Suryaa.co.in

Andhra Pradesh

కొండంత అండగా ఉంటా

-వంద రోజుల్లో ప్రధాన సమస్యల పరిష్కారం
-22 డివిజన్లలో కార్యాలయాలు ఏర్పాటు
-ఆన్ లైన్ లో ప్రోగ్రెస్ రిపోర్టులు

-వైసీపీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి
-50వ డివిజన్ ఎన్నికల ప్రచారంలో సుజనా చౌదరి

ప్రజలకు కొండంత అండగా ఉంటానని, అందరి కష్టాలు తీరుస్తానని విజయవాడ పశ్చిమ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి హామీ ఇచ్చారు. ప్రతి డివిజన్ లో తమ కార్యాలయాలను ఏర్పాటు చేసి ప్రోగ్రెస్ రిపోర్టును ఆన్ లైన్ లో పెడతామని, తమ పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలించి ఎవరైనా తమను ప్రశ్నించవచ్చని సుజనా స్పష్టం చేశారు.

50 వ డివిజన్ టిడిపి అధ్యక్షులు పడాల గంగాధర్ జనసేన డివిజన్ అధ్యక్షులు రెడ్డిపల్లి గంగాధర్, టీడీపీ సీనియర్ నేత పీతా బుజ్జితో కలిసి కొత్తపేట గొల్లపాలెం గట్టు సాయిబాబా గుడి టైలర్ పేట పొట్టి శ్రీరాములు ఇంజనీరింగ్ కాలేజ్ తదితర ప్రాంతాలలో పర్యటించారు. సుజనాకు స్థానికులు తమ సమస్యలను మొరపెట్టుకున్నారు. కొండ ప్రాంతాల్లో తాము పడుతున్న ఇబ్బందులను వివరించారు. ఇళ్ళ రిజిస్ట్రేషన్ల విషయంలో వైసీపీ ప్రభుత్వం తమను మోసం చేసిందని వాపోయారు. మురుగునీరు, మంచినీరు కలిసి వస్తున్నాయని మొరపెట్టుకున్నారు. స్థానికుల సమస్యలు విని సుజనా చలించిపోయారు.

స్థానికుల పరిస్థితి కలచివేస్తోందన్నారు. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే యుద్ద ప్రాతిపదికన సమస్యల పరిష్కారానికి కార్యాచరణను అమలు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రధాన సమస్యలను వంద రోజుల్లో పరిష్కరించి చూపుతానన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం రాగానే నిజమైన అభివృద్ధి ఎలా ఉంటుందో చూపుతామన్నారు. మోదీని కూడా తీసుకొచ్చి ఆదర్శ నియోజకవర్గంగా మారుస్తామన్నారు. అపరిశుభ్ర వాతావరణం లేకుండా చేస్తామని, ప్రసూతి ఆస్పత్రిని నిర్మిస్తామని, ఉచిత వైద్య సేవలు అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు.

ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు ముందుగా ట్రక్ టెర్మినల్ నిర్మాణంతో కొంతవరకు తగ్గిస్తామని అక్కడ నుంచి చిన్న వాహనాల ద్వారా లోపలకు సరుకులు తెచ్చే ఏర్పాట్లు చేస్తామని వివరించారు. ముస్లింలను రెచ్చగొడుతూ వైసీపీ రాజకీయ పబ్బం గడుపుకుంటోందని దుయ్యబట్టారు. వైసీపీ మాటలను నమ్మవద్దని, ప్రచారాలను తిప్పికొట్టాలని విజ్ఙప్తి చేశారు. ఎవరూ ఎలాంటి ఆందోళన చెందవద్దని, అందరికీ అండగా ఉంటానని సుజనా భరోసా ఇచ్చారు. హామీలు ఇచ్చి గెలిచిన ప్రజా ప్రతినిధి, వాటిని అమలు చేయకపోతే రీకాల్ ఉండాలనేది తన అభిప్రాయమని సుజనా మరోసారి వ్యాఖ్యానించారు.

కేంద్ర మంత్రిగా పనిచేసిన సమయంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి సుజనా చౌదరి నిధులు కేటాయించి అభివృద్ధికి సహకరించారని టీడీపీ సీనియర్ నేత నాగుల్ మీరా అన్నారు. పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిని వెల్లంపల్లి శ్రీనివాసరావు, కేశినేని నాని విస్మరించారని, వీరికి స్థానిక ప్రాంతాల పేర్లే తెలియని ఎద్దేవా చేశారు.

మోదీ, చంద్రబాబుతో సత్సంబంధాలు కలిగిన సుజనాని గెలిపించుకుంటే విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తారని ప్రజలందరూ ఆశీర్వదించాలని నాగుల్ మీరా విజ్ఙప్తి చేశారు. ప్రచారంలో సుజనాకు మద్దతుగా ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, సీనియర్ నేత పైలా సోమినాయుడు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.

LEAVE A RESPONSE