– జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణరెడ్డి
గుంటూరు: అవయవ దాతలకు సత్కారాలు చేసేందుకు ప్రభుత్వం ముందుకు రావడం ఎంతో అభినందనీయమని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అన్నారు.
బ్రెయిన్ డెత్ సంభవించిన అవయవ దాతలు కిడ్నీ, లివర్, ఊపిరితిత్తులు, గుండె లాంటి అవయవాల మార్పిడితో వేలాది మందికి పునర్జన్మను ఇస్తున్నారన్నారు. దాతలను, వారి కుటుంబ సభ్యులను ఘనంగా సత్కరించాలని, అవయవదాతల అంతిమ సంస్కారాన్ని అధికార లాంఛనాలతో నిర్వహించాలని, అవయవ దాతల కుటుంబ సభ్యులకు పదివేల రూపాయలు అందించాలని నిర్ణయించడం స్వాగతిస్తున్నట్టు తెలిపారు.
అవయవ దాత అంతిమ సంస్కారానికి ఆర్డీవో స్థాయిపై అధికారి హాజరు అవ్వాలని, ఆసుపత్రి నుండి శ్మశానం వరకు ఉచిత వాహనాన్ని ఏర్పాటు చేయాలని, కుటుంబ సభ్యులకు యోగ్యత పత్రం, మెమెంటోను అందించాలని ప్రభుత్వ ఉత్తర్వులో పేర్కొనడం హర్షనీయమన్నారు. జిల్లా కలెక్టర్ అవయవదాత ఫోటోతో వారు అందించిన అవయవాల వివరాలను పేర్కొంటూ పత్రికా ప్రకటన చేయాలని, అవయవదాతలకు స్ఫూర్తిని అందించే సందేశాన్ని ప్రచురింప చేయాలని పేర్కొనడం అభినందనీయమన్నారు.
ప్రపంచంలో స్వీడన్, అమెరికా, జపాన్ లాంటి దేశాలలో అవయవ దానాలు అత్యధికంగా జరుగుతుంటే భారతదేశంలో ప్రతి 10 లక్షల మందిలో ఒక్కరే శరీర దానాన్ని చేస్తున్నారని వివరించారు. ప్రభుత్వం ప్రకటించిన సత్కారాలు, గౌరవాలతో మరింత మంది అవయవ-శరీర దానాలకు ముందుకు వస్తారని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.