– రిటైరయ్యే వారికి అందలం కోసం అడ్డదారులు
– వైసీపీలో చక్రం తిప్పిన వారికే మళ్లీ పొడిగింపు యత్నం
– అర్హులైన అధికారులకు అవకాశాలు ఇవ్వని ‘ఆధిపత్యం’
– నిబంధనల ముసుగులో మళ్లీ పొడిగింపు వ్యూహం
– ఒప్పుకోమంటూ వ్యతిరేకిస్తున్న బోర్డు ఉద్యోగులు
– బయట నుంచి తీసుకువచ్చే యత్నాలపై సీరియస్
– తమ ప్రమోషన్లు దెబ్బతింటాయన్న ఆందోళన
– దానితో లేకపోయినా కొత్త పోస్టు సృష్టికి మాయోపాయం
– దానికి ఆగమేఘాల కదులుతున్న అనుమతి ఫైలు
– ఇప్పటికే అరడజను విభాగాలు ఒకే వ్యక్తి చేతిలో
– ఒక్కరికే అన్నేసి బాధ్యతలు ఎలా సాధ్యమంటున్న అధికారులు
– అన్నీ ఆ కన్సల్టెంట్ చేయాల్సిందే
– అదో ‘ఇందూ’ బంధం
– పొల్యూషన్‌లో ‘మోహన’రాగం
– పెద్ద బాసుల ఆశీస్సులతో ఏళ్ల తరబడి చక్రం తిప్పుతున్న వైనం
– పొల్యూషన్ కంట్రోల్‌బోర్టులో పదోన్నతులు, పొడిగింపుల మాయాజాలం
– పవన్ కొరడా ఝళిపిస్తారా?
( మార్తి సుబ్రహ్మణ్యం)
అది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు. రాష్ట్రంలోని పరిశ్రమలు కాలుష్యం వెదజల్లకుండా నియంత్రించే బాధ్యత దానిని. కానీ అసలు ఆ బోర్డులోనే పొడిగింపులు-పదోన్నతుల పొల్యూషన్ ఉంటే? ఒక్క అధికారికే అరడజనుకు పైగా బాధ్యతలు అప్పగిస్తే?… కేవలం ఒకే కన్సల్టెంట్‌కే కంపెనీల పెత్తనం అప్పగిస్తే?.. ఇన్నేళ్ల పెత్తనం సరిపోదన్నట్లు మళ్లీ పొడిగింపు ఇచ్చేందుకు పావులు కదుపుతుంటే? మరి ఆర్చేదెవరు? తీర్చేదెవరు? ఆ పొల్యూషన్‌ను ‘కంట్రోల్’ చేసేదెవరు? ఇదే ఇప్పుడు పొల్యూషన్ కంట్రోల్ బోర్టులో హాట్‌టాపిక్!
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సత్తా-సమర్థతకు ఇదో సవాల్‌గా మారిన యవ్వారం. ఇతర శాఖల్లో జరుగుతున్న అవినీతి, అలసత్వంపై విరుచుకుపడే పవన్‌కు.. సొంత శాఖలో జరుగుతున్న తెరచాటు దందాపై నిర్ణయం తీసుకునే పరీక్షా సమయం. వైసీపీ జమానాలో అంతా తానై చక్రం తిప్పి..
పైవారికి ‘ప్రసాదా’లు పంపిణీ చేస్తున్న వారిని రిటైరయినా, మళ్లీ తీసుకుంటారా? లేక తన శాఖలో పెద్దల మాట విని పొడిగింపు ఇస్తారా అని పీసీబీ అధికారులు, ఉద్యోగులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్న వైనమిది.
ఏపీ పొల్యూషన్ కంట్రోల్‌బోర్డులో పొడిగింపు-పదోన్నతుల గత్తర నడుస్తోంది. వైసీపీ హయాంలో చక్రం తిప్పిన ఒక సీనియర్ అధికారికి మళ్లీ పొడిగింపు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్న వైనం.. బోర్డు అధికారులు, ఉద్యోగుల్లో వ్యతిరేకతకు కారణమవుతోంది. బోర్డులో పదోన్నతులకు అర్హులైన అధికారి ఉన్నప్పటికీ.. రెండేళ్ల నిబంధన ముసుగులో వారిని తొక్కేస్తున్న వైనంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
తిరుపతిలో పనిచేస్తున్న మురళి అనే అధికారికి ప్రమోషన్ ఇవ్వకుండా, కేవలం ఇన్చార్జికే పరిమితం చేశారు. మరో దళిత అధికారిని సుదీర్ఘకాలం నుంచి వేధిస్తున్న నేపథ్యంలో విసుగుచెందిన ఆ దళిత అధికారి, జాతీయ మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేసిన దుస్థితి. ఇలా బోర్డులో పెత్తనం చేస్తున్న వారికే మళ్లీ రిటైర్‌మెంట్ తర్వాత మరో రెండేళ్లు పొడిగింపు ఇచ్చేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై మండిపడుతున్న అధికారులు, ఉద్యోగులు ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
కాగా ఓ అధికారి చాలాకాలం నుంచి పలువురు పారిశ్రామికవేత్తలను, వివిధ రూపాల్లో వేధిస్తున్న నేపథ్యంలో.. తమకు విముక్తి కలుగుతుందన్న ఆశతో ఉన్నారు. అయితే మళ్లీ ఆ అధికారికే పొడిగింపు ఇస్తున్నారన్న ప్రచారంపై తల పట్టుకుంటున్నారు. అయితే బోర్డులో ఇంజనీర్లు సరిపడా లేనందున, బోర్డు నిబంధనల ప్రకారం రిటైరయ్యే వారిని మళ్లీ తీసుకోవచ్చన్న నిబంధనను.. బోర్డులోని కొందరు పెద్దలు, పర్యావరణశాఖలోని పెద్దతలలు ఓ అధికారి కోసం వినియోగిస్తున్నట్లు బోర్డులోని కొందరు అధికారుల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఏ ప్రభుత్వం ఉన్నా లౌక్యంగా వ్యవహరిస్తూ, లాబీయింగ్‌లో దిట్ట అయిన అధికారి.. సుదీర్ఘకాలం నుంచి ఆరేడు పోస్టులు నిర్విహ స్తున్నారంటే, ఎవరి సహకారం లేకుండా చేయడం అసాధ్యమన్నది మెడపై తల ఉన్న ఎవరికయినా అర్ధమవుతుంది.
బోర్డులో విశాఖ జోన్ అంటే బంగారుబాతు. అక్కడ పోస్టింగ్ కోసం చాలామంది ఆశపడుతుంటారు. కానీ బోర్డులో ఒకవైపు అధికారుల కొరత అని చెబుతున్న పెద్దలు.. హెడ్డాఫీసులో పనిచేస్తూ, ఆరు శాఖలు చూస్తున్న వారిే మళ్లీ విశాఖ అప్పగించడం బట్టి.. బోర్డులో గుడ్డిదర్బార్ ఏ స్థాయిలో నడుస్తుందో అర్ధమవుతుంది. మళ్లీ అదే వ్యక్తికి పొడిగింపు ఇచ్చేందుకు సామూహికంగా పావులు కదుపుతున్నారంటే, పర్యావరణశాఖపై వారికి ఏ స్ధాయిలో పట్టుందో స్పష్టమవుతోందని కొందరు అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.
నిజానికి ఒక్క అధికారికే ఆరేడు విభాగాలు అప్పగించడం వల్ల, అనుమతులు, రెన్యువల్స్‌కు దాదాపు నెలరోజుల సమయం పడుతోందంటున్నారు. ప్రమోషన్‌కు ఉన్న రెండేళ్ల నిబంధనను అడ్డుపెట్టుకుని, ఆ రెండేళ్లలో ప్రమోషన్ రానీయకుండా జరిగిన కుట్రలకు చాలామంది అధికారులు ప్రమోషన్ లేకుండానే రిటైరయిపోయారంటున్నారు. ప్రస్తుతం తిరుపతి జోనల్ అధికారి కూడా ఇదే జాబితాలో ప్రమోషన్ లేకుండానే రిటైరవనున్నట్లు చెబుతున్నారు.
ఆ నిబంధన తొలగిస్తే అందరికీ అవకాశాలు
కాగా ప్రమోషన్‌కు రెండేళ్ల నిబంధన తొలగిస్తే.. బోర్డులోని అందరికీ ప్రమోషన్లు వస్తాయని అధికారులు, ఉద్యోగులు చెబుతున్నారు. ‘‘ ఆ నిబంధనను తొలగించే అధికారం బోర్డుకు ఉన్నప్పటికీ, కేవలం ఒక వ్యక్తి కోసం దానిని అమలు చేయడం లేదు. అప్పుడు ఒకే వ్యక్తికి ఆరేడు సెక్షన్లు అప్పగించాల్సిన అవసరం ఉండదు. గత ప్రభుత్వం పదవీ విరమణ వయసు పొడిగించిన సమయంలో బోర్డుకు అది వర్తిస్తుందా? లేదా అన్న దానిపై స్పష్టత లేదు. దానితో చాలామంది అధికారులు అప్పుడు ఎంజాయ్ చేశారు. దానికి కారణం కూడా ఆ అధికారే’’ అని ఉద్యోగులు వ్యాఖ్యానిస్తున్నారు.
బయట వారిని తీసుకువస్తే సమరభేరి
ఇప్పుడు బయట డిపార్టుమెంట్ల నుంచి ఇతరులను తీసుకువచ్చే ప్రయత్నాలను అడ్డుకుని తీరతామని ఉద్యోగులు హెచ్చరిస్తున్నారు. ‘ మా దగ్గర సమర్ధులైన అధికారులు, ఉద్యోగులు చాలామంది ఉన్నారు. వారికి సరైన సమయంలో ప్రమోషన్లు ఇస్తే బయట నుంచి తీసుకురావలసిన అవసరం ఏముంది? కానీ దానిని అమలు చేయకుండా ఒక ప్రముఖుడు బయట డిపార్టుమెంట్ల నుంచి పీసీబీకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. దీన్ని అడ్డుకుంటాం. అవసరమైతే బోర్డు ఆఫీసు ఎదుకే ధర్నాలు చేస్తాం’’ అని ఉద్యోగులు స్పష్టం చేశారు.
దొడ్డిదారిలో అందలం?
ఇదిలాఉండగా..రిటైరయ్యే అధికారికి మళ్లీ పొడిగింపు ఇచ్చే దొడ్డిదారి ప్రయత్నాలను అధికారులు, ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఏళ్ల తరబడి తమను వేధిస్తున్న ఆ అధికారికి మళ్లీ పొడిగింపు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. ఆయనకు మళ్లీ పోస్టింగ్ ఇస్తే, తమ ప్రమోషన్ అవకాశాలు దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిని వ్యతిరేకిస్తూ ఉద్యోగులు సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
కాగా రిటైరయ్యే అధికారికి మళ్లీ అదే హోదా ఇస్తే అధికారులు, ఉద్యోగుల నుంచి వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉన్నందున.. 2 పేరిట లేని పోస్టు ఒకటి సృష్టించేందుకు పావులు కదుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. నిజానికి ఆ పోస్టు బోర్డులో లేకపోయినా.. కేవలం ఆయన కోసమే సృష్టిస్తున్నారట. దానికి పెద్దతలల ఆశీస్సులున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఆ పోస్టు అనుమతి కోసం రాసిన ఫైల్.. ఆర్ధిక శాఖ నుంచి సీఎంఓ వరకూ పంచకల్యాణి గుర్రం కూడా, ఈర్ష్యపడే స్థాయిలో వాయువేగంతో కదులుతుండటం ఆశ్చర్యకరం.
ఆ న్సల్టెంట్‌కే రెడ్‌కార్పెట్
కాగా పరిశ్రమలకు అనుమతులు, ఇతర అంశాలకు సంబంధించిన వ్యవహారాలను కంపెనీ అధిపతులు సొంతంగా చూసుకోలేరు. దానితో సహజంగా కన్సల్టెంట్ల ద్వారా తమ పనులు చేసుకుంటారు. ఆ కన్సల్టెంట్లు బోర్డులోని పెద్దతలలకు సన్నిహితులయిన వారికే, ఆ కన్సల్టెంట్ బాధ్యత అప్పగిస్తుంటారు. సహజంగా ఇది ఎక్కడయినా జరిగేదే. అయితే బోర్డులో ఇది రివర్స్. ఓ అధికారికి వద్దకు వచ్చే కన్సల్టెంట్లను ఆయన లెక్కచేయరు. కంపెనీ యజమానులను రమ్మని చెబుతారు. వారితోనే మాటా ‘ముచ్చట’! కానీ ఇందుకు ఓ కన్సల్టెంట్ మినహాయింపు. సదరు కన్సల్టెంట్ తీసుకువచ్చే ఫైళ్లను.. పంచకల్యాణి గుర్రం కూడా ఈర్ష్యపడేంత వేగంతో క్లియర్ చేస్తారని, అందుకు హైదరాబాద్‌లో ‘ఇందూ’ బంధమే కారణమన్న ప్రచారం లేకపోలేదు.
పవన్ ‘పవర్’ చూపిస్తారా?
పొల్యూషన్ కంట్రోల్ బోర్డు డిప్యూటీ సీఎం పవన్ ల్యాణ్‌కు సంబంధించి అటవీ, పర్యావరణ శాఖ కిందకు వస్తుంది. బోర్డులో కొన్నేళ్ల నుంచి నిర్నిరోధంగా జరుగుతున్న ఈ ఏకవ్యక్తి స్వామ్యానికి పవన్ అడ్డుకట్ట వేస్తారా? లేదా? అన్న చర్చకు తెరలేచింది. అవినీతి, అడ్డదారులను వ్యతిరేకించే పవన్ కల్యాణ్ తన సొంత శాఖలో జరుగుతున్న ఈ అడ్డదారి పొడిగింపులకు తెరదించి.. అర్హులను అందమెక్కిస్తారా?లేదా? అన్నది చూడాలి. ఎందుకంటే పవన్ అవినీతి-అడ్డదారులపై చండశాసనుడన్న పేరుంది.
కాగా పదోన్నతులకు అవరోధంగా ఉన్న రెండేళ్ల నిబంధనను తొలగించే అధికారం బోర్డుకు ఉన్నప్పటికీ.. ఇన్నాళ్లూ కేవలం ఒక వ్యక్తి కోసం దానిని అమలుచేయని కుట్రలను పవన్ బద్దలు చేస్తారా? అన్నది మరో ప్రశ్న. ఇక ఇప్పటివరకూ విశాఖపట్నం కేంద్రంగా జరిగిన పరిశ్రమలకు అనుమతులు, విచారణల పేరిట జరిగిన తెరవెనక దందాలతోపాటు.. అసలు ఒక వ్యక్తికి ఆరేడు శాఖలు అప్పగించింది ఎవరన్న అంశంపై విజిలెన్స్ విచారణకు ఆదేశించాలన్న డిమాండ్‌కు, పవన్ స్పందిస్తారో లేదో చూడాలి.