– టిడ్కో ఇళ్లు,అమృత్,ఏఐఐబీ ప్రాజెక్ట్ పనులకు ప్రథమ ప్రాధాన్యత
– వంద రోజుల్లో కొత్తగా మరో 63 అన్న క్యాంటీన్లు
– బడ్జెట్ డిమాండ్స్ పై చర్చ సందర్భంగా అసెంబ్లీలో మంత్రి నారాయణ
అమరావతి: రాష్ట్రంలో ప్రతి వ్యక్తికి రోజుకు 135 లీటర్ల తాగునీరు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యం మంత్రి నారాయణ అన్నారు. టిడ్కో ఇళ్ల ను పూర్తి చేయడంతో పాటు తాగునీటి ప్రాజెక్ట్ లకు సంబంధించిన అమృత్ స్కీం,ఏఐఐబీ ప్రాజెక్ట్ లకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు.శాసనసభలో సాధారణ బడ్జెట్ డిమాండ్స్ పై చర్చ సందర్భంగా భ్యులు లేవనెత్తిన పలు అంశాలపై మంత్రి వివరణ ఇచ్చారు.
పట్టణ ప్రాంతాల్లో జనాభా రోజురోజుకూ పెరుగుతుందని….2001 లో 24.2 శాతం జనాభా ఉంటే 2011 నాటికి 29.6 శాతం పెరిగిందన్నారు. భవిష్యత్తులో ఇది 37 నుంచి 38 శాతానికి పెరిగే అవకాశం ఉందన్నారు..ప్రస్తుతం రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థల్లో కోటీ 50 లక్షల మంది జనాభా నివసిస్తున్నారని…వారికి అన్ని రకాల మౌళిక వసతులు,ఇతర సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు మంత్రి చెప్పారు.
అమృత్ – 1 లో మిగిలిపోయిన పనుల పూర్తికి 41 కోట్లను బడ్జెట్ లో కేటాయించినట్లు మంత్రి తెలిపారు. మరోవైపు 2019 జనవరిలో తాను ఇదే శాఖకు మంత్రిగా ఉన్నప్పుడు ఆసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకు ద్వారా 5 శాతం వడ్డీకి 30 సంవత్సరాలలో తిరిగి చెల్లించేలా 5350 కోట్లు నిధులు ఇచ్చేలా అనుమతులు తీసుకొచ్చినట్లు మంత్రి చెప్పారు…అయితే ఈ నిధులు కూడా గత ప్రభుత్వం రాష్ట్ర వాటా ఇవ్వకపోవడంతో నిలిచిపోగా…ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చొరవ తీసుకుని కేంద్రంతో మాట్లాడి తిరిగి నిధులు తీసుకొచ్చేలా కృషిచేసారన్నారు.ఏఐఐబీ,తో పాటు కేంద్ర ప్రభుత్వ అర్బన్ డెవలప్ మెంట్ ఫండ్ పథకం ద్వారా పనులు చేపట్టేందుకు అంచనాలు సిద్దం చేస్తున్నట్లు మంత్రి నారాయణ సభలో ప్రకటించారు.
పాత కాంట్రాక్టర్లకు బిల్లులు కూడా చెల్లించలేదని మంత్రి తెలిపారు…పెండింగ్ లో ఉన్న టిడ్కో ఇళ్ల నిర్మాణానికి 4450 కోట్లు అవసరం అవుతాయని…హడ్కో ద్వారా రుణం ఇచ్చేందుకు అంగీకరించినప్పటికీ ఎఫ్ ఆర్ బీఎం పరిమితి వల్ల ఒకేసారి నిధుల విడుదల సాధ్యం కాలేదన్నారు…అయితే విడతల వారీగా అయినా ఈ నిధులు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.
టిడ్కో ఇళ్లలో 365,430 చదరపు అడుగుల విస్తీర్ణంలో పెండింగ్ లో ఉన్న ఇళ్లను వచ్చే జూన్ 12 నాటికి పూర్తి చేస్తామని చెప్పారు…టిడ్కో ఇళ్లకు రంగులు మార్చడం కోసం వందల కోట్లు గత ప్రభుత్వం ఖర్చు పెట్టిందని…అసలు రంగులు ఎందుకు మార్చారో కూడా అర్ధం కాలేదన్నారు.ఆర్ధిక వ్యవస్థను గత ప్రభుత్వం చిన్నాభిన్నం చేసిందని అన్నారు..సీఎం చంద్రబాబు కార్పొరేట్ తరహాలో టిడ్కో ఇళ్లకు రంగులు వేయాలని సూచించడంతో ఒక్కో చోట ఒక్కో రంగును ఇళ్లకు వేసామని చెప్పుకొచ్చారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్న క్యాంటీన్లను తిరిగి పునరుద్దరించినట్లు మంత్రి నారాయణ చెప్పారు.పేదవాడికి కేవలం ఐదు రూపాయిలకే కడుపునిండా నాణ్యమైన అందించాలనే ఉద్దేశంతో ఈ క్యాంటీన్లను ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం 199 అన్న క్యాంటీన్లలో ప్రతిరోజూ రెండు లక్షల 25 వేల మంది నాణ్యమైన ఆహారం తీసుకుంటున్నారని అన్నారు. అయితే ఎక్కడైతే అన్న క్యాంటీన్ ఉండదో అలాంటి నియోజకవర్గంలో ఒక అన్న క్యాంటీన్ కూడా ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్దం చేసినట్లు మంత్రి తెలిపారు.వచ్చే వంద రోజుల్లో కొత్తగా మరో 63 అన్నక్యాంటీన్ల ను ఏర్పాటుచేస్తామని అన్నారు.