సీఎం కేసీఆర్ కు బుద్ధుందా…!

Spread the love

-ఇందిరమ్మ రాజ్యం అంటేనే సంక్షేమం, అభివృద్ధి
-కాంగ్రెస్ కావాలి…. కరెంటు కావాలి
-కేసీఆర్ నే వద్దంటున్న ప్రజలు
-ఉచిత కరెంటు కాంగ్రెస్ పేటెంట్, కెసిఆర్ గొప్పలు చెప్పుకోవడం విడ్డూరం
-కాంగ్రెస్ వి గ్యారెంటీ మాటలు కేసీఆర్ వి గాలి మాటలు
-ముదిగొండ ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్ పై భట్టి విక్రమార్క ఫైర్

“ఇందిరమ్మ రాజ్యం అంటేనే సంక్షేమం, అభివృద్ధి. ఆకలి చావులు ఇందిరమ్మ పాలనలో ఉన్నాయని అనడానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు బుద్ధుందా అని” సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. మంగళవారం ముదిగొండ మండలం గంధసిరి, బాణాపురం తండా, బాణాపురం, పెద్ద మండవ, వల్లభి, మల్లారం గ్రామాల్లో సిఎల్పీ నేత భట్టి విక్రమార్క ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

బాణాపురం గ్రామంలో నిర్వహించిన ప్రచార కార్యక్రమానికి కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు (సీఎం కేసీఆర్ అన్న కుమార్తె) కల్వకుంట్ల రమ్యారావ్ హాజరై మద్దతు ప్రకటించారు. ముదిగొండ మండలంలో అడుగడుగున ప్రజలు విక్రమార్క ఎన్నికల ప్రచారానికి బ్రహ్మరథం పట్టి ఆశీర్వదించారు. తెలుగుదేశం, సిపిఐ, వైఎస్ఆర్టిపి కార్యకర్తలు పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొని విక్రమార్కకు జై కొట్టారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో జరిగిన కార్నర్ మీటింగ్ లో భట్టి విక్రమార్క ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.

ఇందిరమ్మ రాజ్యం అంటేనే అందరికీ పని ఇచ్చి తిండి పెట్టిన రాజ్యమన్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే పేదలకు ఇండ్లు కట్టించిందని, పేదలందరికీ చదువు చెప్పించిందని, బాంచన్ దొర అన్న సంస్కృతికి బొందపెట్టి, వెట్టిచాకిరి నుంచి విముక్తి కల్పించి ప్రజలు తలెత్తుకొని ఆత్మగౌరవంతో జీవించేలా హక్కులు ఇచ్చిన రాజ్యమన్నారు. ఇందిరమ్మ రాజ్యంలోనే పేదలకు రేషన్ కార్డులు అందాయని, భూసంస్కరణలు తీసుకువచ్చి పేదలకు భూముల పంపిణీ జరిగిందన్నారు. వందరోజుల ఉపాధి అందరికీ మెరుగైన వైద్యం, గరీబి హఠావు నినాదంతో దేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా నీడ అందించిన ఘనత ఇందిరమ్మ రాజ్యందని అన్నారు.

ఇందిరమ్మ సంక్షేమ రాజ్యం గురించి తెలుసుకోకుండా పిచ్చివాడిలా కేసీఆర్ మాట్లాడాడని దుయ్యబట్టారు. కాంగ్రెస్ అంటనే కరెంటు, ఉచిత కరెంటు కాంగ్రెస్ పార్టీకి పేటెంట్ అని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కారు చీకట్లే అంటున్న ఈ ముఖ్యమంత్రికి సోయి ఉన్నదా.‌.? నాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కట్టిన విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణంతో ఉత్పత్తి అవుతున్న కరెంటును తాను ఇస్తున్నట్టు గొప్పలు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.

పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో కొత్తగా ఎన్ని ప్రాజెక్టులు నిర్మించారు ఎంత కరెంటును ఉత్పత్తి చేశారు అని సీఎం కేసీఆర్ ను నిలదీశారు. “కాంగ్రెస్ ఉంటేనే కరెంటు వచ్చిందని, కాంగ్రెస్ కావాలి. కరెంటు కావాలి. కేసీఆర్ నే ఇప్పుడు ప్రజలు వద్దని అంటున్నారని” తెలిపారు.
కోరి తెచ్చుకున్న తెలంగాణ ధనిక రాష్ట్రాన్ని టిఆర్ఎస్ ప్రభుత్వం అప్పులపాలు చేసిందని దుయ్యబట్టారు. నీళ్లు నిధులు నియామకాల కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఏ ఒక్కటి ప్రజలకు దక్కలేదన్నారు.

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టుల నిర్మాణం పేరిట ప్రజల సంపదను కొల్లగొట్టిన బిఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలుగా కృష్ణా, గోదావరి నదుల నుంచి చుక్క నీరు అదనంగా పొలాలకు పారించలేదని విమర్శించారు. “బిఆర్ఎస్ పాలనలో పది సంవత్సరాలుగా నీళ్లు రాలేదు. నిధులను పాలకులు దోపిడీ చేశారు. నియామకాలు కేసీఆర్ ఇంటికే పరిమితమైనవని” పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్న ప్రజలకు మాత్రం ఏమి దక్కలేదన్నారు.

గ్రూప్-1, గ్రూప్-2 ఉద్యోగాలు ఇవ్వాల్సి వస్తుందనీ, కావాలనే పేపర్ లీక్ లు నిరుద్యోగుల జీవితాలతో టీఆర్ఎస్ ప్రభుత్వం చెలగాటం ఆడిందని ధ్వజమెత్తారు. నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం దక్కకుండా అడ్డుగా ఉన్న బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో ముంచుదాం, దంచుదాం, దించుదాం, ప్రజల సంపద ప్రజలకు పంచుదామన్నారు.

కాంగ్రెస్ వి గ్యారెంటీ మాటలు కేసీఆర్ వి గాలి మాటలు
కాంగ్రెస్ పార్టీ చెప్పేటివి గ్యారెంటీ మాటలు అయితే కేసిఆర్ చెప్పేటివి అన్ని గాలి మాటలేనని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను అధికారంలోకి వచ్చిన 100 రోజులని పూర్తిగా అమలు చేస్తామని వెల్లడించారు. ప్రజల సంపద ప్రజలకు పెంచాలని కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను తీసుకొచ్చిందని వివరించారు. సమాజంలో సగభాగమైన మహిళలకు మహాలక్ష్మి పథకం క్రింద. ప్రతి మహిళకు 2500 రూపాయలు ప్రతి నెల అకౌంట్ లో వేస్తామన్నారు.

మహిళలకు గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకు ఇస్తామని, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని చెప్పారు. రాష్ట్రంలో ఒక్క కుటుంబం కూడా ఇల్లు లేదనే బాధ ఉండకుండా చేయడమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమన్నారు. పేదలు ఇండ్లు లేవని బాధపడడం ఈ రాష్ట్రానికి, సమాజానికి మంచిది కాదన్నారు. అధికారంలోకి రాగానే కాంగ్రెస్ ఇంటి స్థలాలు ఇచ్చి, ఇండ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం అందిస్తుందన్నారు. అనారోగ్యంతో రాష్ట్రంలో ఎవరు బాధపడోద్ధని ఆరోగ్య శ్రీ పథకాన్ని 10లక్షల రూపాయలకు పెంచుతామన్నారు.

Leave a Reply