Suryaa.co.in

Andhra Pradesh

మంగళగిరి లక్ష్మీనరసింహ స్వామి భక్తుల నిలువు దోపిడీ

కొబ్బరికాయల్లో మోసం
పానకంలో దగా
పానకంలో ఉప్పునీరు బోర్ వాటర్
ఆలయంలో అవినీతి, దోపిడీయే
మండిపడుతున్న భక్తులు
కొంగ జపం చేస్తున్న అధికారులు
ఆలయ ప్రతిష్ట మంట కలుస్తున్న వైనం
-(పులగం సురేష్, జర్నలిస్టు)

భక్తులు నిలువు దోపిడీకి గురి అవుతున్నారు .దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీ మంగళగిరి లక్ష్మీనరసింహ స్వామి ఆలయ ఎగువ దిగువ సన్నిధిలో భక్తులు మోసానికి గురి అవుతున్నారని ఆరోపణలు విని పిస్తున్నాయి. దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి ఏపీ, తెలంగాణ, కర్ణాటక, చెన్నై, ఇంకా ఇతర ప్రాంతాల నుండి ప్రతిరోజు మంగళగిరి నరసింహ స్వామి సన్నిధికి వచ్చి స్వామివారినీ దర్శనం చేసుకుంటుంటారు. ఇది గత దశాబ్దాలుగా వస్తున్న ఆనవాయితీ.

అయితే ఇక్కడ కొబ్బరికాయలు పానకం పాటదారుల మోసం, దగా, వలన భక్తులు తీవ్ర నిరాశ నిస్పృహలకు లోనవు తున్నారని విమర్శలు ఉన్నాయి. పానకాల స్వామి ఎగువ సన్నిధిలో కొబ్బరికాయలు అమ్మకం కోసం సుమారు 87 లక్షల రూపాయలకు పాట పెట్టి ఒక వ్యక్తి కొనుక్కున్నారు. అలాగే స్వామి దర్శనానికి వచ్చి పానకం పోసే భక్తులకు సంబంధించి.. ఒక పాటదారుడు సుమారు కోటి 11 లక్షల రూపాయలు పాట పెట్టి కొనుక్కున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఇక్కడే అసలు మోసం, దగా ప్రారంభమవుతున్నది.

వాస్తవానికి స్వామివారికి పోసే పానకం బిందె కు 55 నుండి 60 రూపాయలు పెట్టి కొనుక్కోవాల్సిందే. అయితే స్వామివారికి నీళ్ల పానకమే గతి అవుతున్నది .దీనికి తోడు దిగువ సన్నిధి సత్రం గదుల వద్ద నుండి స్వామివారు ఆలయానికి నీరు సరఫరా చేయటానికి పైపులైన్లు వేసి బోరు వాటర్ సరఫరా చేస్తున్నారనీ . బోరు వాటరు తాగటానికి చాలా వుప్పుగా ఉంటుందని భక్తులు అంటున్నారు.

బోరు వాటర్ నుండి వచ్చే ఉప్పునీరు తో పానకం తయారుచేసి భక్తులకు అమ్ము తున్నారని విమర్శగా ఉంది. ఇవి కూడా నీళ్ల నీళ్లు గా ఉంటుందని అంటున్నారు. బెల్లం, మిరియాలు, ఇంకా ఇతర పదార్థాలు వేసి అత్యంత రుచికరంగా తయారు చేయవలసిన పానకం..బోరు వాటర్ తో వచ్చే ఉప్పు నీరుతో నీళ్ల నీళ్లగా పానకం విక్రయిస్తున్నారని భక్తులు వాపోతున్నారు.

ఇంకో రకం మోసం ఏమిటంటే పెద్ద సైజు కొబ్బరికాయలు కాయ ఒకటింటికి పానకాల స్వామి కొండపైన 25 రూపాయలకు అమ్మాలని ఆలయ నిబంధన ఉంటే.. పాటదారులు మాత్రం ఈ నిబంధనను తుంగలోకి తొక్కి చిన్న సైజు కొబ్బరికాయను 30 రూపాయలకు అమ్ముతూ దగా చేస్తున్నారనీ భక్తులు అంటున్నారు.

ఇంకో గమ్మత్ ఏమిటంటే కొబ్బరి చిప్పలకు ఆలయ అధికారులు సుమారు 5 లక్షల రూపాయలతో మరో పాట పెట్టారు. అయితే కొండపైన పెద్ద సైజు కొబ్బరికాయలు అమ్మాలనే నిబంధన ఉన్నా కూడా చాలా చిన్న సైజు కొబ్బరికాయలను 30 రూపాయలకు అమ్ముతున్న సంగతి అందరికీ జగమెరిగిన సత్యమే. అయితే కొబ్బరి చిప్పలు పాడుకునే వ్యక్తికి చిన్న చిప్పలే గతి అవుతున్నాయి. ఈ చిప్పలు పాడుకున్న వ్యక్తికి నష్టాలు తప్పవు. చివరకు కొబ్బరి చిప్పలు లక్షల్లో పాడుకున్న వ్యక్తికి చిప్పలే గతి..

మంగళగిరి పుణ్యక్షేత్ర ఆలయాల్లో అవినీతి దోపిడీ ఆకాశానికి అంటుతుంటే ఆలయ అధికారులు మాత్రం చిద్విలాసంగా చోద్యం చూస్తున్నారు, నిద్ర నటిస్తూ కొంగ జపం చేస్తున్నారని భక్తులు తీవ్రంగా విమర్శిస్తు న్నారు. ఇందులో ఎవరికి ఎంతెంత వాటాలు వెళుతున్నాయో అని ధ్వజమెత్తుతున్నారు. ఏది ఏమైనా గత కొంతకాలంగా మంగళగిరిలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల ప్రతిష్ట నానాటికి దిగజారి పోతున్నదని విమర్శలు లేకపోలేదు.

ఈ ఆలయాలలో పని చేసే వారిని ప్రక్షాళన చేయాలి. సమర్థుడైన ఆలయ అధికారులను నియమించాలని పలువురు కోరుతున్నారు. జరుగుతున్న అవినీతిని ..ఉగ్ర నరసింహుడు.. హిరణ్యకశిపుని ప్రేవులు చీల్చినట్టు అవినీతిని చీల్చి చండాడాలని భక్తులు స్వామి వారిని వేడుకుంటున్నారు.

LEAVE A RESPONSE