– ఇన్చార్జి డైరక్టర్‌గా కల్యాణి నియామకం
– రెడ్డిగారికి మళ్లీ పొడిగింపు ఇవ్వని సర్కారు
– ‘సూర్య’ వార్తా కథనం ఎఫెక్ట్
– మరి ఆ నలభై ఆర్డర్ల సంగతేంటి?
– తేల్చాల్సిందేనంటున్న ఉద్యోగ సంఘాలు
– కొనసాగుతున్న పేషీ పెత్తనాలకు తెరదించేదెవరు?
– ఆడిట్‌పై ఆ మూడు పేషీల పెత్తనం?
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఆర్ధిక శాఖలో కీలకమైన ఆడిట్ డిపార్ట్‌మెంట్ డైరక్టర్ పంచాయతీకి సర్కారు ఎట్టకేలకు తెరదింపింది. నాధుడు లేని ఆడిట్ డిపార్టుమెంట్‌లో ఎదురవుతున్న సమస్యలు, మళ్లీ తననే కొనసాగించాలంటూ అంతకుముందు ఇన్చార్జి డైరక్టర్‌గా కొనసాగిన హరిప్రకాష్‌రెడ్డి వ్యవహారంపై ‘సూర్య’లో రాసిన వార్తా కథనానికి ప్రభుత్వం స్పందించింది. దానితో ప్రస్తుతం అడిషనల్ డైరక్టర్‌గా ఉన్న కల్యాణిని ఇన్చార్జిగా నియమిస్తూ, ఆర్ధిక శాఖ కార్యదర్శి జె.నివాస్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ఈనెల 4వ తేదీన ‘ఆర్ధిక శాఖకు దిక్కెవరు’ పేరుతో, ‘సూర్య’లో వార్తా కథనం వెలువడిన విషయం తెలిసిందే.ఇది కూడా చదవండి: ఆర్ధిక శాఖకు దిక్కెవరు
వైసీపీ హయాంలో నాటి ఆర్ధిక శాఖ కార్యదర్శి సత్యనారాయణతో కలసి చక్రం తిప్పిన హరిప్రకాష్‌రెడ్డిని, వివిధ ఫిర్యాదులతో దాదాపు 15 నెలలు ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వకుండా దూరంగా పెట్టింది. అయితే హరిక్రాష్‌రెడ్డి రిటైరయ్యే నాలుగురోజుల ముందు.. నివాస్ ఆయనకు ఇన్చార్జి డైరక్టర్‌గా పోస్టింగ్ ఇచ్చారు. దానితో రెడ్డిగారు ఆ నాలుగురోజుల్లోనే, దాదాపు 40 ఆర్డర్లను ఈ-ఆఫీస్ నుంచి కాకుండా, హార్డ్‌కాపీలతోనే ఇచ్చేశారన్న ఫిర్యాదులు వెళ్లాయి.
పైగా తనకు మరో ఆరునెలల పొడిగింపు ఇవ్వాలంటూ ఆయన పెట్టుకున్న ఆర్జీపై, ఒక అధికారి సానుకూలంగా స్పందించి, ఫైలును ప్రభుత్వానికి పంపే ఉత్సాహంలో ఉన్నట్లు ఆర్దిక శాఖలో ప్రచారం జరిగింది. ఈ క్రమంలో ఆర్ధికశాఖలో జరుగుతున్న ఈ తెరచాటు వ్యవహారాలపై, ‘సూర్య ’లో వార్తా కథనం వెలువడింది. దీనితో ఉలిక్కిపడిన పెద్దసార్లు.. రెడ్డిగారిని రిటైరగానే సాగనంపారు.
కానీ ఆ తర్వాత ఖాళీగా ఉన్న ఇన్చార్జి డైరక్టర్ పోస్టును, ఆర్ధిక శాఖ కార్యదర్శి భర్తీ చేయలేదు. ఫలితంగా నాలుగైదు రోజులు కీలకమైన ఆడిట్ డిపార్టుమెంట్‌కు నాధుడు దిక్కులేకుండా పోయిన పరిస్థితిని, ‘సూర్య ’ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లింది. దానితో స్పందించిన సర్కారు, అదే విభాగంలో అడిషనల్ డైరక్టర్‌గా ఉన్న కల్యాణిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇంతవరకూ బాగానే ఉన్నప్పటికీ.. హరిప్రకాష్‌రెడ్డి జారీ చేసిన ఆ 40 హార్డ్ కాపీ ఉత్తర్వుల సంగతేమిటన్నది ప్రశ్నగా మారింది. అసలు వాటిని ఎవరయాన సిఫార్సు చేశారా? లేక హరిప్రకాష్‌రెడ్డి తనకున్న అధికారంతో ఉత్తర్వులిచ్చారా? అన్నది తేలాల్సి ఉంది. దీనిపై ఉద్యోగులు ఆగ్రహంతో ఉన్నారు. హరిప్రసాద్‌రెడ్డి నిర్వాకం వల్ల.. తమలో ఎంతమంది నష్టపోయారన్నది తెలియడం లేదని, కారణం వాటిని ఈ- ఆఫీసులో పంపకపోవడమేనంటున్నారు. దీనిపై ఉద్యోగ సంఘాలు తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
ఇదిలాఉండగా.. ఆడిట్ డిపార్టుమెంట్‌పై ఆర్ధిక మంత్రి పేషీతోపాటు, మరో ఇద్దరు ఐఏఎస్ పేషీల నుంచి విపరీతమైన సిఫార్సులు వస్తున్నాయని ఉద్యోగులు చెబుతున్నారు. బహుశా హరిప్రకాష్‌రెడ్డి ఇచ్చిన ఆ 40 ఆర్డర్లు కూడా, ఆ మూడు పేషీల నుంచి వచ్చినవేనని తాము అనుమానిస్తున్నామని చెప్పారు. ఆ 40 ఆర్డర్లలో ప్రమోషన్లు, డిప్యుటేషన్లు ఉన్నందున.. ఆ మూడు పేషీల నుంచి ఎవరు, ఎవరికి సిఫార్సు చేశారన్నది తేలాల్సి ఉంది. దీనిని తాము వదిలిపట్టేది లేదని ఓ ఉద్యోగ సంఘం నేత స్పష్టం చేశారు.