ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి నుంచి శుద్ధ నవమి వరకూ తొమ్మిది రోజులను నవ రాత్రులు అంటారు. నవ రాత్రులంటే మహిళలు దేవిని స్మరిస్తూ పండగ చేసుకుంటారు. ఈ అమ్మవారి ఆరాధనా మహోత్సవాన్ని ‘శరన్నవరాత్రి ఉత్సవాలు’గా, ‘దేవీనవ రాత్రులు’గా పిలుస్తుంటారు. మహాశక్తి స్వరూపిణి అయిన అమ్మవారిని ఈ తొమ్మిదిరోజుల పాటు తొమ్మిది రూపాలలో అలంకరించి పూజించడం జరుగుతుంటుంది.
భక్తులు ఈ తొమ్మిదిరోజుల పాటు దీక్ష చేపట్టి, ఏకభుక్త వ్రతాన్ని ఆచరిస్తూ అమ్మవారిని పూజిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. శరన్నవరాత్రులలో అత్యంత భక్తిశ్రద్ధలతో ఎవరైతే తనని పూజిస్తారో,వాళ్లు తనకి అత్యంత ప్రీతిపాత్రులని అమ్మవారే స్వయంగా చెప్పినట్టుగా పురాణాలు వెల్లడిస్తున్నాయి. దేవీ నవరాత్రులు ఎంతో విశిష్టమైనవి, మహా పవిత్రమైనవి. ఈ తొమ్మిది రోజుల పాటు ఒక్కోరోజు ఒక్కో రూపంగా అలంకరించబడిన అమ్మవారిని దర్శించుకోవడం వలన అనంతమైన పుణ్య ఫలాలు లభిస్తాయి. ఇలా తొమ్మిది రోజుల పాటు నవదుర్గలను ఆరాధించడం వలన ధనధాన్యాలు … సంతాన సౌభాగ్యాలు … సుఖశాంతులు చేకూరుతాయని పండితులు అంటున్నారు.
ఇక దేవినవరాత్రి పూజలు చేయుట, అనునది అనాది కాలంగా వస్తున్న శాస్త్రవిధి. “అశ్వనీ” నక్షత్రంలో కలసి వచ్చిన పూర్ణిమమాసమే “ఆశ్వీయుజమాసం” అవుతుంది. ఈ మాసమందు ‘దేవీనవరాత్రుల’ను శరన్నవరాత్రులని పిలుస్తూ శుద్ధపాడ్యమి తిథితో ప్రారంభించి తొమ్మిది రోజులు ఈ నవరాత్రులు వైభవంగా చేస్తారు.
ప్రథమాశైలపుత్రి,
ద్వితీయా బ్రహ్మచారిణీ
తృతీయాచంద్రఘంటీతి, కూష్మాండేతి చతుర్థికీ
పంచమా స్కందమాతేతి షష్టాకాత్యాయనేతి చ
సప్తమా కాళరాత్రిచ అష్టమాచాతి భైరవీ
నవమా సర్వసిద్ధిశ్చాత్ నవదుర్గా ప్రకీర్తితా.
మూర్తులు వేరైనా మూలపుటమ్మ ఒకరే! అలంకారాలు వేరైనా అమ్మదయ అందరిపట్ల ఒకటే! హిందువులు అత్యంత ప్రీతిపాత్రంగా ఎంతో వైభవంగా నిర్వహించే పండుగలలో ఈ “దసరావైభవం” ఒకటి. ఇది పదిరోజులు పండుగ అయినప్పటికి దేవిని రోజుకో అవతారంగా అలంకరించి అమ్మవారికి అర్చనలుచేసి, నవవిధ పిండివంటలతో నివేదనలుచేస్తూ విశేష పూజలతో పాటు శ్రీలలితా సహస్రనామ పారాయణ నిత్యము గావిస్తూ “శరన్నవరాత్రులు” గా వ్యవహరిస్తారు. శ్రవణానక్షత్రయుక్త ‘దశమి’ తిథిన విజయదశమితో ఈ దసరావైభవాలు పూర్తిచేస్తారు. దసరాకు మరోపేరు “దశహరా” అంటే! పది పాపాలను హరించేది అని అర్థం చెప్తారు దైవజ్ఞలు.ఆశ్వీయుజ మాసంలో శుక్లపక్షంలో పాడ్యమి, హస్తా నక్షత్రములో కూడియున్న శుభదినాన ఈ దేవీ పూజ ప్రారంభించడం చాలా మంచి దని మార్కండేయ పురాణం చెబుతోంది. అందువల్ల ఈ రోజు నుంచి నవరాత్రులు ప్రారంభిస్తారు.
అందులో మొదటి మూడు రోజులు దుర్గారూపాన్ని ఆరాధించి అరిషడ్వర్గాలను, తదుపరి మూడు రోజులు లక్ష్మీరూపాన్ని ఆరాధించి సిరిసంపదలను చివరి మూడు రోజులలో సరస్వతి రూపాన్ని ఆరాధించి జ్ఞానాన్ని పొందాలని పెద్దలు చెబుతున్నారు.
కనక దుర్గాదేవి (పాడ్యమి)
శ్రీ బాల త్రిపుర సుందరి ( విదియ )
శ్రీ అన్నపూర్ణ దేవి (తదియ )
శ్రీ గాయత్రి దేవి ( చవతి )
శ్రీ లలిత త్రిపుర సుందరి ( పంచమి )
శ్రీ మహాలక్ష్మి దేవి ( షష్టి )
శ్రీ సరస్వతి దేవి ( సప్తమి )
శ్రీ దుర్గాదేవి ( అష్టమి)
శ్రీ మహిససురమర్ధిని దేవి ( నవమి )
శ్రీ రాజ రాజేశ్వరి దేవి ( దశమి)
దుర్గా సప్తశతి పారాయణ విధానం ??
ఎంతో విశిష్టత కలిగిన ఈ దుర్గా సప్తశతి యందు 13 అధ్యాయాలున్నాయి. నవరాత్రి తొమ్మిదిరోజులలోను ఈ 13 సంఖ్యగల అధ్యాయాలను ఎలా పారాయణ చేయాలి ? అనే అనుమానం సహజంగానే ఎవరికయినా కలుగుతుంది.
ఇందుకు 3 విధాలను ఇక్కడ సూచించటం జరిగింది. దేవీ కటాక్షం పొందగోరువారు ఈ 3 విధాలలో ఏది ఎన్నుకున్నా ఫలితం పొందడంలో మాత్రం ఎటువంటి తేడా ఉండదు. కనుక భక్తులు తమకు అనుకూలమైన రీతిని ఎంపిక చేసుకోగలరు.
మరో అంశం…..ఈ పారాయణ సమయంలో-ఆయా అధ్యాయాల్లో దేవతలు, ఇంద్రుడు, మునులు మున్నగు వారి స్తోత్రములు సందర్బాను సారం చేర్చబడి ఉన్నాయి.అవి ఇంకా అద్బుత ఫలదాయక మైనవి.
1.మొదటి విధానము:
ఆశ్వయుజ మాసములోని శుక్లపక్షపాస్యమి మొదలు నవమి వరకు తొమ్మిది రోజులను శరన్నవ రాత్రములు అంటారని తెలిసినదే!
ఈ 9 రోజులు అత్యంత పుణ్యప్రదమైన రోజులు. పారాయణ, నామజపం, దేవీస్తోత్రం, ఉపాసన, అర్చన….ఎవరికి ఏది అనుకూలమైతే అది ఆచరించటం అద్బుత పుణ్యదాయకం. మొదటి రోజు మొదలు తొమ్మిది రోజులూ ప్రతి దినమూ 13 అధ్యాయాములను పారాయణ చేయుట ఒక పద్దతి, పారాయణకు శ్రద్దభక్తులు అత్యంత అవసరం.
13 అధ్యాయాలు ప్రతి రోజు (కూర్చున్న ఆసనం పై నుంచి కదలకుండా) చేయడానికి కనీసం వారి వారి సామర్థ్యాన్ని బట్టి ఐదారుగంటలకు తక్కువ లేకుండా పట్టవచ్చు! దైవకృప అపారంగా గల వారికి ఇది సాధ్యపడవచ్చు.!.
మిగిలినవారికి మరో రెండు విధాలు:
2. రెండో విధానము:
1వరోజు (పాడ్యమి) ఒకే ఒక్క ప్రధమాధ్యాయం మాత్రమే
2వరోజు(విదియ) రెండు,మూడు,నాలుగు అధ్యాయాలు
3వరోజు(తదియ) ఐదు మొదలు పదమూడు అధ్యాయాలను పూర్తిగా
పైన చెప్పినట్లు-
తొమ్మిది రోజులూ పుణ్యప్రదమైనవే కనుక మూడేసి రోజులను పారాయణకు ఎంచుకోవచ్చును.
నియమం మాత్రం ఒక్కటే! “ఏ మూడు రోజులయినా”అన్చెప్పి ఒకటో రోజు చేసి, రెండ్రోజుల తర్వాత కొన్ని అధ్యాయాలు, మరో రెండ్రోజులు ఆగి కొన్ని అధ్యాయాలు చదువరాదు.
పాడ్యమి, విదియ, తదియలు ఎవరికైనాఇబ్బందుల-ఆటంకాల దృష్ట్యా కుదరనపుడు-చివరి మూడురోజులను(సప్తమినాడు కాక), దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమిని ఎన్నుకొన వచ్చును.అనగా 10వరోజు అయినప్పటికీ-దసరా పండుగ (విజయదశమి) రోజును కూడా కలుపుకోగలరు.
3. మూడో విధానము:
మొదటిరోజు-మొదటి అధ్యాయం
రెండవరోజు-రెండు,మూడు అధ్యాయాలు
మూడవరోజు-నాలగవ అధ్యాయం
నాల్గువరోజు-ఐదు,ఆరు అధ్యాయాలు
ఐదవరోజు-ఏడవ అధ్యాయం
ఆరవరోజు-ఎనిమిదో అధ్యాయం
ఏడవరోజు-తొమ్మిది,పది అధ్యాయాలు
ఎనిమిదవరోజు-పదకొండవ అధ్యాయం
తొమ్మిదవరోజు-పన్నెండో అధ్యాయం
విజయదశమి రోజు-పదమూడో అధ్యాయం.
ఈ ప్రకారం పైన సూచించిన విధాలలో ఏదైనా ఎన్నుకో వచ్చు! అయితే, పారాయణ చేస్తున్నంతకాలం ఈ విషయాలపై శ్రద్ద వహించాలి :
దుర్గాష్టోత్తర శతనామ/ సహస్ర నామములతో (ఏదైనాసరే ఒకటి) పూజించుట.
ధూపదీప నైవేద్యాలు అర్పించుట.
పారాయణకు ముందు అక్షతలు చేతులోకి తీసుకొని, తాము కోరుకున్న కోరికను మనస్సులోనే చెప్పుకొనుట.
పారాయణం అయిన వెంటనే అష్టోత్తర శత నామస్తోత్రం పఠించుట. పునఃపూజ చేయుట.
పానకం/వడపప్పు (పంద్యారాలకు) కొబ్బరి, బెల్లంపొంగలి/దద్యోజనం/వడలు వంటి పదార్థాలలో ఎవరి శక్త్యానుసారం వారు మహానైవేద్యం సమర్పించుట.
పూర్ణిమ/శుక్రవారంనాటికి (ఏవైనా అనివార్యమైన ఆటంకాలు ఎదురైనప్పుడు) పారాయణ ముగిసేలా చూసుకొనుట.పారాయణ పరిసమాప్తమైన రోజున, ముత్తైదువను భోజనానికి ఆహ్వానించి, వస్త్రం, ఎర్రనిది దక్షిణ సహితంగా(9 సంఖ్య ఉండేలా) దానం ఇచ్చి పాదనమస్కారం చేయుట.
ప్రతి పారాయణ భాగానికి ముందుగా ఈ 3 శ్లోకాలు పఠించుట.
శరణాగత దీనార్త పరిత్రాణ పరాయతే| సర్వ స్యార్తి హరేదేవి నారాయణి నమోస్తుతే||
సర్వ మంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధకే| శరణ్యేత్ర్యంబక దేవి నారాయణి నమోస్తుతే||
సర్వబాధా వినిర్ముక్తో ధన ధాన్య సుతాన్వితః| మనుష్యో మత్ప్రసాదేన భవిష్యతి నసంశయః||
దుర్గాసప్తశతీ పారాయణం చేసేవారు ముఖ్యంగా గమనించాల్సింది:
ఎటువంటి కోపతాపాలకిగాని/వికారాలకుగాని లోను కారాదు.
శుచి శుభ్రతలను పాటించడం అత్యంత కీలకం.
దుర్గా సప్తశతి
అమ్మ ఆది పరాశక్తి అని తెలిసిన విషయమే ! చండీమాత ఓ ప్రచంఢ శక్తి. భూగ్రహంపై మాత్రమే కాకుండా విశ్వాంతరాళాలని అంటిపెట్టుకునే ఉంటుంది. సృష్టి జరగటానికి, అది వృద్ధి చెందటానికి , తిరిగి లయం కావటానికి అవసరమైన శక్తి అంతా ఆమెలోనే ఉంది. ఆమె ఆదిశక్తి , పరాశక్తి, జ్ఞానశక్తి , ఇచ్ఛాశక్తి , క్రియాశక్తి, కుండలినీశక్తి ! అందుకే ఆమెకు అంత ప్రాధాన్యం.
లోక రక్షకులైన అమ్మవారి స్వరూపాలలో చండి ఒకటి. లోక కళ్యాణం కోసం , విశేష కార్యసిద్ధి కోసం , సకల చరాచర జగత్తు సృష్టికి , స్థితికి , లయకు మూలకారణమైన జగన్మాతను ఆరాధించటం అనాదిగా వస్తోంది. ఆది తత్వాన్ని నేత్రమూర్తిగా భావించి చేసే ప్రకృతి ఉపాసనే శ్రీవిద్య
అది లలితా పారాయణం , చండీ పారాయణం అని రెండురకాలు . బ్రహ్మాండపురాణం , దేవీభాగవతం లలితా దేవి మహిమలను చెబితే , మార్కండేయ పురణ చండీ మహత్యాన్ని వివరిస్తుంది. చండీ లేదా దుర్గాదేవి విజయాలను వివరించటంతోపాటు బ్రహ్మాదిదేవతలు ఆమే వైభవాన్ని కీర్తించే శక్తివంతమైన మంత్రాల కదంబమే చండీ లేదా దుర్గా సప్తశతి.
చండీహోమంలో ఉన్న మంత్రాలు & అద్యాయాలు:
చండీ సప్తసతిలో 700 మంత్రాలు ఉంటాయని ప్రతీతి. ఐతే ఇందులో ఉన్న మంత్రాలు 578 మాత్రమే. ఉవాచ మంత్రాలు , అర్ధశ్లోక , త్రిపాద శ్లోక మంత్రాలతో కలిపి మొత్తం 700 మంత్రాలు ఐనాయి. బ్రాహ్మీ , నందజ , రక్తదంతిక , శాకాంబరీ , దుర్గ , భీమ , భ్రామరి అనే ఏడుగురు దేవతా మూర్తులకు సప్తసతులు అని పేరు. వారి మహత్మ్యా వర్ణనతో కూడిన మంత్రాలు కాబట్టీ దీనికి చండీ సప్తశతి అనే పేరు వచ్చింది. ఇది శాక్తేయ హోమం కనుక నిష్ఠగా చేయవలసి ఉంటుంది.
_దుర్గా లేదా చండీ సప్తశతి మూడు చరిత్రలుగా , 13 అధ్యాయాలుగా ఉంటుంది. తొలి భాగంలో ఒకేఒక అధ్యాయం ఉంటుంది. రెండవ భాగంలో మూడు అధ్యాయాలు , మూడవ భాగంలో తొమ్మిది అధ్యాయాలు ఉన్నాయి. వీటిలో మధుకైటభ వర్ణన , మహిషాసుర సంహారం శుంభనిశుభుల వధతో పాటు బ్రహ్మాదిదేవతలు చేసిన పవిత్ర దేవీ స్తోత్రాలు ఉంటాయి. సప్తశతి ని మూడు పద్ధతులలో ఆచరిస్తారు. పూజ , పారాయణ , హోమం . ఈ మూడుపద్దతులలో జగన్మాతను ప్రసన్నం చేసుకుంటారు. పారాయణలో దశాంశం హోమం , దశాంశం తర్పణ ఇస్తారు.
చండీ హోమానికి సంబందించి నవ చండీ యాగం , శత చండీ యాగం , సహస్ర చండీ యాగం , అయుత ( పది వేలు ) , చండీయాగం , నియుత ( లక్ష ) చండీయాగం , ప్రయుత ( పది లక్షలు ) చండీయాగం ఉంటాయి._
2. చండీ పారాయణ వలన సమాజానికి జరిగే మేలు :
ఎక్కడ చండీ ఆరాధనలు జరుగుతాయో అక్కడ దుర్భిక్షం ఉండదు. దుఃఖమనేది రాదు . ఆ ప్రాంతంలో అకాల మరణాలుండవు. లోక కళ్యాణం , సర్వజనుల హితం కోసం పరబ్రహ్మ స్వరూపిణి ఐన చండికా పరమేశ్వరులను పూజించాలని సూత సంహిత ఉద్ఘటిస్తోంది.
కలియుగంలో చండీ పారాయణకు మించిన శక్తి వంతమైన ఫలసాధనం మరొకటి లేదని శాస్త్ర వచనం. ఇహపర సాధనకు చండీహోమం ఉత్తమం. 700 మంత్రాలతో కూడిన చండీ సప్తశతిని పారాయణ చేసి , హోమం నిర్వహించటమే చండీహోమం. దేశోపద్రవాలు శాంతించటానికి , గ్రహాల అనుకూలతలకు , భయభీతులు పోవటానికి , శత్రు సంహారానికి , శత్రువులపై విజయం సాధించటానికి తదితర కారణాలతో చండీ యాగం చేస్తారు.
వీటిలో
నవ చండీయాగం చేస్తే వాజపేయం చేసినంతఫలం వస్తుందట.
ఏకాదశి చండీ చేస్తే రాజు వశమౌతాడని ,
ద్వాదశ చండీ చేస్తే శత్రునాశనమని ,
మను చండీ ( చతుర్దశ చండీ ) తో శత్రువు మౌతాడని మార్కండేయపురాణం చెప్పినట్లు , శాంతి కమలాకరంలో ఉన్నది.
ఇక శత చండీ చేస్తే కష్టాలు , వైద్యానికి లొంగని అనారోగ్యం , ధన నష్టం తదితరాలు తొలగుతాయి. సహస్ర చండీతో లక్ష్మీదేవి వరిస్తుంది. కోరికలు నెరవేరుతాయి.
లక్ష చండీ చేస్తే చక్రవర్తి ఔతాడని మార్కండేయ పురాణంలో ఉంది. దీనినే నియుత చండీ అంటారు. ప్రయుత చండి అంటే పది లక్షల చండీ సప్తశతి పారాయణాలు