Suryaa.co.in

Telangana

పెట్రోలు, డీజిల్‌ ధరలపై మాట్లాడే అర్హత టీఆర్‌ఎస్‌ కు ఉందా?

– తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు, ఎం.పి, బండి సంజయ్‌కుమార్‌

పెట్రోల్‌, డీజిల్‌, ఇతర పెట్రో ఉత్పత్తుల ధరల పెరుగుదలకు నిత్యం కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని నిందించడం, అందులో తమ పాత్ర ఏమీ లేదన్నట్లు వ్యవహరిస్తుండటం తెలంగాణ మంత్రులకు, అధికార పక్షం నేతలకు, ఇతర ప్రతిపక్షాలకు సహితం పరిపాటయింది. పెట్రోల్‌ ధరల గురించిన అవగాహన లేకుండా అయినా మాట్లాడుతూ ఉండాలి లేదా ఉద్దేశపూర్వకంగా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తుండాలి.

ఎంతో రాజకీయ అనుభవం ఉందనుకొనే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు గాని, దేశ, విదేశాలలో తిరిగిన కేటీఆర్‌కు గాని అటువంటి పరిజ్ఞానం లేదని చెప్పలేము. కేంద్ర ప్రభుత్వంపై బురద చల్లడం ద్వారా వైఫల్యాల నుండి, తమ పాలన పట్ల ప్రజలలో నెలకొన్న అసంతృప్తి నుండి వారి దృష్టి మళ్లించే ప్రయత్నంగానే భావించాలి.

దేశంలో పెట్రోల్‌ అమ్మకం ధరలు అత్యధికంగా ఉన్న రాష్ట్రాలలో తెలంగాణ ఒకటి కావడం గమనార్హం. బీజేపీ, బిజెపి భాగస్వామిగా ఎన్డీయే పక్షాలు పాలిస్తున్న మరే రాష్ట్రంలో అంత ఎక్కువగా లేవని గమనించాలి. పెట్రోల్‌ ధరల నుండి ప్రజలకు ఉపశమనం కల్పించడం కోసం కేంద్రం రెండు సార్లు ఎక్సైజ్‌ సుంకాలను తగ్గించింది. పలు రాష్ట్ర ప్రభుత్వాలు తాము విధించే పన్నులను తగ్గించాయి.

అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల లీటర్‌ పెట్రోలుపై రూ.5లు, డీజిల్‌ పై రూ.10లు మేరకు ఎక్సైజ్‌ తగ్గించింది. కేంద్ర నిర్ణయాన్ని స్వాగతిస్తూ 18 రాష్ట్రాలు వ్యాట్‌ ను తగ్గించాయి. ఫలితంగా ఆయా రాష్ట్రాల్లో ఒక్కో లీటర్‌ పెట్రోలు, డీజిల్‌ పై రూ.10 నుండి రూ. 20 దాకా తగ్గి సామాన్యులకు కొంతలో కొంత ఊరట కలిగింది. కానీ ఒక్క నయాపైసా కూడా తగ్గించని రాష్ట్రాలలో తెలంగాణ ఒకటి కావడం గమనార్హం.

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగే ప్రతి పైసాలో రాష్ట్ర ప్రభుత్వంకు వచ్చే పన్నుల వాటా కూడా పెరుగుతుందని గమనించాలి. అంటే పన్నులు పెంచకపోయినా, వారి ఆదాయం పెరుగుతున్న ధరలతో పాటు పెరుగుతూ ఉంటుంది. ప్రజల పట్ల ఏ మాత్రం సానుభూతి ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం తమకు వచ్చే అదనపు ఆదాయాన్ని కొంచెం తగ్గించుకోవడం ద్వారా ప్రజలకు ఉపశమనం కలిగించవచ్చు.

పెట్రోలు, డీజిల్‌ పై రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్‌ రూపంలో పన్నులు వసూలు చేస్తోంది. కేసీఆర్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 4 శాతం మేరకు వ్యాట్‌ ను పెంచారు.దీంతో పెట్రోలు, డీజిల్‌ ధర పెరిగినప్పుడల్లా రాష్ట్రానికి వచ్చే వ్యాట్‌ ఆదాయం అంతకంతకూ పెరుగుతుంది.రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్‌ పన్నును మినహాయించుకుంటే లీటర్‌ పెట్రోలు ధర 85 రూపాయలకే ప్రజలకు అందించే అవకాశం ఉంది.కేసీఆర్‌ ప్రభుత్వం ప్రస్తుతం మద్యం, పెట్రోలు, డీజిల్‌ పై వచ్చే ఆదాయంతోనే మనుగడ సాధిస్తోందంటే అతిశయోక్తి కాదు.

2003లో అటల్‌ బిహారీ వాజ్‌ పేయి హయాంలో లీటర్‌ పెట్రోలు ధర 35 రూపాయలు. కాంగ్రెస్‌ పదేళ్ల పాలనలో పెట్రోలు ధర రూ.40 లు పెరిగింది. 2014లో మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం దిగిపోయే నాటికి పెట్రోలు ధర రూ.75లు. పెట్రో ఉత్పత్తులను ప్రాసెసింగ్‌ చేశాక మిగిలిన కెమికల్స్‌కు పదేళ్ల క్రితం వరకు అంతర్జాతీయంగా విపరీతమైన డిమాండ్‌ ఉండేది. తారు, ప్లాస్టిక్‌ పదార్ధాలకు విరివిరిగా ఉపయోగించేవారు. అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధర పెరిగినా వీటి ద్వారా వచ్చే ఆదాయంతో లోటును పూడ్చుకునే వారు. దీనివల్ల పర్యావరణం దెబ్బతింటున్న నేపథ్యంలో ప్లాస్టిక్‌ వాడకాన్ని తగ్గించాలని అంతర్జాతీయంగా తీసుకున్న నిర్ణయంతో ఆయా కెమికల్స్‌కు ప్రస్తుతం పెద్దగా డిమాండ్‌ లేదు. వీటి ద్వారా పెద్దగా ఆదాయం లేకపోవడంతో క్రూడాయిల్‌ ధరలు పెరిగినప్పుడల్లా పెట్రోలు, డీజిల్‌ ధరలను పెరుగుతున్నాయి.

దేశం మొత్తం మీద తెలంగాణ కన్నా పెట్రోల్‌ ధర ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు మూడే. అవి మహారాష్ట్ర, ఆంధ్ర ప్రదేశ్‌, రాజస్థాన్‌ కావడం గమనార్హం. ఉదాహరణకు ఏప్రిల్‌ 20న తెలంగాణాలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.118.59గా ఉండగా, మహారాష్ట్రలో రూ. 123.47, ఆంధ్ర ప్రదేశ్‌ లో రూ.121.63, రాజస్థాన్‌ లో
రూ.121.06, కేరళ లో రూ.116.92, పశ్చిమ బెంగాల్‌ లో రూ.115.12, పంజాబ్‌ లో రూ.105.46, ఢల్లీి లో రూ. 105.41, ఒడిశాలో రూ.112.05, చత్తీస్‌ఘర్‌ లో రూ.111.45 గా ధరలు ఉన్నాయి. ఇవేవి బిజెపి, లేదా దాని మిత్రపక్షాల పాలిత రాష్ట్రాలు కాకపోవడం గమనార్హం.

ఇక, బీజేపీ లేదా ఎన్డీయే అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ధరల సంగతి చూద్దాం: మేఘాలయ
రూ.103.55, అరుణాచల్‌ ప్రదేశ్‌ రూ.104.13, ఉత్తరాఖండ్‌ రూ.104.76, గుజరాత్‌ రూ.105-08,
ఉత్తర్‌ ప్రదేశ్‌ రూ.105.21, హర్యానా రూ.105.5, హిమాచల్‌ ప్రదేశ్‌ రూ.105.83, అస్సాం రూ. 106.39, గోవా రూ.106.85, నాగాలాండ్‌ రూ. 108.02, త్రిపుర రూ.108.29, మిజోరాం రూ.110.18, మణిపూర్‌ రూ.110.21, పుదుచ్చేరి రూ.110.95, కర్ణాటక రూ.111.09, బీహార్‌ రూ.116.58, మధ్య ప్రదేశ్‌
రూ.118.25. కేంద్ర పాలిత ప్రాంతాలైన లడఖ్‌ రూ.111.16, జమ్మూ కాశ్మీర్‌ రూ.106.52. బిజెపి పాలిత రాష్ట్రాలతో పోల్చుకొంటే చాలా రాష్ట్రాలలో తెలంగాణలోకన్నా రూ 10 నుండి రూ 12 వరకు తక్కువగా ఉన్నట్లు స్పష్టమవుతుంది. ఎందుకు తెలంగాణాలో ధరలు అంత ఎక్కువగా ఉన్నాయి? రాష్ట్ర మంత్రులు ఎవ్వరైనా సమాధానం చెప్పగలరా? పెట్రోల్‌ ధరలు ఎక్కువగా ఉన్నాయని అంటూ ధర్నాలు, ఆందోళనలతో ప్రజల ముందు నాటకాలు ఆడుతున్న టీఆర్‌ఎస్‌ నేతలు వ్యాట్‌ పేరుతో కేసీఆర్‌ ప్రభుత్వం లీటర్‌ కు రూ 35 మేరకు వసూలు చేస్తున్న పన్నులలో ఏమాత్రం తగ్గించినా ప్రజలకు కొంత ఉపశమనం కలిగించవచ్చని ఒప్పుకుంటారా?

పెట్రోల్‌ ధరలు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండవు. మన దేశీయ అవసరాలలో 85 శాతం వరకు దిగుమతి చేసుకోవలసి రావడంతో, అంతర్జాతీయ మార్కెట్‌ ధరలపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఇటీవల కాలంలో వాటి ధరలు అసాధారణంగా పెరుగుతూ వస్తున్నాయి. పెట్రో ధరలు పలు దేశాల మధ్య ఆధిపత్య పోరుకు కూడా దారితీస్తున్నాయి. అందుచేత ఈ ధరల నియంత్రణలో కేంద్ర ప్రభుత్వం చేయగలిగింది నామమాత్రమే అని గమనించాలి.

మొత్తం ధరలలో 40 శాతం వరకు `ప్రాధమిక ధర’ అంటే పెట్రోల్‌ ఉత్పత్తి చేసే కంపెనీలకు చెల్లించవలసి ఉంటుంది. ఈ మొత్తంలో కేంద్రం తగ్గించగలిగింది ఏమీ లేదు. మిగిలిన 60 శాతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్నులు. అందులో దాదాపు చెరిసగం పన్నులు విధిస్తున్నాయి. పన్నుల విధింపులో రాష్ట్రాల మధ్య తీవ్ర అంతరం ఉన్నదన్నది వేరే విషయం. దేశంలో అత్యధికంగా పన్నులు విధించే రాష్ట్రాలలో తెలంగాణ ఒకటి కావడం గమనార్హం.

ఇక కేంద్రం విధించే పన్నులలో (30 శాతం మేరకు) తిరిగి అందులో 42 శాతం మేరకు ఆర్ధిక సంఘం సిఫార్సుల మేరకు పనులలో రాష్ట్రాల వాటాగా తిరిగి కేంద్రం రాష్ట్రాలకు చెల్లిస్తుంది. అంటే మొత్తం ధరలు కేంద్రంకు సుమారు 17 శాతం మాత్రమే వస్తుండగా, రాష్ట్రాలకు 43 నుండి 49 శాతం వరకు వస్తున్నది. మొత్తం పెట్రోల్‌ పనులలో సింహభాగం రాష్ట్రాల ఖజానాకు వెళుతున్నది. ఈ వాస్తవం తెలంగాణ ఆర్ధిక మంత్రి హరీష్‌ రావుకు తెలియదా?

తెలిసి కూడా, పెట్రోలు, డీజిల్‌ ధరల పెంపుపై టీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు నిరసనలు చేయడం విస్మయం కలిగిస్తోంది. ధాన్యం కొనుగోలు విషయంలో తన బాధ్యతను విస్మరించి పంజాబ్‌ తరహా విధానాన్ని అమలు చేయాలంటూ వితండవాదం చేస్తున్న కేసీఆర్‌ ప్రభుత్వం పెట్రోలు, డీజిల్‌ విషయంలో పంజాబ్‌ రాష్ట్రాన్ని ఎందుకు అనుసరించడం లేదో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రజలకు సమాధానం చెప్పగలరా? పంజాబ్‌ లో తెలంగాణకన్నా పెట్రోల్‌ లీటర్‌ కు రూ 13 మేరకు తక్కువగా విక్రయిస్తున్నారు.

రష్యా-ఉక్రెయిన్‌ యుద్దం నేపథ్యంలో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడంతో అనివార్యంగా పెట్రో ఉత్పత్తుల ధరలు పెరుగుతున్నాయనే విషయం దేశ ప్రజలందరికీ తెలుసు. ఈ క్లిష్ట సమయంలో వాస్తవాలను వివరించాల్సిన టీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు రాజకీయ లబ్ది కోసం ధర్నాలు, ఆందోళనలు చేస్తూ డ్రామాలు చేయడం దారుణం.

వాస్తవానికి రష్యా-ఉక్రెయిన్‌ యుద్దం నేపథ్యంలో దేశవ్యాప్తంగా పెట్రోలు, డీజిల్‌ ధరలు పెరిగినప్పటికీ… రాష్ట్రంలో పెట్రోలు, డీజిల్‌ ధరలు ఎక్కువగా ఉండటానికి ప్రధాన కారణం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే అనే వాస్తవాన్ని ప్రజలు గ్రహించకుండా మభ్యపరచే ప్రయత్నాలు చేస్తున్నారు.

పెట్రోల్‌ ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకు వస్తే వాటి ధరలు గణనీయంగా తగ్గుతాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నది. సుప్రీం కోర్ట్‌ కూడా ఈ విషయం పరిశీలించాలని సూచించింది. జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో కేంద్రం ఈ ప్రతిపాదనను తీసుకొస్తే తీవ్రంగా వ్యతిరేకించిన రాష్ట్ర ప్రభుత్వాలలో తెలంగాణ ఒకటనేది గమనార్హం.

తాము ఏం చేసినా ప్రజలు నమ్ముతారనే అహంకారంతో టీఆర్‌ఎస్‌ నేతలు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. విజ్ఞులైన తెలంగాణ ప్రజలు వాస్తవాలను అర్ధం చేసుకోవాలని బీజేపీ తెలంగాణ శాఖ పక్షాన కోరుతున్నా. ధర్నాలు, ఆందోళనలతో తప్పుదోవ పట్టించేందుకు యత్నిస్తున్న టీఆర్‌ఎస్‌ నేతలకు తగిన బుద్ది చెప్పాలని విజప్తి చేస్తున్నా.

LEAVE A RESPONSE