-హైడ్రా కూలుస్తున్న ఇళ్లన్నీ హిందువులవే
– కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్
తిరుమల డిక్లరేషన్‌పై మాట్లాడుతున్న ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు మక్కా, వాటికన్ నిబంధనలపై మాట్లాడే దమ్ముందా? అని కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ నిలదీశారు . ఎవరి మత సాంప్రదాయానికి సంబంధించి వారికి ప్రత్యేక నిబంధనలు ఉంటాయన్నారు. హిందువులపై, తిరుమల డిక్లరేషన్‌పై మాట్లాడిన జగన్ మరింత అపవాదును మూటగట్టుకున్నారని విమర్శించారు.
వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో దళితులకు గుడి ప్రవేశం ఇవ్వలేదని, అదే ఇప్పుడు జగన్ ఫాలో అవుతున్నారని విమర్శించారు. మదర్సాలపై మాట్లాడే అర్హత ఒవైసీకి లేదన్నారు. పాత బస్తీకి ఇప్పటి వరకు కొత్త బస్తీగా ఎందుకు మారలేదని ప్రశ్నించారు. గతంలో కేసీఆర్ తనను బచ్చాగాడు అన్నాడని, ఈ బచ్చాగాడి దమ్మేమిటో చూశారన్నారు.
కూలుస్తున్న ఇళ్లన్నీ హిందువులవే
హైడ్రా కూల్చుతున్న ఇళ్లన్నీ హిందువులవేనని కేంద్ర సహాయ మంత్రి, బీజేపీ సీనియర్ నేత బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. హైడ్రా పేరుతో కాంగ్రెస్ కొరివితో తలగోక్కుంటుందని విమర్శించారు. హైడ్రాకు బీజేపీ వ్యతిరేకం కాదని, కానీ ఈ కారణంగా పేదలు రోడ్డున పడవద్దని సూచించారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో కూల్చివేతల కారణంగా పేదలకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా డౌన్ అవుతుందన్నారు. బీఆర్ఎస్‌కు పట్టిన గతే కాంగ్రెస్ పార్టీకి పట్టడం ఖాయమన్నారు. తెలంగాణ మరో శ్రీలంక కాబోతుందని హెచ్చరించారు. గ్రామ పంచాయతీ నిధులే అంశంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎన్నికలకు సిద్ధమా? అని సవాల్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ మంచి విజయం సాధిస్తుందన్నారు.