– రాష్ట్ర ఖజానా ఖాళీ – ఉద్యోగుల జీతాలకూ సమస్యే
– పెట్టుబడుల ఆహ్వానం – కేవలం మాటల మూటలే
– బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్
హైదరాబాద్: తెలంగాణ ధనిక రాష్ట్రంగా ఏర్పడినప్పటికీ, గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం పాలనలో విఫలమై, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్ విమర్శించారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న తప్పుడు ఆర్థిక నిర్ణయాలు, దుబారా ఖర్చులు, రాజకీయ నియామకాలు, కోట్లాది రూపాయల ప్రజాసొమ్ముతో అడ్వర్టైజ్ మెంట్ల వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, తక్షణమే రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీ ప్రకటించాల్సిన అవసరమన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గమనించి, తక్షణమే ఆర్థిక ఎమర్జెన్సీ ప్రకటించాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేస్తున్నామని.. ఇదే విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి దృష్టికీ తీసుకెళ్తామని ఎన్వీఎస్ఎస్ తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం ఖజానా గుల్లకావడంతో ఉద్యోగులకు జీతభత్యాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితికి మించి రాష్ట్రం చేరుకోవడమంటే ప్రమాదఘంటికలను తెలియజేస్తోంది. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ రకమైన దిగజరారిన ఆర్థిక దుస్థితి లేదన్న విషయాన్ని తెలియజేస్తున్నామని ప్రభాకర్ వెల్లడించారు. అయితే, వన్ ట్రిలియన్ వ్యవస్థ దిశగా ముందుకెళ్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనడం చాలా విడ్డూరంగా ఉందన్నారు.
నెలవారీ అప్పుల ప్రణాళికతో ముందుకెళ్తూ, త్రైమాసికం, అర్ధవార్షికం, వార్షిక ఆదాయ వనరులను సమకూర్చుకునే విషయాన్ని కూడా పూర్తిగా గాలికొదిలేశారని ఆయన విమర్శించారు. అదేవిధంగా గత బడ్జెట్ వివరాలను గమనిస్తే.. పన్నుల ఆదాయం, పన్నేతర ఆదాయం, బయట నుంచి వచ్చే అప్పులన్నీ చూసకుంటే.. నికరంగా తగ్గకుండా వచ్చేది కేవలం కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న గ్రాంట్ల ద్వారానేనని పక్కాగా తెలియజేశారు.
కొత్త అప్పుల కోసం బ్యాంకులను బెదిరించడం రాష్ట్ర ఆర్థిక సంక్షోభాన్ని ప్రతిబింబిస్తోంది. వివాదాల్లో ఉన్న భూములు, న్యాయ చిక్కుల్లో ఉన్న భూములను కార్పొరేషన్లకు కేటాయించి, వాటిని తనఖా పెట్టి రుణం పొందాలని చూస్తున్నారు. కార్పొరేషన్లకు కేటాయించిన భూముల ద్వారా కొత్త అప్పులు ఇవ్వకుంటే.. తమ బ్యాంకులలో ప్రభుత్వ అకౌంట్లను తప్పించి, డిపాజిట్లు తీసేస్తామని బెదిరిస్తున్నట్లుగా తెలుస్తోంది. కొత్త అప్పుల కోసం బ్యాంకుల ఉన్నతాధికారులను బెదిరింపులకు గురిచేయడం దుర్మార్గం. కార్పొరేషన్లకు కేటాయించిన భూములతో బ్యాంకులపై ఒత్తిడి తెచ్చి రుణం పొందాలనుకోవడం అనైతికమని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం 35 కొత్త కార్పొరేషన్లకు రాజకీయ నియామకాలు చేసింది. ఈ నియామకాల కారణంగా కొత్తగా ఆఫీసులు, సలహాదారులు, ఇతర సిబ్బంది జీతభత్యాలు, గౌరవ వేతనాలతో భారం ఖజానాపై పడింది. ప్రజాసొమ్మును దుర్వినియోగం చేయడంపైనే రాష్ట్ర ప్రభుత్వం ఆధారపడింది.
రాష్ట్ర ప్రభుత్వం కొత్త కార్యక్రమం లేదా సంక్షేమ పథకాల ప్రచారానికి కోట్లాది రూపాయలు ఖర్చు చేయడం అనవసరం. రాష్ట్ర ఆదాయం పెరగడం లేదు, కానీ ప్రభుత్వం భారీ వ్యయాలకు పాల్పడుతోందని ఎన్వీఎస్ఎస్ మండిపడ్డారు. నెలనెలా పాలన గడవాలంటే ఎంత అప్పు చేయాలనే దానికోసం ప్రత్యేకంగా క్యాలెండర్ సిద్ధం చేసుకోవడం విచారకరం. రాష్ట్ర ప్రభుత్వ తీరుతో తెలంగాణ రాష్ట్రం ఆర్థిక పరిస్థితి మరింతగా దిగజారే ప్రమాదం ఉంది. ధనిక రాష్ట్రంగా ఏర్పడ్డ తెలంగాణలో ప్రభుత్వ ఆస్తులు కరిగిపోతున్నాయి. కాని రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రుల ఆస్తులేమో పెరిగిపోతున్నాయని ఆరోపణలు గుప్పించారు. రాష్ట్ర ప్రభుత్వం దుబారా ఖర్చులను ఆపాలంటే, ఖజానా గుల్లకాకుండా చూడాలని, ఆదాయ వనరులను సరిగ్గా ఖర్చుపెట్టాలని, రానున్న 2-3 నెలలు చాలా క్లిష్టమైనవని ఆయన సూచించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రానికి కొత్త పెట్టుబడుల విషయంలో వివిధ విదేశీ కంపెనీలు, సంస్థలతో ఎంవోయూలు కుదుర్చుకున్నట్లు చెబుతున్నప్పటికీ, రాష్ట్రంలో గత ఏడాది కాలంలో ఎక్కడా కొత్త కంపెనీలు ప్రారంభించిన దాఖలాల్లేవు. కొత్త పరిశ్రమలు ఏర్పడకపోవడం ఆర్థిక విధానాల వైఫల్యాన్ని స్పష్టంగా ఎత్తిచూపుతోంది. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి. ఆర్థికవేత్తలతో సమావేశం నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాం.
రాజకీయ నియామకాలను రద్దు చేసి, దుబారా ఖర్చులను ఆపాలి. తెలంగాణ ప్రజల భవిష్యత్తును కాపాడేందుకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గమనించి, తక్షణమే ఆర్థిక ఎమర్జెన్సీ ప్రకటించాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇదే విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి దృష్టికీ తీసుకెళ్లి, రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం, పరిస్థితులపై ఫిర్యాదు చేస్తామని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ స్పష్టం చేశారు.