Suryaa.co.in

Telangana

ఇంత కక్ష ఎందుకు?

పచ్చని తెలంగాణలో నిప్పు రాజేసే కుట్రలు సాగుతున్నాయి. రైతన్నల జీవితాలను దుర్భరం చేసేందుకు బీజేపీ నాయకులు సిద్ధమయ్యారు. వరి ధాన్యం ఉత్పత్తిలో దేశంలో రెండోస్థానంలో నిలవడమే తెలంగాణకు శాపమైంది. విత్తనోత్పత్తికి రాజధానిగా మారడమే తెలంగాణకు పాపమైంది. దినదిన ప్రవర్థమానమై ఎదిగిపోతున్న తెలంగాణపై కేంద్రం అంతులేని వివక్ష ప్రదర్శిస్తున్నది.
రాష్ట్రం నుంచి వరిధాన్యం కొనేది లేదని తెగేసి చెప్పటంతో రైతన్న పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేసే అవకాశాలున్నా, కేంద్రం ఉదాసీన వైఖరితో సాధ్యం కావడం లేదని బియ్యం వ్యాపారులు వాపోతున్నారు. దీంతో వందల రైస్‌మిల్లులు మూతపడి, వేల మందికి ఉపాధి కరువైందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్‌ వ్యాపారులు విత్తన వరిని సాగు చేయించి నేరుగా సేకరిస్తున్నారు.
ప్రాసెసింగ్‌ చేసి ఇతర రాష్ర్టాలు, విదేశాలకు కూడా సరఫరా చేస్తున్నారు. మిగతా పొలాల్లో పండిన ధాన్యాన్ని రైతులు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తున్నారు. దీంతో అన్నదాతలకు కొన్నేండ్లుగా ధాన్యాన్ని అమ్ముకోవడానికి ఎలాంటి ఇబ్బంది రాలేదు. అంతా బాగుందనుకుంటున్న వేళ వడ్లు కొనబోమని కేంద్రం చెప్పడం రైతన్నలకు శరాఘాతమైంది.
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలు అనేక వ్యవస్థలకు ముప్పు తెచ్చాయి. ఇప్పటికే దడువాయి వ్యవస్థ పోయింది. ఎడ్ల బండ్ల కార్మికులు వెనక్కిపోయారు. హమాలీలు దెబ్బతిన్నారు. రైతులు, రైతు కూలీలకు నష్టం తెచ్చిన ఈ చట్టం అవసరమా? బాయిల్డ్‌ రైస్‌ తీసుకునేది లేదని చెప్పి, ఇప్పు డు వేల మంది ఉపాధిని దెబ్బతీస్తున్నది.
అనంతకాల గమనంలో ఏడేండ్లు అతి స్వల్పం. ఒక ప్రాంత ప్రస్థానంలో, ఒక రాష్ట్ర అస్తిత్వంలో, ఒక ప్రభుత్వ పాలనలో, ఒక నాయకుడి చరిత్రలో ఏడేండ్లు ఎంత? దశాబ్దాలుగా దయనీయంగా ఉండిపోయిన ఒక రంగాన్ని ఉద్ధరించడానికి ఏడేండ్లు ఏ మూలకు? కానీ జనహితమనే సంకల్పంతో, మేధోమథనమనే దీక్షతో, మనో వేదికపై తపస్సు చేసి, కార్యక్షేత్రంలో కష్టపడితే ఏడేండ్లలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. విప్లవాలు వికసిస్తాయి! అశ్రుధారలు కారిన కళ్లనుంచే ఆనందబాష్పాలు రాలుతాయి.
కూలిన బతుకుల్లోంచే కొత్త జీవితాలు ఉదయిస్తాయి. బీడువారిన పొలాల్లోనే పచ్చలహారాలు ప్రసరిస్తాయి. అందుకు నిదర్శనం నేటి తెలంగాణ సాగు పత్రం, రైతు చిత్రం! నెర్రెలిచ్చి ఎర్రబారిన తెలంగాణ నేలకు జీవ జలాన్ని పంచి, జవజీవాలను పెంచిన నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్‌. తన జనంపై, తన జలంపై, తన జన్మభూమిపై మనసు నిండా ప్రేమ నిండిన కేసీఆర్‌ కన్న కలలకు సజీవ తార్కాణం నేటి తెలంగాణ!
తెలంగాణ వ్యవసాయం ఏడేండ్లలో ఎంత మారింది? ఎలా మారింది? ఎవరివల్ల మారింది? అందుకు కారకుడు, ప్రేరకుడు కేసీఆర్‌. నూతన తెలంగాణ రాష్ట్రం లో ఆరు నూరైనా వ్యవసాయరంగాన్ని పునరుజ్జీవింపజేసి, తద్వారా గ్రామీణ ఆర్థికవ్యవస్థను పరిపుష్టం చేయాలనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరింది. మిషన్‌ కాకతీయతోపాటు, సాగునీటి ప్రాజెక్టులను నిర్మించి కోటి ఎకరాల మాగాణంగా తెలంగాణను తీర్చిదిద్దడంలో విజయం సాధించాం.
రాష్ట్ర వ్యవసాయరంగ ముఖచిత్రాన్ని గుణాత్మకంగా మార్చివేశాం. తెలంగాణ రైతుకు నేడు వ్యవసా యం మీద ధీమా పెరిగింది. అంకితభావంతో, రైతు సం క్షేమం వ్యవసాయాభివృద్ధి పట్ల చిత్తశుద్ధితో, తెలంగాణ ప్రభుత్వం కార్యాచరణ చేపట్టడం వల్లనే అనుకొన్న లక్ష్యాన్ని చేరుకోగలిగాం.

-పువ్వాడ అజయ్‌కుమార్‌
(తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి)

LEAVE A RESPONSE