Suryaa.co.in

Andhra Pradesh

నిర్విరామంగా కొనసాగుతున్న సహాయక చర్యలు

– స్వయంగా పర్యవేక్షిస్తున్న ఎమ్మెల్యే వసంత
– ఆహారంతో పాటు వాటర్ ట్యాంకర్లతో నీటి సరఫరా
– 56 వేల ఆహారపు ప్యాకెట్లు, 20 వేల యాపిల్స్, 15 వేల అల్పాహార ప్యాకెట్లు, 65 వేల వాటర్ బాటిల్స్, 12 వేల లీటర్ల పాలప్యాకెట్లు అందజేత. 20 ట్యాంకర్లతో తాగునీటి సరఫరా

మైలవరం: నియోజకవర్గంలో వరద బాధితులకు సహాయక చర్యలు నిర్విరామంగా కొనసాగుతున్నాయి. నిరాశ్రయులైన వారికి ఆహారం, తాగునీరు, పండ్లు, పాలు పంపిణీ పనులను స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ పర్యవేక్షిస్తున్నారు. గత ఐదు రోజులుగా గొల్లపూడిలోనే ఉంటూ అధికార, పార్టీ యంత్రాంగాన్ని సమాయత్తం చేస్తూ బాధితులను ఆదుకుంటున్నారు.

విజయవాడ రూరల్ మండలంలోని జక్కంపూడి జె.ఎన్.ఎన్.యు.ఆర్.ఎం కాలనీతో పాటు, ఇబ్రహీంపట్నం మండలం, కొండపల్లి మున్సిపాలిటీలో వరద ప్రభావిత ప్రాంతాల్లో నిరాశ్రయులైన వారికి ప్రణాళికా బద్ధంగా పంపిణీ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఆహారపు ప్యాకెట్లను భారీగా పంపిణీ చేశారు.

వరద బాధితులకు బుధవారం నాడు 56 వేల ఆహారపు ప్యాకెట్లు, 20 వేల యాపిల్స్, 15 వేల అల్పాహార ప్యాకెట్లు, 65 వేల వాటర్ బాటిల్స్, 12 వేల లీటర్ల పాలప్యాకెట్లు అందజేశారు. 20 ట్యాంకర్లతో తాగునీటిని సరఫరా చేశారు.

ఎమ్మెల్యే వసంత పిలుపు మేరకు 20 వాటర్ ట్యాంకర్లు గొల్లపూడి మార్కెట్ యార్డ్ వద్దకి చేరుకోగా వాటిని జక్కంపూడి కాలనీలోని అపార్ట్ మెంట్ నిర్వాసితులకు సరఫరా చేశారు. మైలవరం నియోజకవర్గ వ్యాప్తంగా ఎన్డీఏ మహాకూటమి నేతలు తగిన సహాయ సహకారాలు అందించారు. ఎమ్మెల్యే పిలుపుతో సహాయ కార్యక్రమాలకు యువకులు, కూటమి కార్యకర్తలు స్వచ్చందంగా ముందుకొచ్చారు.

వాటర్ ట్యాంకర్లకు ఆహార ప్యాకెట్ల వాహనాలను జతజేసి సహాయమందించడానికి ముందుకొచ్చినవారిని సమూహాలుగా విభజించి పోలీస్ సిబ్బంది సహకారంతో సహాయ కార్యక్రమాలకు పురమాయించారు. ఎమ్మెల్యే కేపి చర్యలతో జక్కంపూడి కాలనీ పరిసర ప్రాంతాల్లో వరద బాధిత సహాయక చర్యలు ఊపందుకున్నాయి.

LEAVE A RESPONSE