ధరణి సమస్యలు

ఒక సర్వే నెంబర్‌లో కొంత భూమి నిషేధిత జాబితాలోనే, వివాదాస్పదంగానో… ప్రభుత్వ, దేవాదాయ, అటవీ భూమిగానో ఉంటే మొత్తం సర్వే నెంబర్‌ను బ్లాక్ లిస్టు లో పెడుతున్నారు. ఆ సర్వే నెంబర్‌లో మిగతా రైతులు… తమ సొంత భూమిని అమ్ముకోలేక… కొనుక్కోలేక ఇబ్బంది పడుతున్నారు. దేవస్థాన, వక్ఫ్ భూములు ప్రైవేటు పరం కాకుండా నిషేదిత జాబితా 22A కింద పొందుపరిచారు. ఈ భూముల హద్దుల నిర్దారణ జరగకపోవడంతో, పొరుగునే ఉన్న వేల ఎకరాల సాగు భూములు నిషేధిత జాబితాలో ఉన్నాయి. వాటిని 4 నెలల్లో పరిష్కరించాలని 2015 లో హైకోర్టు చెప్పినా నేటికి పెండింగ్ లో ఉన్నాయి.
ఒక సర్వే నెంబర్ లో కొంత భూమి ప్రభుత్వ అవసరాలరీత్యా భూ సేకరణ చేస్తే మొత్తం సర్వే నెంబర్ ను బ్లాక్ చేస్తున్నారు. దీంతో మిగిలిన భూమి ధరణి ద్వారా క్రయ విక్రయాలు చేసుకోలేకపోతున్నారు.
ఎవరైనా ఇద్దరు భాగస్వాములు కలిపి కొనుక్కున్న భూమిని, అమ్ముకోలేని పరిస్థితి. జాయింట్ రిజిస్ట్రేషన్‌కు ధరణి పోర్టల్‌లో కాలమ్‌ అస్సలు లేదు.
రిజిస్ట్రేషన్ సమయంలో చిన్నచిన్న పొరపాట్లు జరిగితే సరిదిద్దుకునే ఛాన్స్ లేదు. గతంలో ఈ పొరపాట్లను సరిదిద్దేందుకు రిక్టిఫికేషన్ ఆప్షన్ ఉండేది. ఇది లేకపోవడంతో సమస్య మళ్లీ కోర్టుల చుట్టూ చక్కర్లు కొడుతోంది. ధరణి పోర్టల్ ఆధారంగా జరుగుతున్న రిజిస్ట్రేషన్లలో సరిగా పేర్లు నమోదు కావడం లేదు. ఇంగ్లిష్ లో టైప్ చేస్తే తెలుగులో వచ్చే సాఫ్ట్ వేర్ ను వినియోగిస్తున్నారు. నేరుగా తెలుగు టైపింగ్ లేకపోవడం పెద్ద లోపం. ఓటర్ల జాబితా మాదిరిగా..ఆదార్ కార్డులో వచ్చినట్లుగా పేర్లు గజిబిజిగా ఉంటున్నాయి. వీటిని సరిదిద్దాలంటే మల్లా కోర్టును ఆశ్రయించక తప్పదు.
కొత్తగా రిజిస్టర్‌ మ్యుటేషన్ అవుతున్న ఆస్తులకు లింక్ డాక్యుమెంట్ నెంబర్‌ ఉండటం లేదు. అగ్రికల్చర్, నాన్ అగ్రికల్చర్ ఇలా 2 విభాగాలుగా తెలంగాణలోని భూములను విభజించి రిజిస్ట్రేషన్ చేస్తుండటంతో కొన్ని భూములు డూప్లికేట్ అవుతున్నాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో చాలా భూములు వెంచర్లు, విల్లాలు, అపార్ట్‌మెంట్‌లుగా మారిపోయాయి. అలాంటి స్థలాలు ఇంకా వ్యవసాయ భూములు జాబితాలోనే ఉన్నాయి. ఆ సర్వే నెంబర్ల భూములకు రైతు బంధు పథకం కూడా వస్తుంది. పాస్ పుస్తకాలు సైతం పాత ఓనర్ల పేర్ల మీదే ఉంటున్నాయి. దీంతో వాటిని తిరిగి అమ్ముకునే వెసులు బాటు దక్కుతోంది.
గతంలో భూముల సర్వే నెంబర్లు తప్పుగా ఉన్నా… సరిహద్దుల కొలతలు తప్పుగా ఉన్నా ఎమ్మార్వో స్థాయిలో వాటిని సరిచేసుకునే వీలుండేది. ఇప్పుడు అధికారాలన్నీ కలెక్టర్ చేతికి వెళ్లేసరికి కలెక్టర్ ఆఫీస్‌ల చుట్టూ రైతులు తిరగడం కొత్త ఇబ్బంది.
వ్యక్తుల పేరుతో కాకుండా సంస్థల పేరుతో ఉండే భూములను అమ్మడం కొనడం ప్రస్తుతానికి అవకాశం లేదు. ఎన్‌ఆర్‌ఐలు తెలంగాణలో భూములు కొనడం, అమ్మడంపై క్లారిటీ లేదు. ఎన్‌ఆర్‌ఐలకు ఎలాంటి గుర్తింపు కార్డులతో రిజిస్ట్రేషన్‌తో చేస్తారనే విషయంలో గందరగోళం గత్తరలేపుతోంది.
ఒకవేళ యజమాని చనిపోతే… అతని భూమిని కుటుంబ సభ్యులంతా కలిసి ఉమ్మడిగా అమ్మే ఛాన్స్ ఉండేది. ఇప్పుడు చట్టబద్దమైన హక్కుదారుడు మాత్రమే అమ్మేలా మార్పులు చేశాడు. ఆ చట్టబద్దత పొందేందుకు వారసులు ఇబ్బంది పడుతున్నారు.
రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత సేల్ డీడ్‌ రద్దు చేసుకునే అవకాశం గతంలో ఉండేది. ఇప్పుడు ఆ వెసులుబాటు తొలగించారు. ఇది కూడా కొన్ని ఇబ్బందులకు కారణం. జీపీఏ, ఏజీఏ ద్వారా భూముల అమ్మకాలు కొనుగోళ్లు గతంలో జరిగేవి. ఇది భూములతో వ్యాపారం చేసేవాళ్లకు లాభదాయకంగా ఉండేది. ఇప్పుడా ఆప్షన్ తొలగించారు.
ధరణిలో పలు సర్వే నెంబర్లు గల్లంతు అయ్యాయి. దీంతో ఆయా భూములకు ఎమ్మార్వో కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు జరగడం లేదు. రికార్డుల నవీకరణ జరిగినా మ్యుటేషన్ గానీ భూముల విషయంలో అమ్ముకున్న వారి పేర్ల మీద పాస్ పుస్తకాలు జారీ అయ్యాయి. దీంతో అసలు ఓనర్లు అమ్ముకుందామన్నా వీలు కావడం లేదు. కొత్త పాస్ పుస్తకం ఉంటేనే రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. కానీ వివిద కారణాల వల్ల 6 లక్షల ఖాతాలకు సంబంధిచి పాస్ పుస్తకం రాలేదు.
రైతు బంధు పథకం అమలు సందర్భంగా కొత్త పట్టదారు పాసు పుస్తకాలు ఇచ్చారు. రెవిన్యూ రికార్డుల్లో అనుభవదారు కాలం తీసేయడం వల్ల చాల చోట్ల రైతులు నష్టపోతున్నారు. ఎప్పుడో కొనుగోలు చేసిన భూములు, భూ పంపిణిలో దక్కిన భూములకు చాలా చోట్ల పట్టాలు రాలేదు. ఇంకా అక్కడ అనుభవదారు కాలంలోనే వీరు ఉన్నారు. ఇప్పుడు అనుభవం దారు కాలం తొలగించడంతో పాత ఓనర్ల కు ఈ భూములు దక్కాయి. పాత యాజమానుల పేర్లే ధరణిలో కనిపిస్తున్నాయి.
తిరిగి ఆ భూములుకు దక్కించుకోవాలంటే పేద రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఉదా హరణకు మహబూబ్ నగర్ జిల్లా కోవేలకోడు మండలం అంకిల్ల గ్రామంలో 53 ఎకరాల విషయంలో ఇదే జరిగింది. పాత యాజమానులకు డబ్బులు ముట్టచెప్పి తిరిగి ఆ భూములను పేద రైతులు రాయించుకుంటున్నారు. ఇప్పుడు ధరణి రికార్డుల్లో తమ పేరు లేని పేద రైతులంతా అయితే భూములు కోల్పోవాలి. లేదా డబ్బులు రెండో సారి ముట్టచెప్పి భూములు దక్కించుకోవాలి.
విరాసత్ లో భాగంగా అన్నదమ్ముల మధ్య పంపకాలు జరుగుతాయి. ప్రతి సర్వేలో సగ భాగం చేయాల్సిందే తప్ప ఆ సర్వేలో 10 ఎకరాలు నువ్వు తీసుకో..ఈ సర్వేలో 10 ఎకరాలు నేను తీసుకుంటా అనే సర్దుభాటు పద్దతి ధరణిలో రావడం లేదు.భూ తగదాలున్న 3.73 లక్షల ఖాతాలను పార్టీ భీలో చేర్చారు. ధరణి చట్టంలో వీటి సమస్య ను కోర్టుల్లో నే తేల్చుకోవాలి అంటున్నారు. అంగీకారం కుదిరినా… ధరణి లో రిజిస్ట్రేషన్లు కావడం లేదు.

Leave a Reply