-పెత్తందారీ పాలనలో రాష్ట్రం విధ్వంసం
-అరాచక పాలన అంతమే కూటమి లక్ష్యం
-తాగు, సాగునీరు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసమే కూటమి
-సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ
-జగన్ అరాచకాలు, అవినీతిపై చార్జిషీట్ విడుదల
సత్తనపల్లి పట్టణం రఘురాంనగర్ కన్నా కార్యాలయంలో శనివారం విలేఖరుల సమావేశంలో టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ ఎన్డీఏ చార్జిషీట్‌ను ఆవిష్కరించారు. జగన్ చేసిన అరాచ కాలు, అవినీతిపై మాట్లాడుతూ విశ్వసనీయత, నైతికత లేని ముఖ్యమంత్రి ఈ జగన్‌రెడ్డి మద్యం రేట్లు పెంచి లక్ష కోట్లు దోచాడని ధ్వజమెత్తారు. పదిసార్లు కరెంటు చార్జీల బాదుడుతో ప్రజలపై 75 వేల కోట్ల భారం వేసి కోలుకోలేని దెబ్బతీశాడని విమర్శించారు. జల విద్యుత్ శక్తి ప్రాజెక్టుల ఒప్పందాలు రాష్ట్ర ప్రజలకు శాపాలుగా మారాయన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాల సబ్‌ప్లాన్‌ల నిధులు లక్ష కోట్ల దారి మళ్లించినట్లు వివరించారు. నవరత్నాల పేరుతో నవ మోసాలు చేసి కేంద్ర పథకాలకు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వక వాటిని నిర్వీర్యం చేసినట్లు పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వ పథకాలపై జగన్ స్టిక్కర్లు వేసుకుని ప్రచారం చేసుకోవ టం సిగ్గుచేటన్నారు. పోలవరం, వెలిగొండ ప్రాజెక్టుల పూర్తి చేయకుండా మోసం చేశాడు. ల్యాండ్ మాఫియా గద్దలు వైకాపా నాయకులు. ఇసుక, గ్రావెల్ మాఫియాతో లక్ష కోట్లు దోపిడీ చేశారు. రాజధాని అమరావతి విధ్వంసం చేశారు. మూడుముక్కల రాజధాని ఆటతో దేశంలో నవ్వులపాలు చేశారు. అస్మదీయ కంపెనీలకు లక్షల ఎకరాలు కేటాయింపు చేశారు. రాష్ట్రంలో ఐపీసీ కోడ్ నడవటం లేదని, వైసీపీ కోడ్ నడుస్తోందన్నారు. ఏపీలో నేరాలు దారు ణంగా ఉన్నాయి. ఒక నరరూప రాక్షసుడికి ఇంకోసారి అధికారం ఇస్తే ఈ రాష్ట్రాన్ని అంధకా రంలోకి నెట్టి వేస్తాడని, ఈ రాష్ట్రాన్ని రక్షించుకోవడం కోసం అన్ని పార్టీలు ఏకమై ముందుకు నడవాలని పిలుపునిచ్చారు. రైతులు, నిరుద్యోగుల భవిష్యత్తు కోసం, రాజధాని, పోలవరం కోసం కోసం, గోదావరి కృష్ణా నదికి తీసుకువచ్చి పల్నాడు ప్రాంతం సస్యశ్యామలం చేయడం కోసం కూటమిని గెలిపించుకోవాలని కోరారు.