్జన చేస్తున్న అదానీ ద్వారా మోడీకి వాటా అందుతుందని ఆయన ఆరోపించారు. దేశంలో వారు చేస్తున్న అవినీతిని ప్రశ్నించడానికి సిద్దమైన రాహుల్ ని వేధింపులకు గురిచేయడం శోచనీయమన్నారు. మోడీ ప్రభుత్వం నిత్యం అవినీతిపై పనిచేస్తోంద న్నారు. ఇదేమిటని అవినీతిపై అదానీని ప్రశ్నిస్టే దేశద్రోహం కింది పెడుతున్నారన్నారు. మోడీ అదాని చేసే అవినీతిని ప్రశ్నించిన ఎంపీ రాహుల్ గాంధీ పైన దేశద్రోహం నింద మోపడం సమంజసం కాదన్నారు. కేవలం కుంటిసాకు వెతికి రాహుల్ ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ప్రతిపక్ష నేత ఎంపీ రాహుల్ గాంధీ ప్రసంగ పాఠాన్ని పార్లమెంటు స్పీచ్ నుంచి తొలగించడం అప్రజాస్వామికమైన చర్యగా ఆయన అభివర్ణించారు. పార్లమెంటు సభ్యుడిని అనర్హునిగా ప్రకటించాల్సిన వ్యక్తి రాష్ట్రపతి కాగా, అలా జరగకుండానే రాహుల్ ని అనర్హునిగా ప్రకటించడం ఇంతవరకూ ఎప్పుడూ జరగలేదని ఇక ఎప్పుడు కూడా ఇలా జరగకూడదని అన్నారు.

కోర్టు తీర్పు వచ్చిన వెంటనే కాపీ కూడా అందకుండా రాహుల్ పై అనర్హత వేటు వేయడం వంటి చర్యలు తీసుకోవడం ఇదే మొదటిసారని,చరిత్రలో ఎపుడు జరగలేద న్నారు. దేశం కోసం వారి సొంత ఆస్తులను త్యాగం చేసిన మోతీలాల్ వారసులు నెహ్రూ కుటుంబమైన రాహుల్ గాంధీకి ఢిల్లీలో సొంత ఇల్లు కూడా లేదని చెప్పారు. పార్లమెంట్ సభ్యుడు కి కేటాయించిన ఇల్లు కూడా ఖాళీ చేయాలని ఆదేశించడం చూస్తుంటే ఇది ఎంత అప్రజాస్వామికమైన చర్యో అవగతం అవుతుందన్నారు.

ఏపీ నుంచి స్పందనలేకపోవడం సిగ్గుచేటు
గత ఇరవై ఏళ్లుగా ఎంపీగా కొనసాగుతున్న సీనియర్ పార్లమెంటు సభ్యులు రాహుల్ పై అనర్హత వేటు వేస్తే ఏ పి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం సిగ్గుచేటని కేవీపీ అన్నారు. ప్రజాస్వామ్యం పై ఇంత దారుణంగా దాడి జరుగుతున్నా ఏ.పి.నేతలు ఎందుకు మోనంగా ఉన్నారో అర్ధం కావడం లేదన్నారు. అందుకు వైసీపీకి కొన్ని ఇబ్బందులు ఉన్నాయని అందువల్లే వారు బీజేపీని ప్రశ్నించలేకపోతున్నారని ఆరోపించారు. రాహుల్ గాంధీకి జరిగే నష్టం ప్రజాస్వామ్య పై జరిగే దాడిగా ఆయన అభివర్ణించారు. ప్రస్తుతం దేశం ప్రమాదంలో ఉందని దాన్ని రక్షించు కావాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కేంద్రంలో ఫాసిస్ట్ ప్రభుత్వం నడుస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం చేసే అరాచకాల‌‌ను ఏపీ మినహా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రశ్నిస్తున్నాయని చెప్పారు.

ప్రశ్నించే పవన్ ఎక్కడ?
కేవలం ప్రశ్నించడానికే వచ్చానన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయనకు ఆపార్టీతో ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగా మాట్లాడకపోవడం గమనించదగ్గ పరిణామమే అన్నారు. ఏపీ రాజకీయాలపై ప్రశ్నించే వ్యక్తి పవన్ కూడా నేడు కేంద్రంలో జరుగుతున్న అప్రజాస్వామిక విధానాలపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. రాహుల్ విషయంలో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతుంటే పవన్ ఎందుకు మాట్లాడటం లేదన్నారు. ఇక ఇపుడు ఆయన ప్రశ్నించకపోతే భవిష్యత్ లో ఏమి మాట్లాడే అవకాశం ఉండదన్నారు.

చంద్రబాబు మౌనమేల?
కేంద్రంలో చక్రాలు తిప్పాను అని చెబుతూ ఎన్డీఏకి సారధ్యం వహించిన చంద్రబాబు నేడు రాహుల్ గాంధీకి జరిగిన అన్యాయం పై చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదని దెప్పిపొడిచారు. ఏపీలో జరిగే అన్ని అంశాలపై మాట్లాడే బాబు రాహుల్ గాంధీ విషయంలో ఎందుకు మాట్లాడటం లేదన్నారు. చంద్రబాబుకు చట్టాలపై గౌరవం ఉంటే కేంద్ర చర్యలపై నిలదీయాలన్నారు. ఈ విషయంలో చంద్రబాబు బాధ్యత మరిచి వ్యవహరిస్తున్నారన్నారు. ప్రజాస్వామ్యం ఇబ్బందుల్లో ఉంటే చంద్రబాబు ఎందుకు మాట్లాడటానికి ముందుకు రావడం లేదన్నారు. ప్రజాస్వామ్యం పడకేస్తున్న ఈ సమయంలోచంద్రబాబు ఢిల్లీ వెళ్లి పోరాటం చేయాల్సిన అవసరం ఉందని అందుకు బాబు మాత్రమే అర్హుడని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ తో టీడీపీ కలిసి పోటీచేయడాని తాను వ్యతిరేకించిన మాట వాస్తవమేనని ఒప్పుకున్నారు. అయితే నేడు రాజీవ్ గాంధీకి జరిగిన అన్యాయం విషయంలో ఇప్పుడు కేంద్రం ప్రశ్నిస్తే టీడీపీతో కలిసి పనిచేయడానికి తాను సిద్దంగా ఉన్నానని తెలిపారు. మీట్ ది ప్రెస్ కార్యక్రమానికి విజయవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నిమ్మరాజు చలపతిరావు అధ్యక్షత వహించగా ఈ కార్యక్రమంలో ఐజేయూ స్టీరింగ్ కమిటీ సభ్యులు అంబటి ఆంజనేయులు, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందు జనార్థన్, ఉపాధ్యక్షులు కె జయరాజ్, విజయవాడ అర్బన్ అధ్యక్ష, కార్యదర్శులు చావా రవి, కొండా రాజేశ్వరరావు, ప్రెస్ క్లబ్ కార్యదర్శి ఆర్ వసంత్ తదితరులు ఉన్నారు.

జగన్ కు ఎందుకు దూరంగా ఉంటున్నానో త్వరలోనే చెబుతా : కేవీపీ
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి ఆత్మ బంధువుగా పేరుగాంచిన వ్యక్తి కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు. వైఎస్ కు అత్యంత సన్నిహితంగా ఉన్న కేవీపీ తన అల్లుడిగా భావించే ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు మాత్రం దూరంగా ఉంటున్నారు. తాజాగా ఆయన దీనిపై స్పందిస్తూ వైఎస్ కు దగ్గరగా ఉన్న తాను జగన్ కు దూరంగా ఎందుకు ఉంటున్నాననే విషయం గురించి త్వరలోనే చెపుతానని అన్నారు. ఇప్పుడే దీనిపై మాట్లాడనని, కానీ ఎప్పటికైనా ఈ విషయం గురించి మాట్లాడాల్సిందేనని, మరో రోజు మీడియా ముఖంగా అన్ని విషయాలను వివరిస్తానని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

Leave a Reply