Suryaa.co.in

Features

శ, ష, స అనే అక్షరాలు ఎలా పలకాలో తెలియదా?

శ, ష, స అనే అక్షరాలు ఎలా పలకాలో తెలియని కొందరు దీనిని గమనిస్తారని ఆశ.

యద్యపి బహునాధీషే తథాపి పఠ పుత్ర వ్యాకరణమ్ |
స్వజనః శ్వజనో మా భూత్ సకలం శకలం సకృత్ శకృత్ ||*

భావం: నాయనా! నీవు ఎక్కువ చదవకపోయినా పర్వాలేదు, వ్యాకరణం మాత్రం నేర్చుకో. ఎందుకంటే స్వజన అనగా (మన వాళ్ళు)
అన్న శబ్దాన్ని శ్వజన అంటే (కుక్కలు) అనకుండా,
సకలం అనగా (సర్వం) అన్న శబ్దాన్ని శకలం అంటే (ముక్కలు) అని పలకకుండా,
సకృత్ అనగా (ఒకసారి) అన్న శబ్దాన్ని శకృత్ అంటే (మలము) అని పలకకుండా ఉండడానికే కాక తదితర పదాలను కూడా సక్రమముగా పలకడానికి ఉపయోగపడుతుంది — అని ఒక తండ్రి తన కుమారునికి చెబుతున్నాడు.

నాగరిక ప్రపంచం –
కళ్ళని -కల్లు
శిరీష-షిరీష
వేళ-వేల
కళ-కల
పళ్ళు-పల్లు
కాళ్ళు-కాల్లు
ఇంకా ఎన్నెన్నో…..అపస్వర శబ్దాలు…..వినలేని అపస్వరాలు..ముఖ్యంగా టీవీల వల్ల..
వ్యాకరణం తెలియనివారు ఏ అక్షరం ఎలా ఉచ్ఛచరించాలో తెలుసుకోలేరు. ఉచ్ఛారణ సరిగా లేకపోతే వారు తలంచిన అర్థం రాకపోగా విరుద్ధార్థం వస్తుంది – అని భావం.

అందుకనే, వ్యాకరణ సిద్ధి ఉంటేనే,వాక్‌ శుద్ధి వస్తుంది .మన నాలుక శుభ్ర పడుతుంది. వాగ్దేవి కరుణా ప్రవాహం అపారంగా లభ్యమవుతుంది.

అందుకేనేమో పవన సుతుడు శ్రీ హనుమ ,
శ్రీ సూర్య నారాయణుని సన్నిధి లో సకల విద్యలు
నేర్చుకొని ,నవ వ్యాకరణ విద్యను అభ్యాసానికి
వివాహముచేసుకొని (వివాహితుడే అర్హుడు కనుక) నవ వ్యాకరణ పండితుడై ,భవిష్యత్‌
బ్రహ్మ గా ప్రకటించ బడ్డాడు.

మాతృభాషలో మాధుర్యాన్ని నింపండి. తెలుగు వారికి పురాణ గ్రంధమైన పెద్ద బాల శిక్ష దొరకటం మహా పుణ్య ఫలం.. ఆ మహాగ్రంధం చదివిన పెద్దలు,పిల్లలూ మహా జ్ఞానులవుతారు.. అందులో వ్యాకరణ సంపద అపారంగా లభిస్తుంది.. తప్పక చదవండి

– సుందర్‌రాజ్

LEAVE A RESPONSE