– ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5లక్షల సహాయం
– 2.65 లక్షల మంది లబ్దిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు
– 71 వేల ఇండ్లు గ్రౌండింగ్
– రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
హైదరాబాద్ : మొండి గోడలతో అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పూర్తిచేయడానికి కాంట్రాక్టర్ ముందుకు రాని పక్షంలో లబ్దిదారులే ఆ ఇండ్లను పూర్తిచేసుకోవడానికి ప్రభుత్వం రూ. 5 లక్షల ఆర్ధిక సహాయం అందిస్తుందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
ఇందిరమ్మ ఇండ్ల సర్వేలో ఇండ్ల స్ధలాలు లేని అర్హత కలిగిన లబ్దిదారులకు అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుత కంట్రాక్టర్ మోడ్ నుంచి లబ్దిదారులు నేతృత్వంలోని నిర్మాణం ( బి ఎల్ సి) మోడ్ లో చేపట్టి పూర్తిచేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.
సోమవారం సచివాలయంలో ఇందిరమ్మ ఇండ్లు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం , మౌళిక వసతులపై అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిరుపేదలకు నిలువ నీడను కల్పించడం ప్రభుత్వాల తక్షణ కర్తవ్యమని కానీ తొమ్మిదిన్నర సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఏలిన గత పాలకులు ఈ కర్తవ్యాన్నివిస్మరించారని
రాష్ట్రంలో అవసరమైన వారందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇస్తామని చేసిన వాగ్దానాన్ని గాలికి వదిలేశారని విమర్శించారు. పది సంవత్సరాలలో 60 వేల ఇండ్లను మాత్రమే అరకొరగా పూర్తి చేశారని త్రాగునీరు, సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ , విద్యుత్ వంటి కనీస సదుపాయాలను విస్మరించారని విమర్శించారు.
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల వద్ద మౌళిక వసతులు కల్పించడంతోపాటు అసంపూర్తిగా ఉన్న 1.61 లక్షల ఇండ్లను రూ. 640 కోట్లతో పూర్తిచేసి 98 వేల మంది లబ్దిదారులకు కేటాయించడం జరిగిందని తెలిపారు. ఇంకా 69 వేల ఇండ్లు అసంపూర్తిగా వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయని వీటిని బి ఎల్ సి మోడ్‌లో పూర్తిచేస్తామని తెలిపారు. ఇందుకోసం అర్హులైన లబ్దిదారులను గుర్తించి వారికి కేటాయించాలని ఈ ప్రక్రియను వీలైనంత త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.
2.65 లక్షల ఇందిరమ్మ లబ్దిదారులకు మంజూరు పత్రాలు
ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 22,500 కోట్ల రూపాయిలతో 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లు నిర్మించాలనే లక్ష్యంగా పెట్టుకున్నామని ఇందుకు సంబంధించి ఇప్పటి వరకు 2.65 లక్షల లబ్దిదారులకు మంజూరు పత్రాలను అందజేయడం జరిగిందన్నారు. ఇప్పటివరకు 71వేల ఇండ్లు గ్రౌండింగ్ అయ్యాయని దాదాపు మూడు వేల ఇళ్లు గోడలు, శ్లాబ్‌ల వరకు పూర్తయ్యాయని తెలిపారు.