– అన్నదాతల ఆక్రందనలు విన్పించడం లేదా?
– కాల్వల్లో నీళ్లున్నా ఎందుకు వదలడం లేదు?
– రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి రైతులు ఎందుకు మూల్యం చెల్లించాలి?
– దీనిని కూడా కేంద్రంపై నెట్టేసి తప్పించుకోవాలనుకుంటున్నారా?
– రైతు భరోసా ఇవ్వరు….రుణమాఫీ పూర్తి చేయరు
– పంట నష్టపరిహారం ఇవ్వరు
– ఇదేనా కాంగ్రెస్ మార్క్ రైతు సంక్షేమ రాజ్యమంటే?
– రాజకీయ నాయకుల స్టేచర్ గురించి కాదు…రైతుల ఫ్యూచర్ ఆలోచించండి
– అసెంబ్లీలో తక్షణమే రైతు సమస్యలపై చర్చించండి
– కష్టాల్లో ఉన్న రైతాంగానికి ఆదుకునే చర్యలు చేపట్టండి
– యాసంగి పూర్తయ్యేవరకు నీళ్లొదలండి
– కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంవల్ల రాష్ట్రంలో పంటలు ఎండిపోతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 56 లక్షల ఎకరాల్లో వరి, 7 లక్షల ఎకరాల్లో మొక్కొజొన్న పంటలు వేసినప్పటికీ…. ఆయా పంటలకు తగిన సమయంలో నీటిని వదలకపోవడంవల్ల ఇప్పటికే దాదాపు 10 లక్షల ఎకరాల మేరకు పంట ఎండిపోయినట్లు మా దృష్టికి వచ్చింది. ముఖ్యంగా ఆయకట్టు చివరి పంటలకు నీళ్లందక పంటలు పూర్తిగా ఎండిపోతున్నాయి. అయినా ప్రభుత్వ యంత్రాంగం రైతులను ఆదుకునేందుకు, పంటలను కాపాడేందుకు చర్యలు తీసుకోకపోవడం బాధాకరం.
వాస్తవానికి ఈ ఏడాది పుష్కలంగా వర్షాలు కురిసి ప్రాజెక్టులు, చెరువులు నిండిపోయాయి. ఫలితంగా వానా కాలంలో రికార్డు స్థాయిలో అంటే 160 లక్షల మెట్రిక్ టన్నులకుపైగా వరి ధాన్యం దిగుబడి వచ్చింది. నీటి లభ్యతను ద్రుష్టిలో ఉంచుకుని యాసంగిలోనూ 56లక్షల ఎకరాల్లో వరి, మరో 7 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న పంటలు వేశారు. వీటితోపాటు జొన్న, పప్పుదాన్యాలు, నూనెగింజల పంటలు కూడా వేశారు.
యాసంగి పంటలు వేసేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. యాసంగిలో ఏ ప్రాంతంలో ఏ పంట వేయాలనే అంశానికి సంబంధించి ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను కూడా వ్యవసాయ శాఖ అమలు చేయలేదు. మరో నెల రోజుల్లో పంటలు కోతకు రాబోతున్న తరుణంలో పొలాలకు నీరందక పోవడంవల్ల లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయి. చెరువుల్లో నీరు తగ్గడంతో భూగర్భ జలాలు పడిపోయి బావులు, బోర్ల కింద పంటలన్నీ ఎండి నేలరాలుతున్నాయి.
ఇది ముమ్మాటికీ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే. ఎందుకంటే శ్రీశైలం, నాగార్జున సాగర్, శ్రీరాం సాగర్, ఎల్లంపల్లి, ఎల్ఎండీ, సింగూరు సహా రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టుల్లో 340 టీఎంసీలకుపైగా నీటి నిల్వ ఉన్నట్లు ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. ఇందులో 150 టీఎంసీల మేరకు డెడ్ స్టోరేజీ పోగా, మరో 190 టీఎంసీలకుపైగా నీరు అందుబాటులో ఉంది. తాగునీటి అవసరాలకు మినహాయించి మిగిలిన నీటిని సకాలంలో విడుదల చేసి చెరువులు నింపినట్లయితే పంటలు ఎండిపోయే దుస్థితి తలెత్తేది కాదు.
కానీ ప్రభుత్వ నిర్లక్ష్యం, వ్యవసాయ శాఖ ప్రణాళిక లేమి కారణంగా నీళ్లున్నా వాడుకోలేకపోవడంవల్ల రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి. ఎకరాకు రూ.30 వేలకుపైగా పెట్టుబడి పెట్టి ఆరుగాలం కష్టపడి సాగు చేస్తున్న రైతులకు మరో నెలరోజుల్లో పంట చేతికి అందే సమయంలో పైర్లు ఎండిపోవడమంటే నోటి కాడ ముద్దను నేల పాలు చేయడమే. ఎండిపోతున్న పంటలను రక్షించడానికి రైతులు ఆందోళనలు చేపట్టినప్పటికీ ప్రభుత్వం మాత్రం మొద్దు నిద్రను వీడకపోవడం క్షమించరాని చర్య. పంటలు ఎండిపోయి పశువులకు మేపుకుంటున్నా, ఎండిన పంటను తగలబెడుతున్నా వ్యవసాయశాఖ మేల్కోకపోవడం, రైతుల పెట్టుబడి నష్టాన్ని గుర్తించకపోవడం బాధాకరం. పాలకుల నిర్లక్ష్యానికి రైతులు ఎందుకు మూల్యం చెల్లించాలి?
ఇప్పటికే రైతు భరోసా సాయం అందక రైతులు ఇబ్బంది పడుతున్నారు. రుణమాఫీ పూర్తిగా అమలు కాక 20 లక్షలకుపైగా రైతులు అప్పులు చెల్లించకలేక అల్లాడుతున్నారు. గతంలో పంట నష్టపోతే పరిహారం అందక అరిగోస పడుతున్నారు. రైతు రాజ్యమని బీరాలు పలికే కాంగ్రెస్ ప్రభుత్వం వీటికి ఏం సమాధానం చెబుతుంది? కాంగ్రెస్ మార్క్ రైతు సంక్షేమ రాజ్యమంటే ఇదేనా?
కనీసం రైతులు పడుతున్న ఇబ్బందులపై అసెంబ్లీలో చర్చించాలనే ఆలోచన కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేయకపోవడం దుర్మార్గం. రాష్ట్రానికి, దేశానికి అన్నం పెడుతున్న అన్నదాత అష్టకష్టాలు పడుతూ ఆత్మహత్యలు చేసుకుంటుంటే… వారి సమస్యలపై చర్చించి పరిష్కార మార్గాలు కనుగొనడంతోపాటు వారికి అండగా ఉన్నామనే భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? ఈ అంశాన్ని కూడా కేంద్రంపైకి నెట్టేసి తప్పించుకోవాలనుకుంటున్నారా?
ప్రభుత్వ అధినేతగా రాజకీయ నాయకుల స్టేచర్ గురించి మాట్లాడి మీడియాలో వార్తలకెక్కడం కాదు… ప్రభుత్వ అధినేతగా రైతుల ఫ్యూచర్ గురించి ఆలోచించి వారికి అండగా నిలవాలి. తక్షణమే రాష్ట్ర రైతాంగం పడుతున్న ఇబ్బందులపై అసెంబ్లీలో చర్చించాలి. అసెంబ్లీ సాక్షిగా రైతులను ఆదుకునేందుకు ప్రకటన చేయాలి. మరింత నష్టం జరగకుండా వెంటనే ప్రాజెక్టులనుండి నీటిని విడుదల చేయాలని భారతీయ జనతా పార్టీ పక్షాన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.