– అన్నం పెట్టే చేతులను అడ్డుకుంటారా?
కాశిరెడ్డి నాయన ఆశ్రమం…
జ్యోతిక్షేత్రంలో కూల్చివేతలు ….
ఆర్తులు అన్నార్తుల అర్తనాదాలు ….
కడప జిల్లాలోని బద్వేలు నియోజకవర్గంలో నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న అవధూత కాశి నాయన సత్రం, జ్యోతిక్షేత్రంలో దశాబ్దాలుగా అన్నదాన సేవలు కొనసాగుతున్నాయి. అన్నదానమే అక్కడ భగవత్స్వరూపం..! అందుకే ఆర్తులకు అన్నార్తులకు ఇంత గూడు ఇచ్చి కడుపునిండా అన్నం పెట్టే అన్నపూర్ణగా ఆ ఆశ్రమాన్ని కొనియాడుతుంటారు.
మరి.. మానవసేవయే మాధవసేవగా కొనసాగుతున్న ఆశ్రమంపై కూల్చివేతలెందుకు?
టైగర్ జోన్ నిబంధనలు కారణమైతే.. నల్లమల అటవీ ప్రాంతంలో అనేక చెంచు పెంటలు… గ్రామాలు…ఆలయాలు…రహదారులు అన్నీ కూడా టైగర్ జోన్ పరిధిలోనే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని పాలమూరు, కర్నూలు, గుంటూరు, ప్రకాశం, కడప జిల్లాలలో విస్తరించి ఉన్న నల్లమల అడవుల్లో ..
సలేశ్వరం , మల్లెలతీర్థం, లొద్ది మల్లన్న, వంటి ఏడాదికి ఒక్కసారి మాత్రమే దర్శించుకునే తీర్థాలను పక్కకు పెడితే….,
శ్రీశైలం , అహోబిలం, నెమలి గుండ్ల రంగనాథ స్వామి , వంటి మొదలగు దేవాలయాలను భక్తులు నిత్యం దర్శించుకుంటారు..ఈ ఆలయాలకు వెళ్తున్నప్పుడు దారి పొడవునా టైగర్ జోన్ అభయారణ్యం హెచ్చరికలు వినిపిస్తుంటాయి. అంటే టైగర్ జోన్ లోనే వేల కిలోమీటర్లు రహదారులు విస్తరించి ఉన్నాయి కదా!? నిత్యం రాకపోకలు జరుగుతూనే ఉన్నాయి కదా!?
మరి .. 25 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఒక్క కాశిరెడ్డి నాయన ఆశ్రమం మాత్రమే టైగర్ జోన్ అది కిందికి వస్తుందని కూల్చివేతలు జరపడం వెనక మర్మమేమిటి ?
జీవ కారుణ్యం కోసమే కూల్చివేతలు జరిగితే, ఎన్ని దేవాలయాలు…. ఎన్ని రహదారులు….ఎన్ని చెంచు పెంటలు…. తొలగింపబడాలి? జీవకారుణ్యంలో పశుపక్షాదులతో పాటుగా అనాధలు కూడా ఉండటం మానవీయ ధర్మం…! మరి ఈ ధర్మం కాశీరెడ్డి నాయన ఆశ్రమంలో ఎందుకు కాలరాయబడుతున్నది?
ఎండోమెంట్ పరిధిలో ఉన్న ప్రాచీన లక్ష్మీనరసింహస్వామి ఆలయం సమీపంలో దాదాపు 25ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కాశీనాయన సత్రం , ఆలయం, టైగర్ జోన్ పరిధిలో ఉందంటూ గతంలో అటవీ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. స్థానిక పార్లమెంటు సభ్యులు అవినాష్ రెడ్డి అధికారులకు నచ్చ చెప్పి, క్షేత్రం కోసం అటవీభూమి ఎంత ఉపయోగించుకున్నారో, అంతకు రెండింతలు ప్రైవేటు భూమి టైగర్ జోన్ కిందికి అప్ప జెప్పాలని రాజీ చేసుకున్నారు.
ఇదిలా ఉండగా తాజాగా నేషనల్ గ్రీన్ ట్రిబునల్ నుండి ఈ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని నోటీసులు జారీ అయ్యాయి. ఈ క్రమంలో ఖాళీ చేయించడానికి వచ్చిన ఫారెస్ట్ అధికారులను.. స్థానిక గ్రామల ప్రజలు, భక్తులు పెద్ద ఎత్తున అడ్డుకుని ఆందోళనకు దిగారు. ఇది పరిస్థితి.
దయచేసి ఈ క్షేత్రంపై వివక్ష వద్దు…
కక్ష అంతకన్నా వద్దు….
అనాధలు ఎందరో అక్కడ ఆవాసం ఉంటున్నారు. దయచేసి వారి గోడు వినండి…గూడు చెదర నివ్వకండి.
కాశిరెడ్డి నాయన రెడ్ల కుటుంబంలో పుట్టినప్పటికీ ఆయనకు కులం మతం ప్రాంతం లేదు. అందరూ సమానమే!
నేను దేవుడు కాదు, నన్ను మొక్క వద్దు, మానవ సేవ చేసుకోండి అని కాశిరెడ్డి నాయన నిత్యం చెప్పేవాడు. అయినా భక్తులు వినిపించుకోలేదు.
మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి మొదలుకొని ఎందరో రాజకీయ నాయకులు కాశిరెడ్డి నాయన భక్తులు.