ఏమిటో ఈ రోజుల్లో జరిగే దీపావళి సంబరాలు చూస్తూంటే, invariable గా ఇదివరకటి దీపావళి సంబరాలు గుర్తొచ్చేస్తాయి . ఎప్పుడు చూసినా ఈయనకేమీ పనిలేదూ, తన చిన్నప్పుడు ఎలా చేసికునేవారో, ఇప్పుడెలా చేసికుంటున్నారో అని చెప్పడం తప్ప, అని అనుకోవచ్చు.
కానీ ఏం చేస్తాను, ఆ జ్ఞాపకాలు తెచ్చుకోడం తప్ప చేసేదేమీ లేదు. ఇప్పటివాళ్ళు ఏమేమి మిస్సవౌతున్నారో మీ ఇంట్లో ఉండే పెద్దాళ్ళని అడగండి తెలుస్తుంది!
ఆ రోజుల్లో దీపావళి వస్తోందంటేనే, పది పదిహేను రోజుల ముందు నుంచి హడావిడి ప్రారంభం అయ్యేది.మతాబులు, చిచ్చుబుడ్లూ, సిసింద్రీలూ ఇళ్ళల్లో తయారుచేసికోడమే కానీ, బజారుకెళ్ళి కొన్నదెవరు? సూరేకారం, బీడూ , గంధకమూ లాటివన్నీ అమ్మనడిగి, ఓ పాత చేట తీసికుని, దాంట్లో ఎండబెట్టడం, ఇంట్లో ఉన్న న్యూసు పేపర్లతో, మతాబులకి గొట్టాలు చేసికోడం, సిసింద్రీలకైతే ఈ న్యూస్ పేపరు ఉపయోగించదు, కొద్దిగా దళసరిగా ఉండాలి కాగితం. వీటన్నిటినీ చుట్టి అంటించడానికి లైపిండోటీ.
సిసింద్రీలు ఇళ్ళల్లో అందరూ తయారుచేసికోవడం వచ్చేది కాదు, దానితో ఎక్కడెక్కడ ఎవరెవరు అమ్ముతున్నారో తెలిసికొని, ముందుగానే ఆర్డరివ్వడం. అవికూడా వందా, రెండొందలూ కాదు, ఏకంగా వెయ్యి !
బజారుకెళ్ళి తెచ్చేదేమిటయ్యా అంటే, తాటాకు టపాకాయలు ( మామూలువీ, ఎలట్రీవీ నూ),
ఓ తుపాకీ దాంట్లోకి కాప్పులూ, విష్ణుచక్రాలూ, కాకరపువ్వొత్తులూ, ఇంకొంచం డబ్బులు దొరికితే,
ఓ పాము బిళ్ళల ప్యాకెట్టూ, మెగ్నీషియమ్ తీగా. నాన్నలతో మార్కెట్ కి వెళ్ళామా, అంతే సంగతులు అదొద్దూ,ఇదొద్దూ అనడమే! అప్పుడు ఎందుకు అలా అనేవారో, పెళ్ళై పిల్లల్ని కన్న తరువాత తెలిసిందనుకోండి.
ఓ సంచీ నిండా తెచ్చుకుని,ఎండ పెట్టుకోడం.
ఇంక దీపావళికి ముందురోజు దీపాలు పెట్టుకోడానికి ప్రమిదలు, నూనె రెడీ.
ఈరోజుల్లో అయితే, అవేవో water sensor ప్రమిదలుట, నీళ్ళుపోస్తే ఒత్తి లాటిది వెలుగుతూనే ఉంటుంది.. కొంచం ఖరీదెక్కువయినా హాయిగా , రాత్రంతా వెలుగు కనిపిస్తూనే ఉంటుంది..ఏమిటో చిత్ర విచిత్రాలు టెక్నాలజీ ధర్మమా అని.
నరక చతుర్దశినాడు, తెల్లారకట్ల నాలుగున్నరేయ్సరికి, ఆల్ ఇండియా రేడియోలో , నాదస్వర కచేరీతో రోజు ప్రారంభమయ్యేది.
దీపావళి రోజుకి గోంగూర కాడలూ, నూనెలో ముంచి వత్తులు చేసికోడానికి ఓ కొత్త సైను గుడ్డా.దీపావళి సాయంత్రం, దిబ్బూ దిబ్బూ దీపావళి అంటూ వాటిని నేలకేసి కొట్టి ఆర్పేయడం, కాళ్ళు కడుక్కుని, అమ్మ పెట్టే తాయిలం తినేసి, ఓ తిప్పుడు పొట్లం పుచ్చుకుని దాన్ని తిప్పుకుంటూ ఓ గంట గడిపి, తరువాతే బాణాసంచా కాల్చుకోవడం. ఇళ్ళల్లో తయారుచేశారేమో, చిచ్చుబుడ్లూ,మతాబులూ, నిల్చి మరీ కాలేవి.
అసలు తయారుచేయడానికి ఉపయోగించే, గంధకం (sulphur) వాసన ఎంత ఘాటుగా ఉండేదండీ? మనింట్లో కూడా దీపావళి చేసికున్నామూ అని, కార్తిక పౌర్ణమి దాకా తెలిసేది! ఈ రోజుల్లోనా అస్సలు వాసనే లేదూ. ఉన్నదల్లా స్మోక్ మాత్రమే. I certainly missed that nostalgic pungent odour of sulphur ! ఎంతంతో డబ్బెట్టి కొన్నవైనా.. సరిగ్గా కాలేయా అంటే అదీ లేదూ, మధ్యలో తుస్సుమనడం. మళ్ళీ వెలిగించడం.
అన్నిటిలోకీ ముఖ్యంగా అనిపించిందేమిటంటే, ఇదివరకటి రోజుల్లో, ఇంటి చుట్టూరా ఓ పెద్ద కాంపౌండు వాలూ, దాని పొడుగునా దీపాలూ, బాణాసంచా కాల్చుకోడానికి అరుగులూ, వాటిమీద నుంచుని కాల్చడాలూ. మరి ఇప్పుడో… ఇంట్లో దీపం పెట్టడానికి, ఉన్న ఎపార్ట్మెంటుకున్న నాలుగు కిటికీలు మాత్రమే. గుమ్మంలో పెట్టడమనే కాన్సెప్టే లేదు. కారణం మనకీ, పక్కనుండే ఫ్లాట్టు వాడికీ మధ్యలో ఖాళీ ఉంటేనా? పోనీ ఏ బాల్కనీలోకో వెళ్ళి కాల్పిద్దామా అంటే, రవ్వలు కిందవాడి బాల్కనీ లో పడ్డాయని వాడు దెబ్బలాటకొస్తే, అదో గొడవా. ఇంక మిగిలిందేమిటయ్యా అంటే ప్రతీ సొసైటీలోని సెల్లార్లు ! మళ్ళీ అక్కడ కూడా గొడవే. మన బాణాసంచా జాగ్రత్తగా ఓచోట పెట్టామనుకుంటాము, కానీ ఎవడో వేసిన క్రాకర్ వాటిమీద పడితే ఇంక అంతే సంగతులు , అర నిముషంలో ఊ..ఫ్… చివరకి పిల్లలు టెర్రేస్ మీదకెళ్ళి కాల్చుకొస్తూంటారు.
కొద్దిగా చదువూ సంధ్యా వచ్చిన తరువాత, పత్రికలు కొనడం. దీపావళి వస్తోందంటే చాలు ప్రతీ పత్రికా యువ, జ్యోతి, ఆంధ్రజ్యోతి, ప్రభ పేద్ద పేద్ద దీపావళి ప్రత్యేక సంచికలు వేసేవారు. వాటిమీద వడ్డాదిపాపయ్యగారూ, బాపూగారూ వేసిన అద్భుత చిత్రాలు,కొన్నిటికి సువాసనలు కూడా వచ్చేవి కునేగా మరికొళుందు అనే సెంటు పూసేవారు! ఇప్పుడా పత్రికలూ లేవూ, ప్రత్యేక సంచికలూ లేవూ.
ఇంకో విషయం ఏమిటంటే, ప్రస్తుత కాలంలో దీపావళి సామాన్లు కొండానికి వెళ్ళాలంటేనే భయం ! ఎక్కడ ఏ తీవ్రవాది బ్లాస్టులు చేస్తాడో, మర్నాడు పేపర్లలో మన పేర్లూ, ఫుటోలూ పేపర్లకెక్కుతాయో ( అదికూడా మన బాడీని ఐడెంటిఫై చేస్తేనే) అని! ఇంత built in insecurity తో, అమ్మయా దీపావళి అయిందయ్యా బాబూ అనుకోవడమే కానీ, మళ్ళీ మళ్ళీ దీపావళి అని పాటలెవరు పాడుకుంటున్నారు ?
ఇన్నిన్ని మధుర జ్ఞాపకాలు మర్చిపోమంటే మర్చిపోగలమా మరి ?
– భమిడిపాటి ఫణిబాబు