– వారి పని వారిని చేసుకోనీయద్దు
– తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదం
– విశాఖ డిప్యూటీ మేయర్ ఎన్నిక తీరుపై బాబు అసంతృప్తి
– ఇన్చార్జి మంత్రి స్వామికి బాబు క్లాసు
– బియ్యం బదులు నగదు ఇస్తే ఎలా ఉంటుంది?
– కేంద్ర ప్రభుత్వంతో కలిపి అన్నదాత సుఖీభవ
– జూన్ నెలలో తల్లికి వందనం
– బ్లాక్ బర్లీ పొగాకుధరల నిర్ణాయక కమిటీలో కొత్తగా మంత్రులు గొట్టిపాటి రవి, నిమ్మల రామానాయుడు
– ఎంతమంది మంత్రులు పేదల ఇళ్లకు వెళ్లి కాఫీ అడుగుతున్నారు?
– ఎవరూ వెళ్లడం లేదన్న మంత్రులు
– ఇకపై వెళ్లాలని బాబు ఆదేశం
– క్యాబినెట్‌లో చర్చ
అమరావతి: రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న లిక్కర్ మాఫియా కేసు విచారణపై మంత్రులెవరూ స్పందించవద్దని సీఎం చంద్రబాబునాయుడు ఆదేశించారు. కేసులపై ఏసీబీ, సిట్ ఎవరి పని వాళ్లు చేస్తున్నాయి. వాళ్ల పని వాళ్లకు చేసుకోనీయండి. వాళ్లకు స్వేచ్ఛ ఇద్దాం. పేపర్లలో వచ్చే కథనాలపై ఎవరూ స్పందించి, తప్పుడు సంకేతాలకు కారణం కావద్దు అని బాబు సహచర మంత్రులను ఆదేశించారు. తల్లికి వందనం జూన్ నెలలో ఇవ్వాలని నిర్ణయించారు. స్కూల్ పున:ప్రారంభం అయ్యే రోజుకు ఇచ్చేయాలని స్పష్టం చేశారు.
క్యాబినెట్ భేటీలో పలు అంశాలపై చర్చ జరిగింది. బియ్యం దుర్వినియోగం అవుతున్నందున, దాని బదులు వినియోగదారులకు డబ్బులు ఇస్తే ఎలా ఉంటుందన్న దానిపై చర్చ జరిగినట్లు సమాచారం. ఇక రేషన్ సరకులు ఇచ్చే వాహనాలపైనా కీలక నిర్ణయం తీసుకున్నారు.
రేషన్ సరఫరాకు ఎండీయూ వాహనాలను కేబినెట్ రద్దు చేసింది. వీటిపై తీసుకున్న రుణాలను ప్రభుత్వం చెల్లించి వాహనాల యజమానులకు ఇచ్చేయాలని నిర్ణయించింది. బియ్యం ఇచ్చే రోజు మినహా మిగతా రోజుల్లో వాళ్ళే వాడుకుంటున్నారని, ఇకపై రేషన్ బియ్యం రేషన్ దుకాణాల్లోనే ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. వికలాంగులు, సీనియర్ సిటిజన్స్‌కు ఇంటికి వెళ్ళి బియ్యం ఇవ్వాలని సీఎం ఆదేశించారు. రెవెన్యూ సమస్యలు చాలా పరిష్కారం కావడం లేదన్నారు. ఎన్ని సమస్యలు పరిష్కారం అయ్యాయి అనేది మూడు నెలలకు ఒకసారి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇస్తున్నాం కదా? వాళ్లింటికి వెళ్ళి మహిళను అడిగి కాఫీ పెట్టి ఇవ్వమని ఎంత మంది మంత్రులు అడిగారని సీఎం ప్రశ్నించగా, మంత్రులు ఎవరు వెళ్లలేదని చెప్పారు.
దీంతో జిల్లాల పర్యటనకు వెళ్లినప్పుడు తానే వెళ్తున్నానని, మంత్రులు కూడా తప్పనిసరిగా వెళ్లాలని ఆదేశించారు. ప్రతీ జిల్లాకు ఒక యూనివర్సిటీ ఉండాలని చెప్పారు. ఏలూరులో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, రాజమండ్రిలో తెలుగు యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని చెప్పారు.
అన్నదాత సుఖీభవను కేంద్ర ప్రభుత్వంతో కలిపి వేద్దామన్నారు. కేంద్రం ఎప్పుడు వేస్తే అప్పుడు వేయాలని ఆదేశించారు. ఆర్థిక శాఖ అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తగిన ఆదేశాలు ఇచ్చారు.
పొగాకు రైతుల సమస్యపై బ్లాక్ బర్లీ పొగాకుపై క్యాబినెట్‌లో చర్చ జరిగింది. ధరల నిర్ణాయక కమిటీలో కొత్తగా మంత్రులు గొట్టిపాటి రవి, నిమ్మల రామానాయుడును సీఎం చేర్చారు.
ప్రధానితో లోకేష్ భేటీ బాగా జరిగిందని ఈ సందర్భంగా బీసీ జనార్ధన్ రెడ్డి అన్నారు. శ్రీశైలంకు రద్దీ బాగా పెరిగిందని, ఆదాయంలో రెండవ స్థానంలో ఉందన్నారు. శ్రీశైలం ప్రాంతాన్ని బాగా అభివృద్ధి చేయాలని సీఎం తెలిపారు.
అటవీ శాఖ అధికారులతో కూర్చొని సమస్యను పరిష్కరించుకోవాలన్నారు. టెంపుల్ టూరిజాన్ని కూడా డెవలప్ చేయాలని కేబినెట్ సమావేశంలో చంద్రబాబునాయుడు వెల్లడించారు.
ఈ సందర్భంగా విశాఖ డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా పడటంపై బాబు అసహనం వ్యక్తం చేశారు. తగిన సమయం ఉన్నా ఎందుకు వినియోగించుకోలేదని ఇన్చార్జి మంత్రి స్వామిని ప్రశ్నించారు. ఇకపై అలా జరిగేందుకు వీలులేదని, ముందస్తుగా అందరితో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
వచ్చే కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం సంవత్సర కాలం పూర్తి అవుతున్న సందర్భంగా సాధించిన విజయాలు, ప్రజలు మనోభావాలపై చర్చిద్దామని అన్నారు. పంటలకు ఈ సారి ధరలు తగ్గాయని, సమీక్షించి పర్యవేక్షించాలని ఆదేశించారు.