Suryaa.co.in

Andhra Pradesh

దసరా స్పెషల్ – ప్రత్యేక బస్సుల్లో సాధారణ ఛార్జీలే

అమరావతి: దసరా పండుగ కోసం సొంతూళ్లకు వెళ్లేవారి కోసం ఏపీఎస్ఆర్టీసీ అదిరిపోయే వార్త చెప్పింది.అక్టోబర్ 4 నుంచి 20 వరకు 6 వేల 100 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. అంతే కాకుండా రాను పోను టికెట్ బుకింగ్ చేసుకున్న వారికి టికెట్ ధరలో 10 శాతం రాయితీ సైతం ఇవ్వనుంది.

దసరా పండుగ రద్దీ దృష్ట్యా ప్రతి ప్రయాణికుడినీ సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేలా ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. నవరాత్రుల్లో తిరుమల సహా అమ్మవారి ఆలయాలు కిక్కిరిసి పోతుండటంతో, ఆ యాప్రాంతాలకు బస్సులు ఏర్పాటు చేయడంలో అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. పెద్దఎత్తున ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించిన ఆర్టీసీ, ఈ మేరకు అన్ని రకాలు ఏర్పాట్లు చేసింది.

ప్రత్యేక బస్సుల్లో ఎక్కడా అదనపు ఛార్జీలు వసూలు చేయకపోగా, టికెట్ ఛార్జీలపై ప్రత్యేక రాయితీలు ఇవ్వాలని నిర్ణయించారు. ప్రత్యేక బస్సులన్నింటిలోనూ సాధారణ బస్సుల్లో ఛార్జీలనే వసూలు చేయనుండగా, ఈ సారి రాను పోను టికెట్ బుకింగ్ చేసుకున్న వారికి టికెట్ ధరలో 10 శాతం రాయితీ ఇవ్వనుంది. హైదరాబాద్, విజయవాడ, తిరుపతి మధ్య నడిచే ఎసీ బస్సుల్లోనూ టికెట్ ఛార్జీపై పది శాతం రాయితీ అమలు చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది.

6 వేల 100 ప్రత్యేక బస్సులు

శరన్నవరాత్రులు సహా దసరా పండుగ రద్దీ దృష్ట్యా ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రముఖ దేవీ ఆలయాలు సహా పలు పుణ్యక్షేత్రాలకు రద్దీ ఎక్కువగా ఉంటుందని భావించి ఆ మేరకు అదనపు బస్సులను ఆర్టీసీ ఏర్పాటు చేసింది. ఈ నెల 3 నుంచి దేవీ శరన్నవరాత్రులు ప్రారంభం కానుండటంతో అప్పట్నుంచీ బస్సులను అందుబాటులో ఉంచనున్నారు.

రద్దీ దృష్ట్యా రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాలకు 6 వేల 100 ప్రత్యేక బస్సులు ఆర్టీసీ సిద్ధం చేసింది. దసరా పండుగ ముందు రోజుల్లో ఈనెల 4 నుంచి 11 వరకు 3 వేల 40 బస్సులు ఏర్పాటు చేసింది. దసరా పండుగ తర్వాత రోజుల్లో ఈ నెల 12 నుంచి 20 వరకు 3వేల 60 బస్సులు నడపాలని ఏర్పాట్లు చేసింది.

ప్రత్యేక బస్సుల్లో సాధారణ ఛార్జీలే

ఏపీలోని అన్ని జిల్లా కేంద్రాలు, సహా ముఖ్య నగరాలు, పట్టణాలు ,ఆధ్యాత్మిక కేంద్రాలకు అదనపు బస్సులు ఏర్పాటు చేసింది. విశాఖపట్నం, విజయవాడ, కర్నూలు, రాజమహేంద్రవరం, తిరుపతి, అనంతపురం, విజయనగరం, కాకినాడ, భీమవరం, అమలాపురం, కడప, శ్రీశైలం, మార్కాపురం, ఒంగోలు, తుని, శ్రీకాకుళం, నెల్లూరు , భద్రాచలం తదితర ప్రాంతాలకు బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ వెల్లడించింది.

హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, సహా పొరుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలకూ రాను పోను ఆర్టీసీ బస్సులు నడపాలని నిర్ణయించింది. ప్రయాణికులపై భారం మోపకూడదని నిర్ణయించిన ఏపీ ప్రభుత్వం, ప్రత్యేక బస్సుల్లో సాధారణ ఛార్జీలనే వసూలు చేయాలని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావును ఆదేశించింది.

ముందస్తు రిజర్వేషన్ చేసుకునే సౌకర్యం

అన్ని బస్సుల్లోనూ సాధారణ బస్సు టికెట్ల ధరనే వసూలు చేయాలని ఎండీ అన్ని డిపోలకూ ఆదేశాలు జారీ చేశారు. దూర ప్రాంతాలకు నడిచే అన్ని బస్సుల్లోనూ ముందస్తుగా టికెట్లను బుకింగ్ చేసుకునే సదుపాయం కల్పించినట్లు ఎండీ వెల్లడించారు. నవరాత్రుల్లో బెజవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ దర్శనానికి భక్తులు విశేష సంఖ్యలో వస్తారు.

సాధారణ భక్తులతో పాటు భవానీలు పెద్దఎత్తున తరలివస్తారు. ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి, గుంటూరు, ప్రకాశం తదితర జిల్లాల నుంచి అత్యధికంగా వస్తారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ప్రాంతాల్లోనూ ఆయా బస్ డిపోల నుంచి అదనపు బస్సులు సమీకరించుకుని ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

చిల్లర గురించి ఇక చింత అవసరం లేదు: హైదరాబాద్, సహా పలు నగరాల నుంచి సైతం ప్రజలు పెద్దఎత్తున తరలివస్తారని భావించి విజయవాడ మీదుగా వెళ్లేలా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. విజయవాడ సహా హైదరాబాద్ బస్టాండ్లలో ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా అన్ని రకాల సదుపాయాలను కల్పిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

ప్రత్యేక బస్సుల ప్రణాళికను రూపొందించనప్పటికీ అప్పటికప్పుడు ఊహించని రీతిలో రద్దీ వచ్చినా ఎవరికీ ఇబ్బంది కలగకుండా ప్రతి డిపో పరిధిలోనూ అదనంగా బస్సులను సిద్దంగా ఉంచాలని ఆర్టీసీ నిర్ణయించింది. అన్ని జిల్లాల నుంచి విజయవాడకే 1100 బస్సులు నడిపేలా అధికారులు ప్రణాళిక సిద్దం చేసుకున్నారు.

బస్సుల్లో చిల్లర సమస్య లేకుండా ఉండేందుకు యూటీఎస్ మిషిన్ల ద్వారా ఫోన్ పే, గుగూల్ పే, సహా క్యూఆర్ కోడ్లను స్కాన్ చేయడం, క్రెడిట్, డెబిట్ కార్డులు, ద్వారా చెల్లింపులు జరిపే ఏర్పాట్లు చేసినట్లు ఆర్టీసీ తెలిపింది.

ఛార్జీలో 10 శాతం రాయితీ

ప్రత్యేక బస్సుల్లో రాను పోను ముందస్తు రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులకు ఛార్జీలో 10 శాతం రాయీతీని వర్తింపజేయాలని నిర్ణయించింది. అంతే కాకుండా ఈ సారి విజయవాడ – హైదరాబాద్, బెంగళూరు మధ్య తిరిగే అన్ని అమరావతి, డాల్ఫిన్ క్రూయిజ్ ఎసీ బస్సుల్లో టికెట్పై 10 శాతం ప్రత్యేక రాయితీ అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికులంతా ఆర్టీసీ బస్సుల్లో ఎక్కి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు.

శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్బంగా తిరుమలకు అత్యధిక సంఖ్యలో భక్తులు వస్తారని అంచనా వేసిన ఆర్టీసీ, ఎవరికీ ఇబ్బంది కలగకుండా అదనపు బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపింది. ఈ నెల 4 నుంచి 12 వరకు తిరుమల – తిరుపతి మధ్య ప్రతి రోజూ 1930 ట్రిప్పులు తిప్పాలని ఏర్పాటు చేసింది. గరుడ సేవ సహా ఆ తర్వాతి రోజుల్లో ఈ నెల 8, 9 తేదీల్లోనూ 2 వేల 714 ట్రిప్పులను తిప్పేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.

LEAVE A RESPONSE