– ఎందుకు లాగులు తడుస్తున్నాయి?
– ఎందుకు సుప్రీం కోర్టుకు వెళ్లరు?
– 400 టీఎంసీల గోదావరి జలాలను అక్రమంగా ఏపీ తరలిస్తుంటే గుడ్లు అప్పగించుకొని చూస్తారా?
– చంద్రబాబు అడుగులకు కేఆర్ఎంబీ మడుగులు
– జంతర్ మంతర్ వద్ద ధర్నా చేద్దాం పదండి
– కాళేశ్వరం కూలితే గంధమల్లకు నీళ్లు ఎలా వస్తాయి రేవంత్ రెడ్డి?
– మాజీ మంత్రి హరీశ్ రావు దుబ్బాకలో నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తం, బిజెపి ఎంపీలపై ధ్వజం
దుబ్బాక: అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి అనుకున్నం, కానీ ఆయన్ని మించి తాత అయ్యిండు ఉత్తం కుమార్ రెడ్డి. ఉత్తం అబద్దాలు చూస్తే గోబెల్స్ అనేవాడు ఉంటే ఉరి పెట్టుకునేవాడు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను స్టే తెచ్చి ఆపిందే బిఆర్ఎస్, కేసీఆర్.
ఉత్తం కుమార్ రెడ్డి విజయవాడకు పోయి చంద్రబాబును కలిసి బజ్జీలు తిని వచ్చిండు. అప్పటి నుంచి ఏం మాట్లాడటం లేదు. కృష్ణా నది జలాల్లో రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు వాడనంత తక్కువ నీళ్లు వాడింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆంధ్రాకు దాసోహం చేసి, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్ నగర్ లో పంటలను ఎండబెట్టింది కాంగ్రెస్.
తాత్కాలిక కేటాయింపుల ప్రకారం, 65 టీఎంసీలు తక్కువ వాడిన చేతగాని దద్దమ్మ ప్రభుత్వం. ఆరున్నర లక్ష ఎకరాలకు నీళ్లు ఇవ్వకపోవడమే, పంటు ఎండబెట్టడమే. దీనికి సమాధానం చెప్పు, చెంపలేసుకుని ముక్కు భూమికి రాయి ఉత్తం. గోదావరి బనకచర్ల మీద ప్రిపేర్ కాలేదు అంటున్నడు ఉత్తం. నీటి పారుదల శాఖ మంత్రి నువ్వు..
ఎంత బాధ్యత రాహిత్యంగా ఉన్నవు. స్టడీ చేయలేదని మాట్లాడటం నిర్లక్ష్యం. కేబినెట్ లో బనకచర్ల గురించి మాట్లాడేందుకు సమయం లేదా?
ఇంతకంటే ముఖ్యమైన అంశం ఇంకోటి ఉంటదా?
ఐదు గంటలు కమిషన్లు, పర్సెంటీజీలు, హైకమాండ్ కు పంపే మూటల గురించి మాట్లాడారా? 400 టీఎంసీల గోదావరి జలాలను అక్రమంగా ఏపీ తరలిస్తుంటే గుడ్లు అప్పగించుకొని చూస్తారా? సుప్రీంకోర్టుకు వెళ్లరా? కేంద్ర మంత్రిని కలవరా? నీతి అయోగ్ లో సీఎం ఎందుకు మాట్లాడలేదు? ఉత్తం కుమార్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నం
అపెక్స్ కమిటి అనుమతి లేకుండా, అంతర్ రాష్ట్ర అనుమతి లేకుండా, గోదావరి ట్రిబ్యునల్ అనుమతి లేకుండా ప్రాజెక్టు కడుతుంటే ఎందుకు మౌనం? చంద్రబాబును ఎదురించే దమ్ము సత్తా లేదా, ఎందుకు లాగులు తడుస్తున్నాయి? ఎందుకు సుప్రీం కోర్టుకు వెళ్లరు, ఎందుకు ప్రధానిని ప్రశ్నించరు? పూర్తిగా ఏపీకి దాసోహం అయిపోయారు. రాష్ట్రం స్పందించకుంటే సుప్రీం కోర్టుకు బిఆర్ఎస్ వెళ్తుందని చెప్పినం.
ఇప్పటికీ ఆ మాటకు కట్టుబడి ఉన్నం.
కేంద్రం అడిషనల్ ఎఫ్ఆర్బిఎం, 40 వేల కోట్లు కేంద్రం ఈ ప్రాజెక్టుకు నిధులు ఇస్తున్నది. లేఖలు రాసి చేతులు దులుపుకుంటన్నారు. అఖిల పక్షాన్ని కేంద్రం వద్దకు తీసుకువెళ్లాలి, జంతర్ మంతర్ వద్ద ధర్నా చేద్దాం పదండి. కృష్ణా నదిలో న్యాయమైన వాటా కిందకి వదిలింది మీరు. గోదావరి బనకచర్ల కడుతుంటే చేతులు కట్టుకొని చూస్తున్నది మీరు. శ్రీశైలం రైట్ కెనాల్ లైనింగ్ జరుగుతుంటే ఆపకుండా చూస్తున్నది మీరు.
బిఆర్ఎస్ లైనింగ్ పనులు ఆపిస్తే ఇప్పుడు మీరు వచ్చాక మొదలు పెట్టారు. తక్షణం ఆ పనులను నిలిపి వేయించాలని డిమాండ్ చేస్తున్నాం.
రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే బిజేపీ పెదవి విప్పడం లేదు. గోదావరి బనకచర్ల మీద బిజేపీ నాయకులు, కేంద్ర మంత్రులు ఎందుకు మాట్లాడటం లేదు? రాష్ట్ర ప్రయోజనాలు బిజేపికి పట్టవా? బనకచర్ల ద్వారా తెలంగాణ గోదావరిలో వాటా కోల్పోయే పరిస్థితి. శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్ లైనింగ్ పూర్తి అయితే రోజుకు 90వేల క్యూసెక్కుల చొప్పున తరలిస్తారు. బిజేపీ ఎంపీలు కేంద్ర మంత్రులు కండ్లు తెరవండి. ఏపీ నీటి దోపిడిని అడ్డుకోవాల్సిన కేఆర్ఎంబీ చంద్రబాబు అడుగులకు మడుగులు ఒత్తుతున్నది.
శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్ లైనింగ్ అక్రమ పనులు ఆపడం లేదు?
గోదావరి బనకచర్ల అక్రమ ప్రాజెక్టును ఆపడం లేదు? ఉత్తం కుమార్ రెడ్డి చిల్లర మాటలు మానాలి, బనకచర్ల ప్రాజెక్టు ఆపే ప్రయత్నం చేయాలి. కేసీఆర్ కొట్లాడి, కేంద్రం మీద ఒత్తిడి చేసి సెక్షన్ 3 సాధించారు.
గంధమల్ల ప్రాజెక్టు అంటే కాళేశ్వరంలో అంతర్భాగం.కాళేశ్వరం కూలితే గంధమల్లకు నీళ్లు ఎలా వస్తాయి రేవంత్ రెడ్డి? గంధమల్లకు ఎట్ల కొబ్బరి కాయ కొడుతున్నవు? గంధమల్ల, మల్లన్నసాగర్, రంగనాయర్ సాగర్, మిడ్ మానేర్, ఎల్లంపల్లి.. ఇదంతా కాళేశ్వరం కాదా రేవంత్ రెడ్డి?
కుప్పకూలింది అని ప్రచారం చేశారు. కాళేశ్వరం కూలితే గంధమల్లకు గోదావరి జలాలు ఎట్ల వస్తాయి?
నువ్వు ఇన్ని రోజులు చేసిన ప్రచారం శుద్ద తప్పు అని తేటతెల్లమైంది. నువ్వు చేసింది అదంతా గోబెల్స్ ప్రచారం. మూసీలో గోదావరి నీళ్లు పోస్తా అంటవు, ఎట్ల సాద్యమైతది రేవంత్ రెడ్డి? రాజకీయాల కోసం మాట్లాడటం తప్ప ఆయన మాటల్లో నిజం లేదు. కాళేశ్వరంలో రెండు పిల్లర్లు కుంగినయి, చిత్తశుద్ది ఉంటే రెండు నెలల్లో చేయొచ్చు
సూటిగా అడుగుతున్నా.. నువ్వు కొబ్బరికాయ కొట్టే గంధమల్లకు నీళ్లు ఎట్ల వస్తయి. కాళేశ్వరం కాదా సమాధానం చెప్పు. నువ్వు మూసీలో పొస్తానంటున్న నీళ్లు కాళేశ్వరంవా కావా సమాధానం చెప్పు రేవంత్ రెడ్డి.
రాష్ట్ర ప్రజలను, ప్రభుత్వ ఉద్యోగులను నిరాశ పరిచింది కేబినెట్ నిర్ణయాలు. మొదటి క్యాబినెట్ లో ఆరు గ్యారెంటీలకు చట్ట బద్దత అని హామీ ఇచ్చారు. ఏదీ చట్టబద్దత నేను అడుతున్నా. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదు, గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. ఉద్యోగస్థుల విషయంలో మోసం చేసింది.
వంద రోజుల్లో ఏరియర్స్ రిలీజ్ చేస్తామని, పీఆర్సీ అమలు చేస్తామని, డీఏలు క్లియర్ ఛేస్తామని హామి ఇచ్చారు. నిన్నటి కేబినెట్ మీటింగ్ లో ఉసూరుమనిపించారు. ఒక డీఏ, పీఆర్సీ, బకాయిలు చెల్లించేందుకు ముచ్చటగా మూడు కమిటీలు వేశారు. చేసింది మాత్రం ఒక డిఏ ఇవ్వడం.
భారత దేశంలో ఐదు డీఏలు పెండింగ్ లో ఉన్న ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ. దాని కోసం 5 గంటలపైగా కేబినెట్ చర్చ ఎందుకు?
సీపీఎస్ టు ఓపీఎస్ అని హామీ ఇచ్చారు. మాట తప్పారు. రెండో డీఏ వచ్చే ఏప్రిల్ లో ఇవ్వడం అంటే, మల్లో డీఏ యాడ్ అవుతుంది. ఉద్యోగస్తులను రాచి రంపాన పెడుతున్నారు, నిట్టనిలువునా ముంచుతున్నరు కేసీఆర్ 73శాతం పీఆర్సీ ఇచారు. ఇది దేశంలోనే అత్యధికం.
మీరెందుకు ఇవ్వలేదు. మెరుగైన పీఆర్సీ అని మాట తప్పారు. మూడు కమిటీలు వేసి కాలయాపన చేశారు. తక్షణమే మూడు డీఏలు చెల్లించాలని ఉద్యోగుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఓల్డ్ పెన్షన్ స్కీం తీసుకురావాలి. బీఆర్ఎస్ ఇచ్చిన దాని కంటే ఎక్కువ పీఆర్సీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.
ఉద్యోగస్థులను ఏసీబీ కేసులు పెట్టి భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. రాష్ట్రంలో అప్పు లేని పంచాయతీ సెక్రెటరీ లేడు. అప్పులు తెచ్చి పంచాయతీ సెక్రటరీలు గ్రామ పంచాయతీలు నిర్వహిస్తున్నారు. కేసీఆర్ కాలంలో అవార్డులు వస్తే, కాంగ్రెస్ కాలం పంచాయతీలకు ఒక్క అవార్డు దిక్కులేదు.