యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) ఆర్థిక వ్యవహారాలు, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దుబాయ్‌లో జరిపిన భేటీ ఒక సరికొత్త మైలురాయిగా నిలిచింది. ఇద్దరు విజనరీ నాయకులు ‘నాలెడ్జ్ ఎకానమీ’ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అనే ఒకే లక్ష్యంపై దృష్టి సారించడం ఈ సమావేశం యొక్క ముఖ్యాంశం.
ముందుగా యూఏఈ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రీ గురించి చూస్తే, ఆయన యూఏఈ ఆర్థిక వ్యవస్థను సంస్కరణలు, నూతన ఆవిష్కరణల ద్వారా ముందుకు నడుపుతున్న కీలక టెక్నోక్రాట్.
2020 నుంచి ఆర్థిక, పర్యాటక మంత్రిగా ఉన్న ఆయన, యూఏఈ ఆర్థిక వ్యవస్థను చమురుపై ఆధారపడకుండా, డిజిటలైజేషన్ మరియు హై-టెక్ రంగాల వైపు మళ్లించడంలో కీలక పాత్ర వహిస్తున్నారు. దుబాయ్‌ను ‘భవిష్యత్తు నగరం’గా మార్చే లక్ష్యంతో ప్రారంభించిన ఏరియా 2071’, ‘దుబాయ్ 10X’ వంటి భవిష్యత్తు ప్రాజెక్టుల వెనుక ఉన్న మేధావి. నాలెడ్జ్ ఎకానమీకి బలమైన బాట వేసిన నేత.
ఈ భేటీలో ముఖ్యంగా ఏపీకి ఉపయోగపడే కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పాలన, పౌర సేవలను మరింత మెరుగ్గా అందించడానికి AI వినియోగాన్ని పెంచడంపై ఇరువురు నేతలు చర్చించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్‌కు అనుగుణంగా, యూఏఈలో అమలు చేస్తున్న అత్యుత్తమ సాంకేతిక విధానాలను ఏపీలోని రియల్-టైమ్ గవర్నెన్స్ సిస్టమ్ (RTGS) ద్వారా ఇచ్చిపుచ్చుకునేందుకు మంత్రి అల్ మర్రీ వెంటనే అంగీకరించారు. ఇది ఏపీ పాలనా వ్యవస్థలో కీలక మార్పుకు దోహదపడుతుంది.
అంతేకాకుండా, ఇన్నోవేషన్‌లో కీలక ముందడుగుగా.. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ (RTIH) మరియు దుబాయ్ సిలికాన్ ఓయాసిస్ (DSO) మధ్య కొత్త భాగస్వామ్యంపై అంగీకారం కుదిరింది. ఈ ఒప్పందం AI ఆవిష్కరణలు, స్టార్టప్‌లను ప్రోత్సహించి, ఏపీని గ్లోబల్ నాలెడ్జ్ ఎకానమీ హబ్‌గా మార్చే ప్రయత్నాలకు బలం చేకూర్చనుంది. లాజిస్టిక్స్, రవాణా, మౌలిక సదుపాయాల (Infrastructure) రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి యూఏఈ ఆసక్తి చూపగా, ఆహార భద్రత (Food Security) అంశంపై ఏపీతో కలిసి పనిచేసేందుకు కూడా యూఏఈ సంసిద్ధత వ్యక్తం చేసింది.
ఈ భేటీ ఫలితంగా, యూఏఈ ఆధునిక సాంకేతిక అనుభవం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి లక్ష్యాలు కలిసి ఒక కొత్త వాణిజ్య, సాంకేతిక అధ్యాయానికి నాంది పలికాయి.