Suryaa.co.in

Telangana

తెలంగాణ సోయి లేని ప్రభుత్వం పాలిస్తోంది

– దాశరథి శత జయంతిని ప్రభుత్వం నిర్వహించకపోతే జాగృతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తాం
– వానాకాలం వచ్చినా వడ్ల కొనుగోళ్లు పూర్తి చేయరా?
– రేషన్ షాపుల్లో ప్రజలు పడుతోన్న వెతలను తీర్చాలి
– తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

నిజామాబాద్: తెలంగాణ మట్టిలో పుట్టిన మాణిక్యం, స్వాతంత్ర్య సమరయోధుడు దాశరథి ని కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ సోయి ఏమాత్రం లేని ప్రభుత్వం తెలంగాణ ను పాలిస్తుండటం విచారకరమన్నారు.

శుక్రవారం దాశరథి ని నిర్బంధించిన ఖిల్లా రామాలయం ను ఆమె సందర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. దాశరథి శత జయంతి సందర్భంగా ఆయన గొప్పతనాన్ని రేపటి తరాలకు తెలిసేలా కార్యక్రమాలు నిర్వహించాలని తాను పలు సందర్భాల్లో ప్రభుత్వాన్ని కోరామన్నారు. అయినా దున్నపోతు మీద వానపడ్డట్టుగా ప్రభుత్వం తీరు ఉందన్నారు.

జులై 22న దాశరథి శత జయంతి ఉందని.. ఈ రోజు నుంచి ఆయన జయంతి రోజు వరకైనా ఉత్సవాలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. దాశరథి స్ఫూర్తిని ప్రతిబింబించేలా కార్యక్రమాలకు రూపకల్పన చేయాలన్నారు. దాశరథి శత జయంతి ఉత్సవాలపై ప్రభుత్వం ఎలాంటి కార్యాచరణ ప్రకటిస్తుందో జూలై మొదటి వారం వరకు వేచి చూస్తామన్నారు. ఒకవేళ ప్రభుత్వం స్పందించకుంటే జులై 21, 22 తేదీల్లో తెలంగాణ జాగృతి ఆద్వర్యంలో పెద్ద ఎత్తున దాశరథి శత జయంతి వేడుకలు నిర్వహిస్తామన్నారు.

వర్షాకాలం వచ్చినా ఇప్పటికీ వడ్ల కొనుగోళ్లు పూర్తి చేయలేదని, రైతుల అవస్థలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. రేషన్ షాపుల్లో బియ్యం కోసం ప్రజలు గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడుతున్నారని తెలిపారు. ఈ ప్రభుత్వం అనేక వాగ్దానాలు ఇచ్చి వాటిని విస్మరించిందన్నారు. ఈ ప్రభుత్వాన్ని ప్రజలు నిలదీసే రోజులు ఎంతో దూరంలో లేవన్నారు. రేషన్ షాపుల్లో పేదలు పడుతోన్న ఇబ్బందులను తీర్చాలని డిమాండ్ చేశారు.
బిరుదురాజు రామరాజు శత జయంతిని కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. నిజామాబాద్ జిల్లాకు దాశరథి తో ప్రత్యేక అనుబంధం ఉందని.. ఆయనను విస్మరిస్తోన్న ఈ ప్రభుత్వం తీరు తమను కలచి వేస్తోందని అన్నారు.

 

LEAVE A RESPONSE