– రూపొందించిన తెలంగాణ ఉద్యోగుల జేఏసీ
– వైద్య శాఖ మంత్రికి సమర్పించిన చైర్మన్ వి.లచ్చిరెడ్డి
– తొలగిపోనున్న మెడికల్ రీయిబర్స్‌మెంట్ ఇబ్బందులు
– ఆపద సమయంలో ఉద్యోగులపై ఆర్థిక భారం లేకుండా చర్యలు
– అపరిమిత నగదు రహిత సేవలతో ఈహెచ్ఎస్ అమలు చేయాలని సూచన
– జీవో నం.317ను రద్దు చేసి బాధిత ఉద్యోగులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులు, ఫెన్షనర్లు, వారిపై ఆధారపడ్డ కుటుంబ సభ్యుల కోసం ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్(ఈహెచ్ఎస్)ను అమలు చేయాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ కోరింది.
ఈ మేరకు వివిధ ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి నూతన ఈహెచ్ఎస్ విధానం అమలు కోసం ఒక ముసాయిదాను రూపొందించి ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనను తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి, పలువురు జేఏసీ నాయకులు రాష్ట్ర వైద్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ్మ కి బుధవారం అందజేశారు.
ఈ సందర్భంగా లచ్చిరెడ్డి ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్న హెల్త్ స్కీంలో ఉన్న లోటు పాట్లు, కొత్తగా ప్రతిపాదించిన హెల్త్ స్కీంతో ఉద్యోగులకు, వారి కుటుంబాలకు కలిగే ప్రయోజనాలు, తద్వారా ప్రభుత్వానికి వచ్చే పేరు గురించి మంత్రికి వివరించారు.
కొత్త ప్రతిపాదనలతో ప్రభుత్వానికి భారం లేకుండా ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందే వైద్య సేవల గురించి మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
దీంతోపాటు రాష్ట్రంలో గత ప్రభుత్వం తీసుకొచ్చిన 317 జీవోతో ఉద్యోగులు పడుతున్న కష్టనష్టాల గురించి మంత్రికి వివరించారు. వెంటనే జీవో నెంబర్ 317 ను రద్దుచేసి ఉద్యోగులకు న్యాయం చేయాలని మంత్రిని లచ్చిరెడ్డి కోరారు.