Suryaa.co.in

Telangana

అధికారుల‌పై దాడిని ఉపేక్షించొద్దు

– నిందితులు ఎంత వారైనా క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాలి
– ఘ‌ట‌న వెనుక కుట్ర‌దారుల‌ను శిక్షించాలి
– పున‌రావృతం కాకుండా చ‌ర్య‌లు తీసుకోవాలి
– తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మ‌న్ ల‌చ్చిరెడ్డి డిమాండ్‌
– ల‌గచ‌ర్ల ఘ‌ట‌న‌కు నిర‌స‌న‌గా హైద‌రాబాద్ క‌లెక్ట‌రేట్ ముందు ధ‌ర్నా

హైద‌రాబాద్: వికారాబాద్ జిల్లా, దుద్యాల మండలం, ల‌గచ‌ర్ల‌లో అధికారుల‌పై జ‌రిగిన దాడి ఘ‌ట‌న‌లో నిందితుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని తెలంగాణ ఉద్యోగుల ఐకాస చైర్మ‌న్ వి.ల‌చ్చిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ ఘ‌ట‌న వెనుక ఎవ‌రున్నా, ఎంత‌వారైనా ఉపేక్షించొద్ద‌ని కోరారు.

ల‌గచ‌ర్ల ఘ‌ట‌న‌కు నిర‌స‌న‌గా తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు గురువారం రాష్ట్ర‌ వ్యాప్తంగా అన్ని క‌లెక్ట‌రేట్ల ముందు ధ‌ర్నాలు చేపట్టారు.

ఇందులో భాగంగా గురువారం హైద‌రాబాద్ క‌లెక్ట‌రేట్ ముందు ఉద్యోగులు ధ‌ర్నా నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి ఉద్యోగుల ఐకాస చైర్మ‌న్ వి.ల‌చ్చిరెడ్డి హాజ‌ర‌య్యారు.

దాడి వెనుక దాగి ఉన్న కుట్రను బహిర్గతం చేయాలి:లచ్చిరెడ్డి
ధ‌ర్నాను ఉద్దేశించి వి.ల‌చ్చిరెడ్డి మాట్లాడుతూ.. ఉద్యోగుల‌పై దాడికి పాల్ప‌డి, రాష్ట్ర‌వ్యాప్తంగా ఉద్యోగుల మాన‌సిక స్థైర్యాన్ని దెబ్బ‌తీసేందుకు కుట్ర‌ప‌న్నిన నిందితుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు.

ఈ ఘ‌ట‌న‌పై స‌మ‌గ్ర విచార‌ణ జ‌రిపించాల‌ని ప్ర‌భుత్వాన్ని కోరారు. ఇలాంటి ఘ‌ట‌న‌లు రాష్ట్రంలో మ‌రోసారి పున‌రావృతం కాకుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని పేర్కొన్నారు. ప్రజల కోసం పని చేసే ప్రభుత్వ అధికారులను లక్ష్యంగా చేసుకొని దాడి చేయడంలో కుట్ర కోణం దాగి ఉంటుందని ఆరోపించారు. ఇప్పటికే పోలీసుల విచారణలో వెలుగులోకి వస్తున్న విషయాలు ఉద్యోగ లోకాన్ని భయబ్రాంతులకు గురి చేసిందన్నారు.

రాజకీయాలకు అతీతంగా సేవలు అందించే అధికారులపై దాడులు, హత్యాయత్నం వంటి ఘటనలకు పూనుకోవడం వెనుక బలమైన కుట్ర దాగి ఉందనే అనుమానాలకు బలం చేకూరుతుందన్నారు. తీవ్రంగా గాయపడిన ఏ అధికారిని ఎవరు పరామర్శించలేదన్నారు. చివరకు కొందరు అధికారులపై జరిగిన దాడిని సైతం పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ల‌గచ‌ర్ల ఘ‌ట‌న‌లో దాడికి గురైన ఉద్యోగుల‌పై కాకుండా, దాడికి పాల్ప‌డిన వారిని ప‌రామ‌ర్శించ‌డాన్ని ఆయ‌న త‌ప్పుబ‌ట్టారు. ఇది స‌రైన ప‌ద్ధ‌తి కాద‌ని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. అనంత‌రం హైద‌రాబాద్ క‌లెక్ట‌ర్‌కు విన‌తిప‌త్రాన్ని స‌మ‌ర్పించారు.

కార్య‌క్ర‌మంలో ఉద్యోగుల జేఏసీ నాయ‌కులు కె.రామ‌కృష్ణ‌ , జనరల్ సెక్రటరీ డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్, ఎస్‌.రాములు , అధ్యక్షులు తెలంగాణ తహసీల్దార్స్ అసోసియేషన్ , డా.జి.నిర్మ‌ల‌, అధ్యక్షులు తెలంగాణ ఉద్యోగుల అసోసియేషన్, ద‌ర్శ‌న్‌గౌడ్ , అధ్యక్షులు తెలంగాణ సీపీయస్ యూనియన్ , డా. కత్తి జనార్దన్, దేవికా , శ్రీరాం, హరికిషన్ , ఉదర గోపాల్ , విజయారావు, సుగంధిని, హేమలత, రాబర్ట్ బ్రూస్, రోహిత్ నాయక్, మల్లేష్, త‌దిత‌రులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE