ప్రెస్ క్లబ్ సభ్యుల హక్కుల పరిరక్షణ సమితి ఆవిర్భావం

– సూరజ్ వి. భరద్వాజ్ పై అక్రమంగా బనాయించిన పోలీసు కేసు వాపస్ తీసుకోవాలి
– ప్రెస్ క్లబ్ ఎన్నికల నిర్వహణలో జరిగిన అవకతవకలపై పూర్తిస్థాయి దర్యాప్తు జరపాలి

హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో జరుగుతున్న పరిణామాలపై సీనియర్ జర్నలిస్టులతో ఒక రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. క్లబ్ ప్రాంగణంలో జరిగిన ఈ మీటింగుకు సీనియర్ జర్నలిస్టు సత్యమూర్తి అధ్యక్షత వహించారు. ప్రస్తుతం క్లబ్ లో చోటుచేసుకుంటున్న వరుస సంఘటనలపై రౌండ్ టేబుల్ సమావేశం తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.

ప్రెస్ క్లబ్ పై జరుగుతున్న దుష్ప్రచారాన్ని సమావేశం తీవ్రంగా ఖండించింది. ఇటీవల ముగిసిన ప్రెస్ క్లబ్ ఎన్నికల పోలింగ్, ఆ తరవాత చోటు చేసుకున్న ఘటనలపై ఆందోళన వ్యక్తంచేసింది. పోటీ చేసిన అభ్యర్థులలో ఒకరిద్దరిని లక్ష్యంగా చేసుకొని కక్ష్య సాధింపులకు దిగడంపై కూడా రౌండ్ టేబుల్ సమావేశం ఆగ్రహం వ్యక్తం చేసింది.

పోలింగ్ సమయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రవర్తించిన తీరుపై రౌండ్ టేబుల్ పై కూలంకషంగా చర్చ జరిగింది. ఆయన వ్యవహరశైలిని సమావేశం తప్పుబట్టింది. సభ్యులు కానీ వ్యక్తులను ఓటింగ్, కౌంటింగ్ సమయాల్లో ప్రవేశించడం, గుర్తింపు కార్డు లేకుండానే ప్రెస్ క్లబ్ ఎన్నికల ఓటింగ్ కు అనుమతించడంలో ఎన్నికల అధికారులు ప్రదర్శించిన నిర్లక్ష్య ధోరణిపై ఆక్షేపణ వ్యక్తం చేసింది.

ఈ పరిస్థితుల్లో ప్రెస్ క్లబ్ గౌరవాన్ని కాపాడటానికి, సభ్యుల హక్కులను పరిరక్షించడానికి నాన్ కంటెస్టెంట్, సీనియర్ సభ్యులతో ఒక కమిటీ ఏర్పాటు చేయాలని రౌండ్ టేబుల్ సమావేశం నిర్ణయించింది. దీనికి ప్రెస్ క్లబ్ సభ్యుల హక్కుల పరిరక్షణ సమితి అని నామకరణం చేయడం జరిగింది. సభ్యుల హక్కుల పరిరక్షణకు ఈ కమిటీ ఒక రోడ్ మ్యాప్ ను రూపొందించి అమలుచేస్తుంది.
ఈ కింది తీర్మానాలను సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది.

1. ప్రెస్ క్లబ్ ఎన్నికల నిర్వహణలో జరిగిన అవకతవకలపై పూర్తిస్థాయి దర్యాప్తు జరపాలి.
2. సూరజ్ వి. భరద్వాజ్ పై అక్రమంగా బనాయించిన పోలీసు కేసు వాపస్ తీసుకోవాలి.
3. ఎన్నికల ఫలితాలపై కోర్టు ఇచ్చిన స్టే ను ఔట్ గోయింగ్ ఈసీ అమలుచేయాలి.
4. ప్రెస్ క్లబ్ కు ఉన్న చట్టబద్ధతపై రిజిస్ట్రార్ ఆఫ్ సొసైటీస్ కు ఫిర్యాదు చేయాలి. క్లబ్ ను లీగలైజ్ చేయాలి.
5. కోర్టు కేసుల్లో భారీగా ఇంప్లీడ్ కావాలి. కోర్టు ధిక్కరణపై సమీక్ష జరపాలి.
6. ఎన్నికల రీ షెడ్యూల్ కోసం అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాలి.

Leave a Reply