యూరప్ లో కరువు విలయతాండవం

మన దగ్గర వానలు ఏమో విడవకుండా కొడుతున్నాయి. ఎండ కోసం మొహం వాచేలా ఎదురుచూస్తున్నారు. బావులు బోర్లు అన్నీ నీటితో నిండిపోయాయి. నదులు చెరువులు ఫుల్లుగా ఉన్నాయి. కానీ యూరప్ ఖండం మాత్రం కరువుతో అల్లాడుతోంది.అక్కడ కరువు విలయతాండవం చేస్తోంది. ఎప్పుడూ పచ్చగా.. సాగునీటితో కళకళలాడే ఆ ప్రాంతం తీవ్ర ఎండలతో ఇప్పుడు కరువు ప్రాంతంగా మారిపోయింది. విపరీతమైన ఎండలు కార్చిచ్చులతో పలు దేశాలు అతలాకుతలం అవుతున్నాయి.

500 ఏళ్లకోసారి వచ్చే కరువు ఈసారి యూరప్ ఖండాన్ని కప్పేసింది. ఎప్పుడూ నిండుగా ప్రవహించే బ్రిటన్ లోని థేమ్స్ నడి ఎండిపోతోంది. ఫ్రాన్స్ దేశంలో ఎండవేడిమికి కార్చిచ్చులు ఎగిసిపడుతున్నాయి. నదుల్లో నీళ్లు లేక చేపలు గుట్టలుగా చనిపోతున్నాయి. స్పెయిన్ లో రిజర్వాయర్లు నీళ్లు లేక బోసిపోతున్నాయి. మొత్తంగా యూరప్ లో సగభాగాన్ని కరువు కమ్మేసింది.

వాతావరణ మార్పుల ప్రభావం యూరప్ పై తీవ్రంగా చూపింది. అభివృద్ధి చెందిన దేశాలపైన బ్రిటన్ ఫ్రాన్స్ హంగేరి సెర్బియా స్పెయిన్ పోర్చుగల్ జర్మనీ తదితరు దేశాల్లో ఇప్పుడు కరువు విలయతాండవం చేస్తోంది. పశ్చిమ మధ్య దక్షిణయూరప్ లో రెండు నెలలుగా వానలు లేవు. దీంతో యూరప్ లోని సగం ప్రాంతాల్లో కరువు పడగ విప్పింది.

యూరప్ లోని 46 శాతం ప్రాంతాల్లో ప్రమాదకరంగా కరువు పరిస్థితులు ఉన్నాయి. వాటిలో 11 శాతం ప్రాంతాల్లోనైతే అతి తీవ్ర కరువు నెలకొంది. దక్షిణ ఇంగ్లండ్ లో థేమ్స్ నదిలో ఏకంగా 356 కి.మీ మేర ఇసుక మేటలు వేసి కనిపించడం గత 500 ఏళ్లలో చూడలేదు. ఇదే కరువుకు నిదర్శనంగా చెప్పొచ్చు. నది జన్మస్థానం వద్ద వానలు కురవకపోవడం.. ఎగువ నుంచి నీళ్లు రాకపోవడంతో ఎన్నడూ లేనంతగా నది ఎండిపోయింది.

ఫ్రాన్స్ లోని టిల్లె నదిలో సెకనుకు సగటున 2100 గాలన్లు నీరు ప్రవహించేది. కానీ ఇప్పుడు చుక్క నీరు కనిపించడం లేదు. ఇంగ్లండ్ లో ఏకంగా 8 ప్రాంతాలను కరువు ప్రాభావితంగా బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది.

1935 తర్వాత ఇలాంటి పరిస్థితులు రావడం ఇదే తొలిసారి అని చెబుతున్నారు. ఇంగ్లండ్ లో కొద్ది వారాలుగా ఉష్నోగ్రతలు ఏకంగా 40 డిగ్రీలు దాటాయి. ఎండ దంచికొడుతోంది. ఈ ఏడాది జులైలో అత్యంత పొండి మాసంగా రికార్డులకు ఎక్కింది.

ఇక ఇవే పరిస్థితులు తూర్పు ఆఫ్రికా మెక్సికోల్లో కూడా కనిపిస్తున్నాయి. 500 ఏళ్ల కోసారి ఇలాంటి కరువు పరిస్థితులు చూస్తామని నిపుణులు చెబుతున్నారు. ఎప్పుడూ వర్షాలతో తేమగా ఉండే యూరప్ ఇలా కరువుతో అల్లాడడం చూసి అంతా ముక్కున వేలేసుకుంటున్నారు.

Leave a Reply