Suryaa.co.in

Andhra Pradesh

ఆదివాసీల జీవితాల్లో వెలుగులు నింపిన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్

– విద్యుత్ లేని 1750 ఆదివాసీల గృహాలను గుర్తించిన కూటమి ప్రభుత్వం
– 956 మంది గిరిజన గృహాలకు విద్యుత్ సరఫరా కల్పించిన మంత్రి గొట్టిపాటి
– టైగర్ రిజర్వ్ జోన్ లోని 611 కుటుంబాలకి సోలార్ బ్యాటరీతో విద్యుత్ సరఫరా

అమ‌రావ‌తి: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ఆదివాసీల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. ప్రకాశం జిల్లాలోని యర్రగొండపాలెం నియోజకవర్గంలోని పలు ఆదివాసీ తండాల్లో విద్యుత్ కాంతులను వెలిగిస్తున్నారు. యర్రగొండపాలెం నుంచి శ్రీశైలం వెళ్లే మార్గ మధ్యలో ఉన్న కొన్ని తాండాలు స్వాతంత్ర్యం వచ్చి ఏళ్లు గడిచినా కానీ ఇప్పటికీ విద్యుత్ కాంతులకు నోచుకోలేదు. దీనిని గుర్తించిన మంత్రి గొట్టిపాటి రవి కుమార్ విద్యుత్ ఉద్యోగులతో సర్వే నిర్వహించారు.

మొత్తంగా 1750 ఆదివాసీల గృహాలు విద్యుత్ సరఫరాకు దూరంగా ఉన్నాయని మంత్రి దృష్టికి వచ్చింది. తక్షణమే ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకుని వెళ్లారు. ఎలా అయినా సరే ఆ గిరిజన గ్రామాల్లో వెలుగులు నింపాలని పూర్తి స్థాయిలో సోలరైజేషన్ కు అనుమతి ఇచ్చారు.

దీంతో సుమారు రూ. 2.20 కోట్లతో ఆరు గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు పనులు పూర్తి చేసి 956 గిరిజన గృహాలకు విద్యుత్ సరఫరా కల్పించారు మంత్రి గొట్టిపాటి రవి కుమార్. ఇంకా 611 కుటుంబాలు టైగర్ రిజర్వ్ జోన్ లో ఉన్నాయి. వాటిని కూడా అతి త్వరలోనే సోలార్ బ్యాటరీతో నిరంతర విద్యుత్ సరఫరా అందిస్తామని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవి కుమార్ మాట్లాడారు. గిరిజనుల్లో చెంచులు చాలా పేదరికంలో ఉన్నారు. వారి జీవన ప్రమాణాలు మెరుపరిచేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. పేదల సేవే మాధవ సేవ అని ప్రభుత్వం నమ్ముతుందని అన్నారు. దీనిలో భాగంగానే పలు గిరిజన తండాల్లో విద్యుద్దీకరణ చేపట్టినట్లు పేర్కొన్నారు. త్వరలోనే టైగర్ జోన్ లో ఉన్న మిగిలిన చెంచుల కుటుంబాలకు సోలార్ ద్వారా విద్యుద్దీకరణ చేపడుతామని స్పష్టం చేశారు.

అలానే చెంచుల వ్యవసాయానికి సోలార్ ద్వారా కరెంటు ఇస్తామని హామీ ఇచ్చారు. అన్ని విధాల ప్రభుత్వం నుంచి వారికి సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు. చెంచులకు ఉపాధి హామీ పథకంలో భాగంగా పని దినాలు కల్పిస్తామని మంత్రి గొట్టిపాటి హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వంలోనే గిరిజనులకు సమాన హక్కులు కల్పన జరుగుతోందని మంత్రి స్పష్టం చేశారు.

LEAVE A RESPONSE