Suryaa.co.in

Editorial

అసెంబ్లీలో ఉత్తమ ఎమ్మెల్యే అవార్డులు

  • సీనియర్ జర్నలిస్టు, సీనియర్ పార్లమెంటేరియన్‌తో కమిటీ

  • అసెంబ్లీ కమిటీలకు రూట్ క్లియర్

  • 5,6 కమిటీల ప్రకటనకు ఆమోదం

  • నేడు ప్రకటించే అవకాశం?

  • స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌తో సీఎం బాబు భేటీ

(మార్తి సుబ్రహ్మణ్యం)

శాసనసభా సమావేశాల్లో అత్యున్నత ప్రతిభ, ఆకర్షణీయమైన ప్రసంగాలు చేసిన సభ్యులకు ఉత్తమ ఎమ్మెల్యే అవార్డు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు విధి విధానాలను ఖరారు చేసినట్లు సమాచారం. సమావేశాల సందర్భంగా సీఎం చంద్రబాబును కలవాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు అపాయింట్‌మెంట్ కోరారు. అయితే స్పీకర్ స్థానానికి గౌరవం ఇస్తూ, సీఎం చంద్రబాబునాయుడు స్వయంగా స్పీకర్ చాంబరుకు వచ్చారు. గతంలో కూడా ఆయన ఇలాంటి సంప్రదాయమే పాటించారు.

విశ్వసనీయ సమాచారం ప్రకారం.. సీఎంతో స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, అసెంబ్లీ సెక్రటరీ జనరల్ సూర్యదేవర ప్రసన్న భేటీ అయిన సందర్భంలో, సభా వ్యవహారాలపై చర్చజరిగింది. ఆ సందర్భంగా సమావేశాల్లో బాగా మాట్లాడుతున్న ఎమ్మెల్యేలను ప్రోత్సహించేందుకు అవార్డులు ఇద్దామని, లోక్‌సభలో కూడా ఇలాంటి సంప్రదాయం ఉందని స్పీకర్, సీఎం దృష్టికి తీసుకువెళ్లారు.

దానితో లోక్‌సభలో ఎలాంటి పద్ధతులున్నాయో చూసి, ఆ మేరకు వ్యవహరించమని సీఎం, అసెంబ్లీ సెక్రటరీ జనరల్‌కు సూచించారు. ఆ ప్రకారంగా అత్యున్నత ప్రతిభ కనబరచిన ఎమ్మెల్యేల ఎంపిక కోసం, ఒక కమిటీ వేయాలని నిర్ణయించారు. అందులో ఒక సీనియర్ జర్నలిస్టు, ఒక సీనియర్ పార్లమెంటేరియన్ సభ్యులుగా నియమించాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు.

కాగా గత ఎనిమిది నెలల నుంచి పెండింగ్‌లో ఉన్న అసెంబ్లీ కమిటీలపైనా సమవేశంలో చర్చ జరిగింది. సభ్యులు కమిటీలపై ఒత్తిడి చేస్తున్నారని సీఎం దృష్టికి తీసుకవెళ్లారు. అసెంబ్లీ-కౌన్సిల్ కలసి ఉన్న కమిటీల ఏర్పాటుపై చర్చ జరిగిన సందర్భంలో, మండలి నుంచి వేస్తే, వైసీపీ వారికి స్థానం కల్పించాల్సిన ఉంటుందని భావించారు. దానితో అసెంబ్లీ కమిటీలు మాత్రమే వేయాలని నిర్ణయించారు. ఆ మేరకు 5 లేదా 6 కమిటీలకు జాబితా ఇప్పటికే రూపొందించారు. దానిని ఇప్పటికే సీఎంకు పంపించారు. దానిని నేడు ప్రకటించే అవకాశం ఉంది.

LEAVE A RESPONSE