– రాహుల్‌కు ఇచ్చిన మాట ప్రకారం నా బాధ్యత పూర్తి చేశా
– ఇక జనంలోకి వెళ్లి చెప్పాల్సిన బాధ్యత మీదే
– కులసంఘాలతో మీటింగులు పెట్టండి
– కులగణన ఘనత గురించి చెప్పండి
– ఈ అవకాశాన్ని జారవిడిచుకుంటే చరిత్ర మిమ్మల్ని క్షమించదు.
– కేసీఆర్ సర్వే ప్రకారం బీసీలు 51 శాతం మాత్రమే
– కానీ మన కులగణన ప్రకారం 56.33 శాతం
– ఇక బీసీల లెక్క తగ్గిందో పెరిగిందో మీరే చెప్పండి
– ప్రజాభవన్ లో బీసీ నేతలతో సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్: కులగణన ఎక్స్ రే లాంటిదని రాహుల్ గాంధీ గారు ఆనాడే చెప్పారు. అన్ని రంగాల్లో బీసీలకు సామాజిక న్యాయం జరగాలంటే కులగణన చేయాల్సిందేనని రాహుల్ గాంధీ గారు స్పష్టం చేశారు. తెలంగాణలో అధికారంలోకి రాగానే కులగణన చేసి తీరుతామని రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో మాట ఇచ్చారు. గాంధీ కుటుంబం మాట ఇస్తే తప్పదు. ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో కులగణన నిర్వహించాం.
మన నాయకుడు ఇచ్చిన మాటను తూచా తప్పకుండా అమలు చేస్తున్నాం. దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇలాంటి సాహసం చేయలేదు. కానీ తెలంగాణలో రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం అందరి భాగస్వామ్యంతో కులగణన నిర్వహించాం. సమగ్ర కుటుంబ సర్వే తప్పుల తడకగా ఉందనే.. ఆనాటి ప్రభుత్వం లెక్కలను బయటపెట్టలేదు. అందుకే ఆ వివరాలను ఎన్నికల కోసం వాడుకున్నారు తప్ప..ప్రజల కోసం వినియోగించలేదు. కానీ మేం చిత్తశుద్ధితో కులగణనపై మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశాం.
చట్టపరంగా ఇబ్బందులు కలగకుండా ప్లానింగ్ డిపార్ట్ మెంట్ కు అప్పగించి కులగణను పకడ్బందీగా నిర్వహించాం. ఇంటింటికి ఎన్యుమరేటర్లను పంపి సమాచారాన్ని సేకరించాం. సేకరించిన సమాచారాన్ని తప్పులు దొర్లకుండా ఎన్యూమరేటర్ సమక్షంలో కంప్యూటరీకరించాం. తప్పులు జరిగాయని మాట్లాడుతున్న వారు ఏ బ్లాక్ లో ఎక్కడ తప్పు జరిగిందో చెప్పాలి. ప్రక్రియను తప్పుబట్టడం ద్వారా మొత్తం వ్యవస్థను కుప్పకూల్చేందుకు కుట్రలు చేస్తున్నారు ఇది బీసీ సోదరులు గమనించాలి.
స్వతంత్ర భారత దేశంలో ఎవ్వరూ ఇప్పటివరకు కులగణన చేపట్టలేదు. ఒక్కసారి బీసీల లెక్క తెలిస్తే వాటా అడుగుతారనే దీనిపై కొందరు కుట్ర చేస్తున్నారు. ఎంతోకాలంగా ఉన్న డిమాండ్ ను మనం విజయవంతంగా ముందుకు తీసుకెళుతున్నాం. బీజేపీలో ఉన్న ఒకటి రెండు ఆధిపత్య సామాజిక వర్గాలకు, నష్టం జరుగుతుందనే వాళ్లు కులగణనపై కుట్రలు చేస్తున్నారు. దేశంలో కులగణన చేపట్టడం ఇష్టంలేకనే బీజేపీ కులగణనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
కేసీఆర్ సర్వే ప్రకారం బీసీలు 51 శాతం మాత్రమే… కానీ మన కులగణన ప్రకారం 56.33 శాతం. ఇక బీసీల లెక్క తగ్గిందో పెరిగిందో మీరే చెప్పండి. గుజరాత్ లో ముస్లింలు ఓబీసీ కేటగిరీలో ప్రయోజనం పొందుతున్నారని… తాను ఎప్పుడూ మీడియాలో చెప్పుకోలేదని మోదీ 2023 లో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. కానీ బండి సంజయ్ రేవంత్ రెడ్డి బీసీలలో ముస్లింలను కలిపారని చెబుతున్నాడు. తప్పుడు మాటలు మాట్లాడటం కాదు.. ఏ బ్లాక్ లో ఏ ఇంట్లో తప్పు జరిగిందో నిరూపించాలని కెసిఆర్, బండి సంజయ్, కిషన్ రెడ్డికి సవాల్ విసురుతున్నా.
భవిష్యత్ లో దేశంలో బీసీ రిజర్వేషన్ల గురించి చర్చించాలంటే తెలంగాణ గురించి, రేవంత్ రెడ్డి గురించి చర్చించుకునే పరిస్థితి ఉంటుంది. ఈ అవకాశాన్ని జారవిడిచుకుంటే చరిత్ర మిమ్మల్ని క్షమించదు. నేను రాజకీయ అజ్ఞానంతో మాట్లాడటంలేదు. మా నాయకుడి ఆదేశాలు పాటించే వ్యక్తిగా మాట్లాడుతున్న. నాయకుడి ఆదేశాలను పాటించడమే నా ధర్మం. ఈరోజు మనం చేసిన లెక్క నూటికి నూరు శాతం పక్కా. ఎవరు ఏం చెప్పినా నమ్మొద్దు. మోదీ రాజకీయంగా వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుందనే ఈ ప్రక్రియను తప్పుబడుతున్నారు.
బీసీల లెక్క తేలితే బీజేపీలో అధికారం చెలాయించే ఒకటి రెండు సామాజిక వర్గాలకు ఇబ్బంది అవుతుంది. బీఆర్ఎస్ నేతలు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఇప్పటి వరకు వారి వివరాలు ఎందుకు నమోదు చేసుకోలే దు. 50శాతం ఉన్న ప్రజలు, అర శాతం ఉన్న వాళ్లను ప్రశ్నిస్తారని వాళ్లకు భయపట్టుకుంది. అందుకే బీసీల సర్వేకు వారు సహకరించడం లేదు.
కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఉద్యోగాలు పోతాయనే దీనిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దీన్ని తిప్పి కొట్టాల్సిన బాధ్యత మీ అందరిపై ఉంది. పకడ్బందీ ప్రక్రియతో కులగణన చేశాం…దీన్ని కాపాడుకుని ప్రజల్లోకి తీసుకెళ్లండి.అన్నీ రేవంత్‌రెడ్డి చూసుకుంటాడులే అనుకోవద్దు. ప్రక్రియ పూర్తి చేయడంతో నా బాధ్యత పూర్తయింది. దీన్ని పట్టాలెక్కించి గమ్యం చేర్చే వరకు ముందుకు తీసుకెళ్లే బాధ్యత మీదే. బీజేపీకి నేను సవాల్ విసురుతున్నా. మీరు జనగణనలో కులగణన చేర్చండి. ఎవరి లెక్క తప్పో తేలుతుంది. జనగణనలో కులగణన చేర్చాలని ఈ సమావేశం వేదికగా తీర్మానం చేస్తున్నాం.
సామాజిక వర్గాల వారీగా సమావేశాలు నిర్వహించి మార్చి 10 లోగా తీర్మానాలు చేయండి. మీ ఐకమత్యాన్ని చాటండి. అప్పుడే మీకు రాజకీయంగా, విద్య ఉద్యోగాల పరంగా ప్రయోజనం ఉంటుంది. బలహీన వర్గాలకు కులగణన నివేదికనే బైబిల్, ఇదే భగవద్గీత, ఇదే ఖురాన్.