డిప్యూటీ సీఎం కృష్ణదాస్ కు కోవిడ్ పాజిటివ్

డిప్యూటీ సీఎం, రాష్ట్ర రెవెన్యూ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ కు కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఇదే విషయాన్ని ఆయన మంగళవారం ఉదయం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తనకు లక్షణాలు పెద్దగా ఏవీ లేవని అయినప్పటికీ హెూమ్ ఐసోలేషన్ ను పాటిస్తున్నట్టు తెలిపారు. కోవిడ్ నియమావళిని కచ్చితంగా పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నానని, అంతకు ముందే సంక్రాంతి సందర్భంగా క్యాంపు కార్యాలయానికి కూడా సెలవు ప్రకటించామని తెలిపారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ తనకు వైరస్ సోకిందని, అయితే ఎవరూ అందోళన పడాల్సిన అవసరం లేదని తెలిపారు. ఇటీవల తనను కలిసినవారు కూడా కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

దాసన్నకు పాజిటివ్ : ముఖ్యమంత్రి జగన్
అమరావతిలో మంగళవారం శాశ్వత భూహక్కు భూరక్ష పథకాన్ని ప్రజలకు అంకితం చేసే కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ దాసన్నకు కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో సమావేశానికి హాజరుకాలేకపోయారని అన్నారు. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని త్వరలోనే అందరికీ అందుబాటులోకి వస్తారని, ప్రతి ఒక్కరు కోవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సీఎం వైఎస్ జగన్ సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న శాశ్వత భూ హక్కు రక్ష పథకంలో భాగంగా రీ సర్వే పూర్తయిన పలు గ్రామాల భూ రికార్డులను ప్రజలకు అంకితం చేస్తున్న కార్యక్రమంలో రెవెన్యూ శాఖ మంత్రిగా ధర్మాన కృష్ణదాస్ సీఎం జగన్ తో పాటు హాజరు కావాల్సి ఉంది.

Leave a Reply