-కన్న తండ్రికి ఎంత కష్టం.. ఎంత కష్టం..?
-కేజీహెచ్‌లో ఆక్సిజన్ సిలెండర్‌ను మోసుకెళ్లిన పసికూన తండ్రి
-వైరల్ అవుతున్న వీడియో
-వైద్యశాఖ నిర్లక్ష్యానికి పరాకాష్ఠ
విశాఖపట్నం: పసిబిడ్డకోసం ఆక్సిజన్ సిలెండర్‌ను మోసుకుంటూ పరుగులు తీస్తున్న ఈ కన్నతండ్రి తపన చూశారా? ఇది కెజిహెచ్‌లో వైద్య సిబ్బంది నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం. కాదంటారా? బ్యాటరీ వాహనాలు లేకపోవడంతో, కన్న తండ్రి ఆక్సిజన్ సిలెండర్‌ను మోసుకుంటూ వెళ్లిన ఈ దృశ్యం, వైద్యశాఖ నిర్వాకానికి పరాకాష్ట. అక్కడ పనిచేయాల్సిన సిబ్బంది ఏమయ్యారు? వారిని పర్యవేక్షించాల్సిన అధికారులు ఏం
చేస్తున్నారు? అసలు కేజీహెచ్‌లో బ్యాటరీ వాహనాలున్నాయా? ఉంటే పనిచేస్తున్నాయా? పనిచేస్తున్నా పడకేశాయా? ఇవీ రోగులు సంధిస్తున్న ప్రశ్నలు. మంత్రిగారూ.. వింటున్నారా? కేజీహెచ్ దృశ్యాలు చూస్తున్నారా? ఈ అసాధారణ దృశ్యం. వివరాల్లోకి వెళితే..
కేజీహెచ్ లో నెలలు నిండని బిడ్డ ఆరోగ్యం కోసం ఓ తండ్రి పడిన కష్టం ఇది. తూర్పుగోదావరి జిల్లా కోటనందూరుకు చెందిన అల్లు శిరీష అనే గర్భిణిని కుటుంబ సభ్యులు మంగళవారం ఉదయం కేజీహెచ్ ప్రసూతి విభాగంలో చేర్పించారు.నెలలు నిండకుండానే ఓ బిడ్డకు జన్మనివ్వడంతో ఆ శిశువును పిల్లల వార్డుకు అనుబంధంగా ఉన్న ఎన్ఐసీయూలో ఉంచాలని వైద్యులు సూచించారు.
దీంతో ఆ పసికందుకు ఆక్సిజన్ పెట్టి, ఎన్ఐసీయూ బయలుదేరారు. నర్సు బిడ్డను పట్టుకొని ముందు నడవగా.. సమయానికి సిబ్బంది లేకపోవడంతో శిశువు తండ్రి అల్లు విష్ణుమూర్తి, ఆక్సిజన్ సిలిండర్ను భుజాన వేసుకొని ఆమె వెంట వెళ్లారు.
ఈ ఘటనను వీడియో తీసిన కొందరు సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. దీనిపై ఆసుపత్రి పర్యవేక్షక వైద్యాధికారి డాక్టర్ శివానంద ఆరా తీశారు. వైద్యులు, సిబ్బందిని పిలిచి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకూడదని ఆదేశించారు. ఇక నుంచి బ్యాటరీ వాహనాన్ని అందుబాటులో తెస్తామన్నారు.