– మంత్రులు కొల్లు రవీంద్ర, కందుల దుర్గేష్ చేతుల మీదుగా అట్టహాసంగా మసులా బీచ్ ఫెస్టివల్ -2025 ప్రారంభం
మచిలీపట్నం: మసులా బీచ్ ఫెస్టివల్ తో బందరు కొత్త రూపు సంతరించుకుందని, త్వరలో ఈ ప్రాంతాన్ని అద్భుత పర్యాటక కేంద్రంగా, సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక శ్రద్ధ వహిస్తామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు.
కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపంలోని మంగినపూడి సముద్రతీరంలో మసులా బీచ్ ఫెస్టివల్ -2025 ను రాష్ట్ర గనులు భూగర్భవనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి, స్థానిక శాసనసభ్యులు మంత్రి కొల్లు రవీంద్రతో కలిసి మంత్రి కందుల దుర్గేష్ అట్టహాసంగా ప్రారంభించారు. మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో పర్యాటక శాఖ,ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ, కృష్ణా జిల్లా అధికార యంత్రాంగం సంయుక్తంగా మచిలీపట్నం మంగినపూడి బీచ్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్లీ కళా, సాంస్కృతిక వైభవం వెలుగొందేలా ‘మసులా బీచ్ ఫెస్టివల్ – 2025’ కు చేసిన ఏర్పాట్లు బాగున్నాయని ప్రశంసించారు.
అంతేగాక అమరావతి ఐకానిక్ టవర్, అమరావతి అసెంబ్లీ నమూనాలో తయారు చేసిన ముఖ ద్వారం (గేట్ వే ఆఫ్ అమరావతి) ఆకర్షణీయంగా ఉన్నాయన్నారు.వివిధ సముద్ర జీవుల్ని పోలిన ఆకారాలు, కయాకింగ్, కనోయింగ్ వంటి జలక్రీడలు, పారా గ్లైడింగ్ తదితర గేమ్స్ ఆకట్టుకునే రీతిలో సందర్శకులను ఆకర్షించేలా ఏర్పాటు చేయించిన మంత్రి కొల్లు రవీంద్రను ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ కొనియాడారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. మసులా బీచ్ ఫెస్టివల్ మనసు దోచేలా ఉందన్నారు. రాష్ట్రంలో అన్ని బీచ్ ల గురించి మాట్లాడుతున్నారు అదే సందర్భంలో మంగినపూడి బీచ్ అభివృద్ధి గురించి మాట్లాడమని మంత్రి కొల్లు రవీంద్ర పలు సందర్భాల్లో తనను కోరారని పేర్కొన్నారు. సీఎం, డిప్యూటీ సీఎం, పీఎంల సహకారంతో మచిలీపట్నం బీచ్ ను అద్భుత పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు.
ప్రపంచ పర్యాటకులను ఆకట్టుకునేలా కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో అఖండ గోదావరి, గండికోటల పర్యాటక ప్రాజెక్టులను చేపట్టామని మంత్రి దుర్గేష్ అన్నారు. రాజమహేంద్రవరంలోని చారిత్రాత్మక హేవలాక్ వంతెనను ఆధునికీకరించి అద్భుతంగా తీర్చిదిద్దనున్నామన్నారు. సూర్యలంక బీచ్ ను రూ.97 కోట్లతో అభివృద్ధి చేయనున్నామన్నారు.
ఇటీవల న్యూఢిల్లీలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర షింగ్ షెకావత్ ను కలిసిన సందర్భంలో రాష్ట్రానికి మరిన్ని పర్యాటక ప్రాజెక్టులను కేటాయించేందుకు సుముఖంగా ఉన్నారన్నారు. దీనికి సంబంధించిన డీపీఆర్ లు సిద్ధం చేయమన్నారని తెలిపారు. అందులో ఒకటి మంగినపూడి ప్రాజెక్టు అని ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ తెలిపారు. ఈ అంశంలో పర్యాటక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్, ఎండీ సహకారం అందిస్తున్నారన్నారు.
పర్యాటక రంగానికి సీఎం చంద్రబాబునాయుడు పారిశ్రామిక హోదా కల్పించడంతో కూటమి ప్రభుత్వ ఏడాది కాలంలో ప్రఖ్యాత హోటల్స్, రిసార్ట్స్ రాష్ట్రానికి వచ్చాయని మంత్రి దుర్గేష్ వివరించారు. పారిశ్రామిక రంగానికి ఇచ్చే ప్రోత్సాహకాలు, రాయితీలన్నీ పర్యాటక రంగానికి ఇస్తామని చెప్పడంతో పెట్టుబడులకు పలువురు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నారన్నారు. ఇప్పటికే విశాఖ పట్నం, విజయవాడ, ఢిల్లీలో ఇన్వెస్టర్స్ సమ్మిట్ లు నిర్వహించామన్నారు.
రాష్ట్రానికి విశాల సముద్రతీరం, ప్రకృతి సౌందర్య ప్రాంతాలు, చారిత్రాత్మక ప్రదేశాలు, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఉన్నాయని ఇన్వెస్టర్లకు వివరించామన్నారు. తద్వారా 15కు పైగా ప్రసిద్ధ హోటల్స్ తో అతిథ్య రంగంలో పెట్టుబడులకు ఎంవోయూలు చేసుకున్నామన్నారు. రాబోయే రోజుల్లో పీపీపీ విధానంలో అన్ని పర్యాటక ప్రాంతాల్లో అందమైన హోటల్స్, రిసార్ట్స్ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు.
భారతదేశంలోని అన్ని రాష్ట్రాల క్రీడాకారులను ఇక్కడికి రప్పించిన ఘనత మంత్రి కొల్లు రవీంద్రకే దక్కుతుందన్నారు. కీ.శే. పింగళి వెంకయ్య చేత రూపకల్పన చేయబడిన మువ్వన్నెల జెండాను 100 అడుగుల ఎత్తు ఏర్పాటు చేసిన ఘనత, తద్వారా దేశభక్తిని కల్గించిన ఘనత మంత్రి కొల్లు రవీంద్రదే అన్నారు.ప్రతి ఒక్కరిలో జాతీయత భావం పెంపొందేలా ఆపరేషన్ సింధూర్ లో వినియోగించిన డ్రోన్ల మిషనరీ మోడల్ ప్రదర్శన ఏర్పాటు అద్భుతం అన్నారు.ఈ సందర్భంగా ఇంత మంచి కార్యక్రమంలో పాలు పంచుకునే అవకాశం కల్పించినందుకు గర్వంగా ఉందన్నారు.
మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. మసుల బీచ్ ఫెస్టివల్ ను దేశంలో అతిపెద్ద బీచ్ ఫెస్టివల్ గా అభివర్ణించారు రాష్ట్ర టూరిజం అభివృద్ధికి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారన్నారు తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఉపాధి అవకాశాలు కల్పించే రంగం పర్యాటక రంగం అన్నారు వియత్నాం నుంచి బుద్ధుని అవశేషాలను తీసుకువచ్చిన మంత్రివర్యులు కందుల దుర్గేష్ ను మంత్రి కొనియాడారు.
నూతన శోభతో బీచ్ ఫెస్టివల్ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు అమరావతికి హైదరాబాద్కు దగ్గర బీచ్ ఇదేనని అన్నారు అమరావతి అసెంబ్లీ నమూనా లో ఇక్కడ ఐకానిక్ స్ట్రక్చర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు జాతీయ జెండా రూపకర్త పింగళి ను స్మరించుకుంటూ 100 అడుగుల జాతీయ జెండా ఏర్పాటు చేయడం, తీరప్రాంతాల్లో అతి ఎత్తైన జెండాగా అభివర్ణించారు.
ఈ జెండా స్తూపానికి పింగళి వెంకయ్య పేరు నామకరణం చేస్తున్నట్లు తెలిపారు బీచ్ ఫెస్టివల్ లో హెలి రైడ్ ,అడ్వెంచర్ స్పోర్ట్స్, అమ్యూజ్మెంట్, ఫుడ్ ఫెస్టివల్ ఇంకా సినీ ఆర్టిస్టుల సందడి వింతలు వినోదాలు ఉంటాయని, బీచ్ ఫెస్టివల్ కు అందరూ తరలివచ్చి ఆనందించాలని మంత్రి కోరారు.
రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్ మాట్లాడుతూ రాష్ట్రంలో పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా తెచ్చుటకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఈ ఆర్థిక సంవత్సరంలో పర్యాటక అభివృద్ధికి సంబంధించి ఈవెంట్స్ ఫెయిర్స్ ఫెస్టివల్స్ కోసం ప్రభుత్వం 150 కోట్లు కేటాయించింది అన్నారు హైదరాబాద్ కు దగ్గరలో ఉండే ఈ బీచ్ తోపాటు జిల్లాలో కూచిపూడి నృత్య కేంద్రం, ఇమిటేషన్ జ్యువలరీ, కలంకారి వంటి కళలను అభివృద్ధికి టూరిజం సర్క్యూట్ ఏర్పాటుకు మంచి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. బీచ్ ఫెస్టివల్ సంబంధించి ఆడియో విజువల్ రిలీజ్ చేశారు ఈ బీచ్ ఫెస్టివల్లో క్రీడల మస్కట్ “మీను” ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ, డీసీఎంఎస్ ఛైర్మన్ బండి రామకృష్ణ, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, ప్రభుత్వ విప్పు గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకటరావు, పామర్రు శాసనసభ్యులు వర్ల కుమార్ రాజా పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్, జిల్లా కలెక్టర్ బాలాజీ, జిల్లా ఎస్పీ గంగాధర్ రావు, అధికారులు, జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్, మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, కూటమి నాయకులు కుంచె నాని కాగిత వెంకటేశ్వరరావు రాష్ట్ర కబాడీ అసోసియేషన్ అధ్యక్షురాలు కె.వి ప్రభావతి, తదితరులు పాల్గొన్నారు.